ఒక్క మెసేజ్ తో చిక్కిన 14 మంది 'మత్తు' వీరులు
‘‘భాయ్ బచ్చ ఆగయా" అనే ఒకే ఒక్క మెసేజ్ మత్తు పదార్థాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న 14 మందిని బయటపెట్టింది.
By: Tupaki Desk | 14 July 2025 10:56 AM IST‘‘భాయ్ బచ్చ ఆగయా" అనే ఒకే ఒక్క మెసేజ్ మత్తు పదార్థాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న 14 మందిని బయటపెట్టింది. ఈ 14 మందిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ప్రాపర్టీ మేనేజర్లు మాత్రమే కాకుండా ఒక నాలుగేళ్ల చిన్నారితో వచ్చిన దంపతులు కూడా ఉన్నారు. వీరంతా మత్తు పదార్థాలకు బానిసలైనవారే.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ పోలీస్ విభాగంలో "ఈగల్" అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం సాధారణ పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్‌లపై దాడులు చేయడమే కాకుండా, మత్తు పదార్థాల సరఫరా మూలాలపై దృష్టి సారిస్తుంది.ఈగల్ విభాగం మఫ్టీలో పనిచేస్తూ విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సేకరించి, డీలర్లను గుర్తించి, ట్రాప్ వేసి ప్రజల ప్రాణాలను కాపాడుతుంది. మత్తు పదార్థాల సరఫరాదారుల మీదే కాకుండా, వినియోగదారులపైన కూడా సమానమైన దృష్టితో నిఘా పెట్టడం ఈ విభాగం ప్రత్యేకత.
-ఒక డీలర్.. వంద నంబర్లు.. ఒక మెసేజ్.. అడ్డంగా బుక్కైన 14 మంది
ఈగల్ నిర్వహించిన తాజా ఆపరేషన్‌లో సందీప్ అనే డీలర్ పోలీసుల చేతికి చిక్కాడు. అతని ఫోన్‌లో ఉన్న వినియోగదారుల నంబర్లను సేకరించి “భాయ్ బచ్చ ఆగయా” అనే సందేశాన్ని పంపారు. ఆ మెసేజ్ వచ్చిన కేవలం రెండు గంటల్లోనే 14 మంది ఇచ్చిన లొకేషన్‌కు చేరుకున్నారు. వారంతా సామాన్య ప్రజలు కాదు.. విద్యార్థులు, కార్పొరేట్ ఉద్యోగులు, దంపతులు, పిల్లలతో కూడిన కుటుంబాలు కూడా ఉన్నారు. వారిపై నిర్వహించిన పరీక్షల ద్వారా వారందరూ మత్తు పదార్థాల వినియోగదారులని నిర్ధారించారు. వెంటనే వారిని డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించి కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు.
-మత్తు పదార్థాలకు ముగింపు ఘట్టం మొదలైంది
ఈగల్ వ్యవస్థ పనితీరుతో ఇప్పుడు హైదరాబాద్‌లో మత్తు పదార్థాల లభ్యత తగ్గిపోయింది. దీనివల్ల అక్రమ వ్యాపారులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నా, ఈగల్ వారి పథకాలను ముందుగానే గుర్తించి అడ్డుకుంటోంది. మత్తు పదార్థాలను సరఫరా చేసే వారిపై ప్రభుత్వానికి ఉన్న కఠిన వైఖరి ఇప్పుడు వినియోగదారులపైన కూడా వర్తిస్తోంది.
-సమాజానికి హెచ్చరిక
ఈ సంఘటన సమాజానికి ఒక గట్టి హెచ్చరిక. తాత్కాలిక ఆనందం కోసం మత్తు పదార్థాలను ఆశ్రయించడం ఎంతో ప్రమాదకరం. ఇది కేవలం శరీరానికే కాదు, కుటుంబానికి, సమాజానికి కూడా నష్టం తెస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈగల్ వ్యవస్థ ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటోంది. పోలీసులు చూపుతున్న ఈ కఠిన వైఖరి మత్తుకు బానిసలుగా మారుతున్న యువతకు గట్టి హెచ్చరికగా నిలుస్తోంది.
మత్తు పదార్థాలకు తలవంచాల్సిన అవసరం లేదు. సహాయం కోరండి. ఆదుకోవడానికి ఎంతో మంది ఉన్నారు. ఈగల్ వంటి వ్యవస్థలు ఇప్పుడు భరోసా ఇస్తున్నాయి. మత్తులో మునిగిపోయే ముందు.. ఒక్కసారైనా ఆలోచించండి!
