ఈ20 పెట్రోల్‌తో మైలేజీ తగ్గినా.. దేశానికి లాభమేనా? కేంద్రం క్లారిటీ వెనుక అసలు కథ ఇదే!
వినియోగదారుడికి మైలేజీ పరంగా స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం ఎంతో కీలకమైనదని కేంద్రం గణాంకాలతో సహా వివరించింది.
By: A.N.Kumar | 10 July 2026 7:42 PM ISTదేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ వినియోగంపై వాహనదారుల్లో అనేక చర్చలు, సందేహాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక వివరణ ఇచ్చింది. ఈ20 పెట్రోల్ వాడటం వల్ల కొన్ని వాహనాల్లో 3 నుంచి 5 శాతం వరకు మైలేజీ తగ్గే అవకాశం ఉందని కేంద్రం తొలిసారిగా అధికారికంగా అంగీకరించింది. అయితే ఈ స్వల్ప నష్టంతో పోలిస్తే పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, దేశ ఆర్థిక వ్యవస్థ, రైతులకు చేకూరే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎంతో ఎక్కువగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మైలేజీ ఎందుకు తగ్గుతుంది? కేంద్రం వివరణ
కేంద్రం విడుదల చేసిన డాక్యుమెంట్ ప్రకారం.. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌కు శక్తి సాంద్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది. అందువల్ల వాహనాల్లో మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో ఇథనాల్‌కు అధిక ఆక్టేన్ రేటింగ్ ఉండటం వల్ల ఇంజిన్ పనితీరు మెరుగుపడుతుందని.. వాహనం పికప్ కూడా మెరుగ్గా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇది హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదని.. 2001లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమై.. ఆటోమొబైల్ సంస్థలు, శాస్త్రీయ నిపుణులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే దశలవారీగా 20% బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకున్నామని కేంద్రం వివరించింది.
పాత వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయా?
ఈ20 ఇంధనం వల్ల పాత వాహనాల ఇంజిన్లు పాడైపోతాయనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇంజిన్ మన్నిక, ఇంధన వ్యవస్థ, తుప్పు నిరోధకత వంటి అంశాలపై విస్తృత పరీక్షలు నిర్వహించామని.. ఇప్పటివరకు సాధారణ సర్వీస్‌లో ఉన్న పాత వాహనాల్లో ఈ20 కారణంగా ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవని పేర్కొంది. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ సంస్థలు కూడా దీనిని ధృవీకరించినట్లు ప్రభుత్వం ప్రస్తావించింది.
వినియోగదారులకు మూడు రకాల పెట్రోల్ ఎందుకు ఇవ్వరు?
దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఉన్న పెట్రోల్ బంకుల్లో మూడు రకాల ఇంధనాలను విడిగా సరఫరా చేయడం భారీ లాజిస్టిక్ సవాలుతో కూడుకున్న పని. దీనివల్ల రవాణా, నిల్వ ఖర్చులు పెరిగి చివరకు ఆ భారం వినియోగదారులపైనే పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే రైతులకు స్థిరమైన మద్దతు ధర ఇవ్వడం వల్ల ఈ20 పెట్రోల్ ధరలోనూ ప్రత్యేక తగ్గింపులు ఉండవని తేల్చి చెప్పింది.
దేశానికి చేకూరే ఆర్థిక, పర్యావరణ లాభాలు
వినియోగదారుడికి మైలేజీ పరంగా స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం ఎంతో కీలకమైనదని కేంద్రం గణాంకాలతో సహా వివరించింది. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇప్పటివరకు దేశానికి రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. సుమారు 316 లక్షల టన్నుల క్రూడాయిల్ దిగుమతులు తగ్గాయి. దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్ల 2014-15 నుంచి ఇప్పటివరకు రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరింది. పర్యావరణానికి ముప్పుగా మారిన దాదాపు 952 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి.
కేంద్ర ప్రభుత్వ తాజా వివరణను విశ్లేషిస్తే.. మైలేజీ తగ్గుదలను దాచకుండా నిజాయితీగా అంగీకరిస్తూనే వ్యూహాత్మక లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, కాలుష్య నివారణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి బృహత్తర లక్ష్యాల కోసం ఈ మార్పు అనివార్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ20 ప్రభావం వాహన మోడల్, ఇంజిన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వాహనదారులు తమ కార్లు లేదా బైక్‌లు ఈ20 ఇంధనానికి అనుకూలమా కాదా అనేది తయారీ సంస్థల సూచనల ప్రకారం ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం.
