Begin typing your search above and press return to search.

మాటలు రాని మౌన మునిగా ద్వారంపూడి !

గోదావరి జిల్లాలో ఒక పేరు రాజకీయంగా ప్రముఖంగా చెప్పుకుంటారు. ఆయన దూకుడు రాజకీయానికి పెట్టింది పేరు. ఆయనే ఫైర్ బ్రాండ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.

By:  Tupaki Desk   |   22 May 2025 9:46 AM IST
మాటలు రాని మౌన మునిగా ద్వారంపూడి !
X

గోదావరి జిల్లాలో ఒక పేరు రాజకీయంగా ప్రముఖంగా చెప్పుకుంటారు. ఆయన దూకుడు రాజకీయానికి పెట్టింది పేరు. ఆయనే ఫైర్ బ్రాండ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన 2009లో కాంగ్రెస్ నుంచి తొలిసారి గెలిచారు. కాకినాడ సిటీ నుంచి ఆయన అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. వైఎస్సార్ మరణానంతరం వైసీపీలో చేరి జగన్ కి అత్యంత సన్నిహితునిగా పేరు గడించారు.

ఇక వైసీపీ నుంచి 2014లో పోటీ చేసి ఓటమి పాలు అయిన ఆయన 2019లో గెలిచారు. ఈ దఫా వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన హవాకు ఎదురు లేకుండా పోయింది. ఆ ఊపులో ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద లెక్కలేనన్ని విమర్శలు చేశారు. వారి మీద ఎన్నో హాట్ కామెంట్స్ చేశారు. తనకు తిరుగులేదని అన్నట్లుగా వ్యవహరించారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని కూడా ధీమా పడ్డారు.

కానీ 2024 ఎన్నికల్లో ఆయన ఏకంగా 56 వేల భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఇక ఓటమి చెందిన తర్వాత గడచిన ఏడాది కాలంగా ఆయన పూర్తిగా మౌన మునిగా మరిపోరు. అసలు మాటలు రాని వారిగా నిలిచిపోయారు. ఇంతల్లో ఎంత మార్పు, ఏమి జరిగింది. ఫైర్ బ్రాండ్ ఫుల్ సైలెంట్ గా ఉండడం ఏంటి అన్న చర్చ జరుగుతోంది.

గతానికి భిన్నంగా ఆయన వైఖరి ఉందని అంటున్నారు. అప్పట్లో ఎవరైనా ఏమైనా అంటే కస్సున మీదపడే ఆయన ఇపుడు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని అంటున్నారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన తన జాగ్రత్తలో తాను ఉన్నారని అంటున్నారు. తన కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్న రొయ్యల కంపెనీలను కాలుష్యం పేరుతో కూటమి సర్కార్ సీజ్ చేసింది. దాంతో అలా తొలి షాక్ తగిలింది అని అంటున్నారు.

దాంతో ఎందుకొచ్చిన రచ్చ అనుకుని ఆనాటి నుంచే ద్వారంపూడి సైలెంట్ అయ్యారా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో ఎన్నో పరిణామాలు జరుగుతున్నా ఆయన మీడియా ముందుకు రావడం లేదు అని అంటున్నారు. ఇక కూటమి పాలనలో వైసీపీ నేతలు ఒక్కొక్కరి మీద కేసులు పడుతున్నాయి. చాలా మంది అరెస్టు అవుతున్నారు జైళ్ళకు వెళ్తున్నారు

దాంతో ఎందుకొచ్చిన గొడవలు అని ఆయన తగ్గిపోతున్నారా అని అంటున్నారు. ఇక పార్టీ ఆఫీసు నుంచి ఆయనకు రెస్పాండ్ కావాలని గొంతు విప్పాలని వర్తమానాలు వస్తున్నా ఆయన అవుటాఫ్ స్టేషన్ అని చెప్పి తప్పించుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కొత్త సమస్యలు వస్తాయని ఎందుకు అని ఆయన అలా సైలెంట్ గా ఉంటున్నారు అని చెబుతున్నారు.

ఇది మన టైం కాదని ఆయన సన్నిహితులతో అంటున్నారుట. ఆయన పూర్తిగా వ్యాపారాల మీదనే ఫోకస్ పెట్టారని అంటున్నారు. దీంతో ద్వారంపూడి ఎందుకిలా మారిపోయారు ఆయనలో ఫైర్ ఏమైంది అని సన్నిహితులే ఆశ్చర్యపోతున్నారుట. ఎవరు ఏమనుకున్నా సరైన పాలిటిక్స్ నే ద్వారంపూడి చేస్తున్నారు అన్న వారూ ఉన్నారు. మొత్తానికి ద్వారంపూడి మౌనం బద్ధలు అయ్యేది ఎపుడూ అన్నదే కాకినాడ రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారు అనుకునే మాటగా ఉంది.