Begin typing your search above and press return to search.

టెక్కలిలో సరికొత్త పోరు... నేడు భర్త - 22న రెబల్ గా భార్య నామినేషన్!?

మరోపక్క... ఈ రోజు మధ్యాహ్నం తాను వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని.. జూన్ 4న వచ్చే ఫలితాల్లో టెక్కలిలో వైసీపీ జెండా రెపరెప లాడబోతోందని దువ్వాడ శ్రీను ప్రకటించారు.

By:  Tupaki Desk   |   19 April 2024 5:36 AM GMT
టెక్కలిలో సరికొత్త పోరు... నేడు భర్త  - 22న రెబల్  గా భార్య నామినేషన్!?
X

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని అంటుంటారు! ఇదే క్రమంలో... రాజకీయల్లో శాస్వత శత్రువులు, శాస్వత మిత్రులు కూడా ఉండరని చెబుతుంటారు! అయితే... కట్టుకున్న భార్యే భర్తపై పోటీకి సిద్ధమైన అరుదైన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. తనకు కాకుండా తన భర్తకు టిక్కెట్ ఇవ్వడంపై ఆగ్రహంతోనో ఏమో కానీ.. బరిలోకి దిగుతున్నారు వైసీపీ అభ్యర్థి భార్య! దీంతో... ఈ స్థానంలో పోటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది. పైగా అది వైసీపీకి అత్యంత కీలకమైన సీటు కావడం గమనార్హం.

అవును... ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వడంతో.. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు రెబల్ అభ్యర్థుల తలనొప్పులు తప్పడం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే నూజివీడులో టీడీపీకి రాజీనామా చేసిన ముద్రబోయిన వెంకటేశ్వర రావు రెబల్ గా నామినేషన్ వేయగా.. ఉండిలోనూ తప్పదని అంటున్నారు! ఈ సమయంలో తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో ఓ అభ్యర్థికి ఇంటి పోరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... తమకు కాకుండా వేరే వారికి టిక్కెట్ ఇచ్చారనే ఆగ్రహంతో పలువురు అభ్యర్థులు రెబల్ గా మారుతుండటం తెలిసిందే కానీ... తనకు కాకుండా తన భర్తకు టిక్కెట్ ఇచ్చినందుకు టెక్కలి నియోజకవర్గంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు వాణి తాజాగా ప్రకటించినట్లు తెలుస్తుంది.

ఇదే సమయంలో... గురువారం ఆమె జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఈ నెల 22న తాను నామినేషన్‌ వేస్తున్నట్లు చెప్పడం గమనార్హం! దీంతో ఈసారి టెక్కలిలో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని అధికార పార్టీ కంకణం కట్టుకున్న వేళ ఈ ఇంటిపోరు సరికొత్త సమస్యలు తెచ్చేలా ఉందని అంటున్నారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి అచ్చెన్నకు గుడ్ న్యూస్ గా మారబోతోందా లేదా అనేది వేచి చూడాలని చెబుతున్నారు!

మరోపక్క... ఈ రోజు మధ్యాహ్నం తాను వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని.. జూన్ 4న వచ్చే ఫలితాల్లో టెక్కలిలో వైసీపీ జెండా రెపరెప లాడబోతోందని దువ్వాడ శ్రీను ప్రకటించారు. దీంతో... ఈ నెల 22 లోపు వాణీని బుజ్జగిస్తారా.. లేక, ఆమె 22న నామినేషన్ వేసి బరిలోకి దిగడం కన్ ఫాం అయ్యే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి!