టెక్కలి 'వాణి'.. కొట్టేనా బోణి ..!
టెక్కలి వాణిగా పేరు తెచ్చుకున్న జెడ్పీటీసీ సభ్యురాలు, వైసీపీ నాయకురాలు దువ్వాడ వాణి.. రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యారు.
By: Tupaki Desk | 1 July 2025 8:00 AM ISTటెక్కలి వాణిగా పేరు తెచ్చుకున్న జెడ్పీటీసీ సభ్యురాలు, వైసీపీ నాయకురాలు దువ్వాడ వాణి.. రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావు సతీమణిగా కొన్నాళ్ల కిందట వార్తల్లోకి ఎక్కారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మీడియాలో దువ్వాడ వాణి సెంట్రిక్ అయ్యారు. ఆ తర్వాత.. ఈ కలహాలు సర్దుబాటు చేసుకున్నారో.. లేదో తెలియదు కానీ.. సైలెంట్ అయ్యారు. అయితే.. తాజాగా వాణి పేరు మరోసారి తెరమీదికి వచ్చింది.
జగన్ ప్రారంభించిన చంద్రబాబు వ్యతిరేక కార్యక్రమం `ఇంటింటికీ రీకాల్`లో వాణి పాల్గొంటానని చెప్పుకొ చ్చారు. అంతేకాదు.. స్థానిక సమస్యలపై నిరాహార దీక్ష కూడా చేస్తానని చెప్పారు. స్థానికంగా అధికారులు తమ మాట వినడం లేదని, జిల్లా పరిషత్‌లో వైసీపీ నాయకులు నానా తిప్పలు పడుతున్నారని వాణి చెప్పారు. దీనిపై తాను నిరంతర పోరాటానికి తెరదీస్తానని చెప్పారు. ఇదిలావుంటే.. టెక్కలిలో వైసీపీ నేతగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌పై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడంటూ.. కొన్నాళ్ల కిందటే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే.. శ్రీను కూడా.. పార్టీని బ్రతిమాలుకునే పనిలో లేరు. ఏం జరిగితే అదే జరుగుతుందని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టెక్కలిలో వైసీపీ తరఫున బలమైన గళం వినిపిస్తానంటూ.. వాణి చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం దక్కించుకుంది. జగన్ అవకాశం ఇస్తే.. తాను ఇంటింటికీ తిరుగుతానని.. ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుతానని వాణి చెప్పుకొచ్చారు.
దీనిపై పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే.. అంతర్గతంగా మాత్రం వాణి బలం, ఆమె ఆర్థిక పరిస్థితి. కలుపుగోలు తనం వంటివాటిపై మాత్రం పార్టీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్‌తో పోల్చుకుంటే వాణి అంత బలమైన నాయకురాలు కాదనేది కొందరు చెబుతున్న మాట. ఒకవేళ ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే.. అది మరోసారి టీడీపీకి మేలు చేయడమే అవుతుందని అంటున్నారు.
గత ఎన్నికలకు ముందు కూడా ఇలానే వాణికి టికెట్ ఇవ్వాలని భావించిన అధిష్టానం వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో వాణికి మరోసారి అవకాశం ఇస్తే.. ఆమె బోణీ కొట్టే పరిస్థితిలో ఉన్నారా? అనే కోణంపై చర్చ సాగుతోంది. దీనిలో ఆమె విజయం దక్కించుకుంటే.. అప్పుడు పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుందన్నది స్థానిక వైసీపీ నాయకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
