Begin typing your search above and press return to search.

దువ్వాడ సస్పెన్షన్.. వైసీపీ పేజ్ లో ఎన్నో కామెంట్స్!

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ సస్పెన్షన్ వైసీపీలో తీవ్ర దుమారం రేపుతోంది.

By:  Tupaki Desk   |   23 April 2025 4:52 AM
దువ్వాడ సస్పెన్షన్.. వైసీపీ పేజ్ లో ఎన్నో కామెంట్స్!
X

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ కేంద్రం కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. అయితే దువ్వాడ పార్టీ క్రమశిక్షణ అతిక్రమించారో లేదో కానీ, వ్యక్తిగత క్రమశిక్షణ తప్పడం, పార్టీ పరువును బజారున పడేయడం వల్లే సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఎప్పుడో తీసుకోవాలని, పార్టీకి పూర్థిస్థాయి డ్యామేజ్ జరిగిన తర్వాత ఇప్పుడు సస్పెండ్ చేయడం వల్ల ప్రయోజనమేంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ముఖ్యంగా పార్టీ నిర్ణయంపై సొంత కార్యకర్తలతోపాటు సోషల్ మీడియా యాక్టవిస్టులు విమర్శలు గుప్పిస్తున్నారు. రకరకాల కామెంట్స్ తో వైసీపీ పేజీలు నిండిపోతున్నాయి. దువ్వాడతోపాటు మరికొందరిని కూడా సాగనంపితే బాగుంటదనే సూచనలు వస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ సస్పెన్షన్ వైసీపీలో తీవ్ర దుమారం రేపుతోంది. గత కొంతకాలంగా వ్యక్తిగత అంశాలతో ఆయన అన్ని హద్దులు అతిక్రమించి పార్టీ పరువును బజారు కీడ్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కుటంబం, భార్యతో తగాదా మొదలైన నాడే పార్టీ స్పందిస్తే బాగుండేదని అంటున్నారు. మరీ ముఖ్యంగా నాలుగు గోడల మధ్య చర్చించాల్సిన అంశాలు, విషయాలను ఆయన పబ్లిక్ గా చాటుకోవడం.. మీడియాలో మరీ ముఖ్యంగా తన అనైతిక వ్యవహారాలను సోషల్ మీడియా వేదికగా సమర్థించుకోవడం, దానికి వంత పాడినట్లు ఇన్నాళ్లు పార్టీ స్పందించకపోవడంతో చాలా డ్యామేజ్ జరిగిందని అంటున్నారు. దీనిపై రకరకాల కామెంట్స్ తో పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. నిజానికి దువ్వాడను ఎప్పుడో సాగనంపాలని, నువ్వు ఎక్కాల్సిన ట్రైన్ జీవిత కాలం లేటు అన్నట్లు పార్టీ అన్ని విధాలుగా నష్టపోయిన తర్వాత సస్పెన్షన్ వేటు వేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దువ్వాడతో పాటు పనిలో పనిగా మరికొందరిపై వేటు వేయాలని సోషల్ మీడియా పేజీల్లో కార్యకర్తలు డిమాండ్ కేస్తున్నారు. పార్టీ నుంచి సాగనంపాల్సిన వారిలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ అనంతబాబుతోపాటు మరికొందరి పేర్లు సూచిస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసి డోర్ డెలవరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును సస్పెండ్ చేయాలని ఎక్కువ మంది పోస్టింగులు చేస్తున్నారు. అదేవిధంగా దువ్వాడను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనపై అధ్యక్షుడు జగన్ సంతకం లేకపోవడాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. గౌరవ డాక్టరేట్ పొందిన గౌరవప్రదమైన వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరిస్తారా? ఇది చాలా పెద్ద తప్పు అంటూ ఓ వీరాభిమాని సెటైర్ వేశారు.

ఇక అంతిమంగా మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు అభినందిస్తుండగా, ఎక్కువ మంది మాత్రం పార్టీ నిర్ణయం తీసుకోవడంలో చాలా జాప్యం జరిగిందనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసినోడిని కూడా ఇలాగే సస్పెండ్ చేసాం అని చెప్పారు. నెక్స్ట్ మీ ప్రతీ మీటింగ్స్ లో ఉన్నాడు. చివరికి జగన్ పక్కనే ఒకే వేదిక మీద కూర్చున్నాడు. మీ పార్టీ సస్పెనస్ అంతే... అంటూ ఓ సోషల్ యాక్టవిస్టు పోస్టు చేశాడు. ఇప్పటికీ జ్ఞానోదయం ఐయ్యింది… ఇలాంటి స్క్రాప్ పార్టీ లో చాలా మంది ఉన్నారు. అందరినీ వేరి పారేయాలి అంటూ మరో కార్యకర్త సూచించాడు. ఇలాంటి పనులు ఎలక్షన్ బిఫోర్ చేసి ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చి ఉండేది అంటూ మరో కార్యకర్త అభిప్రాయపడ్డాడు.

మొత్తానికి దువ్వాడ బహిష్కరణ ఆలస్యమైందని, దువ్వాడతోపాటు పార్టీ అధినేత పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నవారినీ గమనించాలని ఎక్కువ మంది కార్యకర్తలు సూచిస్తున్నారు. చడీచప్పుడు చేయకుండా దువ్వాడ సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకోవడంపై కూడా ఆశ్యర్యం వ్యక్తమవుతోంది. నిజానికి గత ఎన్నికల ముందే దువ్వాడ వ్యవహారం అధినేత దృష్టికి వచ్చిందని, అప్పట్లో ఆయన భార్య దువ్వాడ వాణి ఫిర్యాదుతో టెక్కలి ఇన్ చార్జిగా దువ్వాడను తప్పించి వాణిని నియమించారని అంతా గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలోనే దువ్వాడను వారించి వ్యక్తిగత వ్యవహారశైలిపై పార్టీ నుంచి మందలించి ఉంటే వ్యవహరం ఇంతవరకు వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు అన్యాయం చేస్తున్నాడని భార్య, బిడ్డలు లబోదిబోమంటున్న పార్టీ నుంచి మద్దతు లభించకపోవడం, ఇక ఎన్నికలు అయిన మరుక్షణం నుంచి కుటుంబ వివాదం రోడ్డెక్కడం, దువ్వాడ ఆయన సన్నిహితురాలు ప్రజలు గమనిస్తున్నారనే అంశాన్ని వదిలేసి తిరుగుతుండటంతో వైసీపీకి అన్ని విధాలుగా నష్టం జరిగిందని అంటున్నారు. మొత్తానికి దువ్వాడను వదిలించుకోవడం ద్వారా వైసీపీ ఇప్పుడిప్పుడే ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.