Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో జగన్ ను కలిసిన దువ్వాడ... వైసీపీలో హాట్ టాపిక్

అయితే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు, ఆయన హావభావాలు పరిశీలిస్తే ఎమ్మెల్సీ దువ్వాడ విషయంలో జగన్ అసంతృప్తిగా ఉన్నట్లే కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   11 Feb 2026 2:09 PM IST
అసెంబ్లీలో జగన్ ను కలిసిన దువ్వాడ... వైసీపీలో హాట్ టాపిక్
X

ఏపీ అసెంబ్లీ ఆవరణలో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలవడం చర్చనీయాంశమైంది. గత ఏడాది ఏప్రిల్ లో దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మాజీ సీఎం జగన్ ను దువ్వాడ ఇప్పుడే కలిశారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వస్తున్న జగన్ ను దువ్వాడ ఆకస్మికంగా కలిశారు. ఈ సమయంలో జగన్ తో ఏదో చర్చించేందుకు దువ్వాడ ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దువ్వాడ వచ్చి కలిసినా జగన్ పెద్దగా పట్టించుకోకుండానే ముందుకు వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత జగన్ తో తాను ఏం మాట్లాడిందో మీడియాకు చెప్పారు దువ్వాడ.

వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా, అధినేత జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని ఎమ్మెల్సీ దువ్వాడ తరచూ చెబుతుంటారు. అయితే పార్టీ నుంచి ఆయనను బయటకు పంపిన తర్వాత జగన్ ను కలిసేందుకు ఆయనకు ఇంతవరకు అవకాశం దక్కలేదని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ ఆ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ పై చేస్తున్న విమర్శలు వైసీపీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. పార్టీ సీనియర్లపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న దువ్వాడ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

వైసీపీ నేతలైన ధర్మాన సోదరులను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత జగన్ ఆశీస్సుల కోసం ఎప్పటికప్పుడు ఆయనపై భక్తి ఉన్నట్లు చెప్పుకుంటుంటారు. అయితే బుధవారం అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎమ్మెల్సీ దువ్వాడ జగన్ ఎదురుగా వెళ్లి ఆయనను పలకరించారు. ఈ సమయంలో ఆయన ఏదో చెప్పబోతుండగా, జగన్ వారిస్తూ ‘మార్పు రావాలి’ అని వ్యాఖ్యానించారు. జగన్ అన్న మాటలు వీడియోలో స్పష్టంగా వినిపించాయి. కానీ, ఎమ్మెల్సీ దువ్వాడ ఆయనతో ఏం చెప్పారన్నది తెలియరాలేదు.

అయితే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు, ఆయన హావభావాలు పరిశీలిస్తే ఎమ్మెల్సీ దువ్వాడ విషయంలో జగన్ అసంతృప్తిగా ఉన్నట్లే కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. దువ్వాడ వ్యక్తిగత వ్యవహారశైలి, భార్య, బిడ్డలకు దూరంగా ఉండటమే కాకుండా, ప్రియురాలు దివ్వెల మాధురితో కలిసి తిరగడం వల్ల పార్టీ ప్రతిష్టకు నష్టం కలుగుతోందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ప్రియురాలు దివ్వెల మాధురితో సంబంధాలు ఎమ్మెల్సీ దువ్వాడ వ్యక్తిగత వ్యవహారమైనప్పటికీ ప్రజా జీవితంలో ఉన్నవారు ఇలా బహిరంగంగా సమాజ కట్టుబాట్లను అతిక్రమించేలా ఉండటం పార్టీకి నష్టమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఎమ్మెల్సీ దువ్వాడపై సస్పెన్షన్ వేటు వేయాలని పట్టుబట్టారు. పార్టీ నేతల అభిప్రాయానికి జగన్ కూడా గౌరవిచ్చారు.

ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ దువ్వాడ ఆకస్మాత్తుగా ముందస్తు అనుమతి లేకుండా జగన్ ను కలవడంపై పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అపాయింట్మెంట్ తీసుకోకుండా ఎమ్మెల్సీ దువ్వాడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని ఎలా కలుస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా, జగన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన దువ్వాడ.. తాను మరోసారి మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని కలుస్తానని చెప్పారు. మాజీ మంత్రి ధర్మానతో ఉన్న విభేదాలను జగన్‍ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. తనను ఒకసారి కలవమని జగన్ చెప్పినట్లు దువ్వాడ వెల్లడించారు. 2029 ఎన్నికల్లో టెక్కలి నుంచి తాను పోటీ చేస్తానని, ఒకవేళ వైసీపీ టికెట్ ఇవ్వకున్నా ఇండిపెండెంట్‍గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.