ధర్మాన బ్రదర్స్ ని గట్టిగా టార్గెట్ చేసిన దువ్వాడ
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ది అగ్రెసివ్ రూట్. ఆయన ఒక ఫైర్ బ్రాండ్. పదవులు పోతాయని కూడా చూసుకోకుండా తాను ఎందాకైనా వెళ్ళే డేరింగ్ నేచర్ ఆయన సొంతం.
By: Satya P | 27 Aug 2025 2:49 PM ISTశ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ది అగ్రెసివ్ రూట్. ఆయన ఒక ఫైర్ బ్రాండ్. పదవులు పోతాయని కూడా చూసుకోకుండా తాను ఎందాకైనా వెళ్ళే డేరింగ్ నేచర్ ఆయన సొంతం. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో సామాజిక కోణం తెర వెనక బలంగా ఉంది. రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య ఎపుడూ పోరు సాగుతూనే ఉంది. అయితే గడచిన మూడు దశాబ్దాలుగా జిల్లాలో ఒక సామాజిక వర్గం రాజకీయ ఆధిపత్యం అధికంగా ఉంది. పార్టీలు వేరు అయినా పరిస్థితి ఇలాగే ఉంది దాంతో రెండవ సామాజిక వర్గం రగులుతోంది.
దువ్వాడ సంచలన వ్యాఖ్యలు :
ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని కొద్ది నెలల క్రితం వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో ఆయన ఇపుడు ఫ్రీ బర్డ్ గా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉంది. ఇక ఆయన హైదరాబాద్ లో వస్త్ర వ్యాపారంలో దిగారు. నెమ్మదిగా అన్నీ సర్దుకుని మళ్ళీ శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు అటు వైసీపీలో ఇటు టీడీపీలో కూడా కలకలం రేపాయి. ఆయన వైసీపీలోని ధర్మాన బ్రదర్స్ కి టీడీపీలో ఉన్న కింజరాపు ఫ్యామిలీకి మధ్య లింక్ పెట్టేశారు. ఈ రెండు కుటుంబాలు కలసి లోపాయికారిగా రాజకీయాలు చేస్తున్నాయని కూడా ఆరోపించారు.
సస్పెన్షన్ వెనక ధర్మాన బ్రదర్స్ :
జిల్లా రాజకీయాల్లో తనను ఎదురోలేకనే ధర్మాన బ్రదర్స్ టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు అంతా కలసి తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయించారు అని దువ్వాడ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ఇదంతా లోపాయికారీ ఒప్పందం అన్నారు. అంతే కాకుండా కింజరాపు కుటుంబం ధర్మాన కుటుంబం కలిసి అంతా చేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. అయితే సస్పెన్షన్ మాత్రమే చేయించగలిగారు కానీ వారు తనను పార్టీ నుంచి బహిష్కరించలేరని అన్నారు వారికి చేతనైతే తనను వైసీపీ నుంచి బహిష్కరించేలా చేయాలని సవాల్ చేశారు.
జగన్ కి ఎప్పటికీ విధేయుడినే :
ఇక తన మీద వేసిన ఈ సస్పెన్షన్ తాత్కాలికమే అని ఆయన అన్నారు. ఈ విషయంలో జగన్ కి ఏమీ తెలియదని అన్నారు. తన మీద కావాలనే ఈ చర్య జరిగేలా ధర్మాన బ్రదర్స్ చూశారని ఆయన మండిపడ్డారు. తన సస్పెన్షన్ వేటు తొందరలోనే తొలగిపోతుందని ఆయన ఆశాభావం గా ఉన్నారు. మరో వైపు చూస్తే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలమని అందుకే సొంత గనులు ప్లాంట్ కోసం ఆయన కోరడం లేదని దువ్వాడ ఆరోపించారు.
కూనకు మద్దతుగా :
మరో వైపు చూస్తే ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే తమ సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్ కి దువ్వాడ మద్దతు ఇస్తున్నారు జిల్లాలో తమ సామాజిక వర్గాన్ని అణగదొక్కే కుట్ర సాగుతోంది అని ఆయన అంటున్నారు. మొత్తం మీద చూస్తే రెండు ప్రధాన కులాల మధ్య రాజకీయ సామాజిక సమరానికి దువ్వాడ తెర తీస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక ధర్మాన బ్రదర్స్ ని గట్టిగానే ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఈ ఇద్దరినే నమ్ముకుని జిల్లాలో ఆది నుంచి వైసీపీ రాజకీయం చేస్తోంది. మరి వైసీపీ పెద్దలకు ఈ విషయాలు తెలియవా లేక దువ్వాడ వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నారా అన్నది కొద్ది కాలం ఆగితేనే కానీ తెలియదు అని అంటున్నారు.
