వైసీపీ సస్పెన్షన్.. దువ్వాడ ఎమోషన్.. అధినేత జగన్ పై షాకింగ్ కామెంట్స్
వైసీపీ నుంచి సస్పెన్షన్ పై ఎమ్మెల్సీ దువ్వాడ స్పందించారు. పార్టీ నిర్ణయంపై తన అభిప్రాయం తెలియజేయాల్సివున్నాదని అంటూ ఓ వీడియో విడుదల చేశారు.
By: Tupaki Desk | 24 April 2025 9:35 AMవైసీపీ నుంచి సస్పెన్షన్ పై ఎమ్మెల్సీ దువ్వాడ స్పందించారు. పార్టీ నిర్ణయంపై తన అభిప్రాయం తెలియజేయాల్సివున్నాదని అంటూ ఓ వీడియో విడుదల చేశారు. అధినేత జగన్, దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న దువ్వాడ పార్టీ నుంచి సస్పెన్షన్ పై ఎమోషన్ అయ్యారు. వ్యక్తిగత కారణాలతో సస్పెండ్ చేసినట్లు తెలిసిందని, రాజకీయ క్రీడలో తాను బలైపోయానని వాపోయారు. తనను ఇన్నాళ్లు ప్రోత్సహించిన అధినేత జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
వైసీపీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న ఎమ్మెల్సీ దువ్వాడ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండింగ్ అవుతున్న దువ్వాడ.. సస్పెన్షన్ పై తన అభిప్రాయాన్ని తెలియజేయాడానికి కూడా సోషల్ మీడియానే ఎంపిక చేసుకున్నారు. వైసీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, పార్టీ గొంతుకై వినిపించానని, ప్రతిపక్షాలతో గట్టిగా కోట్లాడానని వివరించారు. అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే తనకు బాధగా ఉందని వ్యాఖ్యానించారు.
25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను వైఎస్ కుటుంబానికి విధేయుడునని స్పష్టం చేశారు. సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామంగా తాను భావిస్తున్నానని తెలిపారు. ఈ విరామ సమయాన్ని మరింత చక్కగా వాడుకుని తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మహాకవి గురజాడ రచనను దువ్వాడ ప్రస్తావించారు. ‘‘విజయం కోసం విసుగును వీడి విరామమెరుగక పనిచేయొండోయ్’’ అన్న గురజాడ వ్యాఖ్యలే తనకు స్ఫూర్తి అన్నారు.
తనపై సస్పెన్షన్ వేటు వేసినా అధినేత జగన్ తన గుండెల్లోనే ఉంటారని చెప్పారు. తన రాజకీయ జీవితంలో ప్రజా సమస్యలపై తీవ్రంగా పోరాడానని, ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని వెల్లడించారు. అవినీతి చేయలేదు, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. కబ్జాలు చేయలేదు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను. ఇంకా కష్టపడి పనిచేస్తాను. నా ప్రజల కోసం, నన్ను అభిమానించే కార్యకర్తలు, గ్రామాల కోసం కష్టపడి పనిచేస్తానని దువ్వాడ ప్రకటించారు. తన వారు ఎవరూ సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తనకు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయని, అన్నింటికి కాలమే తీర్పు చెబుతుందని నమ్ముతున్నట్లు ముగించారు.
పార్టీ నుంచి సస్పెండ్ అయిన రెండు రోజులుకు దువ్వాడ స్పందించడం ఆసక్తికరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ ఇటీవల ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఆయన వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు 22వ తేదీన వైసీపీ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో షాక్ తిన్న దువ్వాడ రెండు రోజుల తర్వాత తేరుకుని పార్టీని ఎక్కడా విమర్శించకుండా, అధినేత వద్ద అభిమానం తిరిగి పొందాలనే ఆలోచనతో వీడియో విడుదల చేశారని అంటున్నారు.