వాసన పీల్చి 19ఏళ్ల యువతి మృతి.. ఏమిటీ ‘డస్టింగ్ ఛాలెంజ్’?
అవును... ఇప్పుడు సోషల్ మీడియాలో "డస్టింగ్ ఛాలెంజ్" ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో యువతతో పాటు మైనర్ బాలబాలికల ప్రాణాలతో చెలగాటమాడుతోంది
By: Tupaki Desk | 8 Jun 2025 1:30 AMసోషల్ మీడియాలో నిత్యం రకరకాల ఛాలెంజ్ లు ట్రెండ్ అవుతుంటాయి! ఈ సమయంలో తాము రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలని, సోషల్ మీడియా ట్రెండ్ సెట్టర్స్ గా మారాలని చాలా మంది ఈ ఛాలెంజ్ లను ప్రయత్నిస్తుంటారు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు! ఈ క్రమంలో తాజాగా ఓ యువతి ఇలాంటి ఛాలెంజ్ ను స్వీకరించి, ప్రయత్నించి మృతి చెందింది.
అవును... ఇప్పుడు సోషల్ మీడియాలో "డస్టింగ్ ఛాలెంజ్" ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో యువతతో పాటు మైనర్ బాలబాలికల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో.. పలువురు ఈ డస్టింగ్ ఛాలెంజ్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని 19 ఏళ్ల యువతి తాజాగా ప్రాణాలు కోల్పోయింది.
వివరాళ్లోకి వెళ్తే.. అమెరికాలో 19 ఏళ్ల యువతి రెన్నా ఓ రూర్కీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎరోసాల్ కీ బోర్డు క్లీనర్ ను ఆర్డర్ చేసింది. ఆ తర్వాత ఆ కీబోర్డు క్లీనర్ వాసన పీల్చి ఆమె కార్డియాక్ అరెస్టుకు గురైంది. దీంతో.. ఆమె తల్లితండ్రులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె సుమారు నాలుగు రోజులు ఐసీయూలో చికిత్సపొందింది.
అయినప్పటికీ నాలుగు రోజులు ప్రాణాలతో పోరాడిన ఆమె చివరికి మృతి చెందింది. ఈ సందర్భంగా స్పందించిన రూర్కీ పేరెంట్స్... తన కుమార్తె ఎప్పుడూ "నేను త్వరలో ఫేమస్ కాబోతున్నాను" అని చెప్పేదని.. ఈ క్రమంలోనే ఆ ఛాలెంజ్ ను ప్రయత్నించినట్లుందని.. అయితే ఇలా జరుగుతుందని మాత్రం తాము అనుకోలేదని విలపించారు.
కాగా.. ఈ డస్టింగ్ ఛాలెంజ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. వ్యూస్ కోసం.. ఇళ్లల్లో వినియోగించే క్లీనర్లను వాసన పీల్చడమే ఈ డస్టింగ్ ఛాలెంజ్. అయితే.. ఇది ప్రమాదకరమని తెలియని రూర్కీ.. ఎరోసాల్ కీబోర్డ్ క్లీనర్ వాసన పీల్చి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఛాలెంజ్ కు క్రోమింగ్, హఫింగ్ అనే పేర్లు కూడా ఉన్నాయి!