ప్రాక్టీస్ కు దుష్యంత్ దవే గుడ్ బై.. ఎందుకంటే?
ఎంత పెద్ద కేసు అయినా తాను ఇక వాదించనని వెల్లడించిన ఆయన.. ‘‘నా బూట్లు వేలాడదీసి.. నా మనమరాళ్ల కోసం టైం గడపాలని భావిస్తున్నా.
By: Tupaki Desk | 14 July 2025 1:00 PM ISTదేశంలోని ప్రముఖ న్యాయవాదుల జాబితా తీస్తే అందులో కచ్ఛితంగా ఉండే పేరు దుష్యంత్ దవే. గంటల చొప్పున ఫీజు వసూలు చేసే ఆయన.. కేసు టేకప్ చేసేందుకు ప్రముఖులు చాలానే కష్టపడుతుంటారు. న్యాయవాద వృత్తి జీవితంలో సక్సెస్ ఫుల్ గా నిలిచిన ఆయన.. తన 70 ఏళ్ల వయసులో అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. తాను తన న్యాయవాద ప్రాక్టీస్ కు గుడ్ బై్ చెబుతున్నట్లుగా స్పష్టం చేశారు,. తాను తన మనమరాళ్లతో సమయాన్ని గడపాలని భావిస్తున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.48 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేసిన ఆయన.. అనూహ్య రీతిలో ప్రాక్టీస్ మానేస్తున్నట్లుగా ప్రకటించి షాకిచ్చారు.
ఎంత పెద్ద కేసు అయినా తాను ఇక వాదించనని వెల్లడించిన ఆయన.. ‘‘నా బూట్లు వేలాడదీసి.. నా మనమరాళ్ల కోసం టైం గడపాలని భావిస్తున్నా. ఎంత ముఖ్యమైన కేసు అయినా సరే నేను తిరిగి రాను’’ అని స్పష్టం చేశారు. గుజరాత్ కు చెందిన దుష్యంత్ దవే.. 1954లో జన్మించారు. 1978లో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 80లలో ఢిల్లీకి వెళ్లిన ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించిన స్వల్ప కాలానికే ఆయన ప్రముఖ లాయర్ గా ఎదిగారు. సీనియర్ న్యాయవాదిగా సుపరిచితుడైన ఆయన.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మూడుసార్లు పని చేయటం తెలిసిందే.
మిగిలిన వారికి భిన్నంగా సుప్రీంకోర్టు లోపాల్ని సైతం వెల్లడించేందుకు.. ఓపెన్ గా మాట్లాడేందుకు ఆయన పెద్దగా సంకోచించరు. 2024లో లైవ్ లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సుప్రీంకోర్టు లోపాలపై బాహాటంగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. 2022లోనూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన.. న్యాయవ్యవస్థలోని వ్యవస్థాగత సమస్యల్ని ఓపెన్ గా మాట్లాడిన ధైర్యం ఆయన సొంతం. దవే తండ్రి జస్టిస్ అరవింద్ దవే గుజరాత్ హైకోర్టు జడ్జిగా పని చేశారు.
తన రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణం లేదన్న ఆయన.. యువతకు మార్గం చూపటం... అవకాశాల్ని మరిన్ని కల్పించేందుకు వీలుగా తాను న్యాయవాద రంగాన్ని విడిచిపెడుతున్నట్లుగా పేర్కొన్నారు. సమాజసేవకు.. తన అభిరుచుల్ని నెరవేర్చుకోవటానికి వీలుగా తన రిటైర్మెంట్ జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లుగా వెల్లడించారు. అనూహ్య రీతిలో రిటైర్మెంట్ ప్లాన్ ను వెల్లడించిన దుష్యంత్ దవే అందరిని షాకిచ్చారని చెప్పక తప్పదు.
