Begin typing your search above and press return to search.

నాడు వాజ్ పేయ్ హయాంలో...నేడు మోడీ జమానాలో...

అలా అనాడు వచ్చిన ఉగ్రవాదులు లష్కరే తోయీబా, జైష్ ఏ మహమ్మద్ కు చెందిన వారుగా విచారణలో తేలింది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 9:50 AM GMT
నాడు వాజ్ పేయ్ హయాంలో...నేడు మోడీ జమానాలో...
X

భారత పార్లమెంట్ లోకి ఒక్కసారిగా ఆగంతకులు కొందరు ప్రవేశించి టియర్ గ్యాస్ వదిలిన సంఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తొంది. ఇద్దరు ఆగంతకులు విజిటర్స్ పాస్ తో వచ్చి మరీ పార్లమెంట్ లోకి ప్రవేశించి ఇలా అనూహ్యంగా చేయడం పట్ల ఎంపీలే బిత్తరపోయారు. చాలా మంది షాక్ తిన్నారు. కొందరు పరుగులు తీశారని అంటున్నారు.

ఈ రోజు డిసెంబర్ 13. ఈ రోజుకు ఒక చేదు జ్ఞాపకం ఉంది. సరిగ్గా 2001లో ఇదే రోజున పార్లమెంట్ మీద ఉగ్రవాదులు దాడి చేశారు. అయిదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్ లో ప్రవేశించి బీభత్సం చేశారు. వెంటనే అలెర్ట్ అయిన భద్రతాదళాలు వారిని మట్టుబెట్టాయి.

అలా అనాడు వచ్చిన ఉగ్రవాదులు లష్కరే తోయీబా, జైష్ ఏ మహమ్మద్ కు చెందిన వారుగా విచారణలో తేలింది. ఆనాడు ఉగ్రవాదుల దాడి ఘటన వేళ పార్లమెంట్ లో ప్రధానమంత్రి వాజ్ పేయ్ విపక్ష నాయకులురాలు సోనియాగాంధీ ఉన్నారు.

మళ్లీ ఇన్నేళ్ళ తరువాత అంటే 22 ఏళ్ళ సుదీర్ఘ కాలం తరువాత ఇద్దరు ఆగంతకులు పార్లమెంట్ లో ప్రవేశించి టియర్ గ్యాస్ తో హల్ చల్ చేయడం కలకమే రేపింది. అయితే ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ సభలో లేరు. ఇతర ప్రముఖులు కూడా లేరు. ఎంపీలు బాగానే హాజరయ్యారు. సభ సాఫీగా జరుగుతున్న వేళ ఆగంతకులు ఇలా ప్రవేశించడం మీదనే చర్చ సాగుతోంది.

కొత్తగా కట్టిన పార్లమెంట్ భవనంలో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయా అన్న దానికి కూడా ఈ చర్చ దారితీస్తోంది. ఇక ఆగంతకులు ఇద్దరూ మైసూరుకు చెందిన ఎంపీ సిఫార్సుతో విజిటింగ్ పాసులు తీసుకుని పార్లమెంట్ లోకి ప్రవేశించారు అని అంటున్నారు.

ఇక జీరో అవర్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఆగంతకులు ఎందుకు వచ్చారు ఏమి కావాలి అన్నది తెలియకపోయినా ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యం అని అంటున్నారు. విపక్షాలు అయితే దీని సీరియస్ గా తీసుకుని ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి.

అయితే పార్లమెంట్ లోకి వచ్చిన వారు ఇద్దరే అయితే బయట మరి కొందరు ఉన్నారని అంటున్నారు. ఇక వీరు మహారాష్ట్రకు చెందిన వారు అని పోలీసులు అంటున్నారు. వారు దాడి చేయడానికి వచ్చారా లేక నిరసన తెలియచేయడానికి వచ్చారా అన్న దాని మీద కూడా విచారణ సాగుతోంది. మొత్తానికి ఉగ్రదాడి జరిగిన రోజే ఇలా జరగడం భద్రతావైఫల్యంగా చూస్తున్నారు. గతం నుంచి పాఠాలు నేర్వలేదని కూడా విమర్శిస్తున్నారు.