Begin typing your search above and press return to search.

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద లైట్ల మాయం..! నగర భద్రతకు మచ్చ?

హైదరాబాద్ నగరానికి ప్రతీకగా మారిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మరోసారి వార్తల్లో నిలిచింది.

By:  Tupaki Political Desk   |   21 Feb 2026 10:59 AM IST
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద లైట్ల మాయం..! నగర భద్రతకు మచ్చ?
X

హైదరాబాద్ నగరానికి ప్రతీకగా మారిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి అందాల విషయంలో కాదు.. ఆ అందాలను అలంకరించిన ఎల్ఈడీ లైట్లు మాయమైన ఘటనతో. సాయంత్రం వెలుగుల కాంతుల్లో మెరిసే ఈ బ్రిడ్జి నగర ప్రజలకే కాకుండా పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన పరిణామాలు నగర భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు..

సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను దుండగులు దొంగిలించారని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నగర నడిబొడ్డున దాదాపు ప్రతి రోజూ వందలాది వాహనాలు, వేలాది సందర్శకులు తిరిగే ప్రదేశంలో ఇలాంటి ఘటన జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది సాధారణ దొంగతనం మాత్రమేనా? లేక పర్యవేక్షణలో లోపమా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేబల్ బిడ్జ్రిపై గత వారం బిగించిన లైట్లలో కాంతి ఎక్కువ లేదని, నాణ్యత తగ్గిందని ప్రజలు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంజినీర్ అధికారులు పరిశీలించారు. అయితే అందులో మేజర్ లైట్లు మాయం అయ్యాయని అందుకే కాంతి తగ్గిందని తేల్చారు. చోరీ ఘటన వెలుగులోకి రావడం నగరంలో తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు పాత లైట్లు పూర్తిగా తొలగించబడ్డాయా? లేక ఏదైనా అవకతవకలు జరిగాయా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం దొంగిలించబడిన ఎల్ఈడీ లైట్లను తిరిగి అత్యాధునిక లైటింగ్ వ్యవస్థతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పడం నగర ప్రజలకు విడ్డూరంగా అనిపించింది.

స్పష్టంగా చూపిస్తున్న సమన్వయ లోపం..

ఈ ఘటన ప్రధానంగా నగర పాలనలో సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్‌కి కనీస భద్రతా పర్యవేక్షణ లేకపోతే, భవిష్యత్తులో మరింత పెద్ద నష్టాలు సంభవించే ప్రమాదం ఉంది. సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థలు, రాత్రి పర్యవేక్షణ బలోపేతం చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

ఒక ప్రతిష్టాత్మక నిర్మాణంలో ఇలాంటి లోపాలు వెలుగులోకి రావడం పరిపాలనా సామర్థ్యంపై సందేహాలు కలిగిస్తోంది. పర్యాటక ప్రదేశాల్లో భద్రత కఠినంగా ఉండాలి. లైట్లు మాయం కావడం అంటే అక్కడ పర్యవేక్షణ వ్యవస్థ ఎక్కడుంది అన్న ప్రశ్న సహజం.

మరింత పారదర్శకతతో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సాంకేతిక భద్రతా చర్యలు తీసుకోవాలి. నగర ప్రతిష్ఠను కాపాడుకోవడం అంటే సుందరీకరణ పేరుతో నిర్మాణాలు చేపట్టడం కాదు.. ఆ నిర్మాణాలను పరిరక్షించుకోవాలి.

నిర్వహణ బాధ్యత ఎవరిది?

మరో ముఖ్యమైన అంశం ఇలాంటి ప్రాజెక్టుల నిర్వహణలో బాధ్యత ఎవరిది అన్నది స్పష్టంగా ఉండాలి. నిర్మాణం పూర్తయ్యాక సంరక్షణ కాంట్రాక్టర్‌దా? లేక మున్సిపల్ సంస్థదా? లేక ప్రత్యేక నిర్వహణ సంస్థదా? అన్న ప్రశ్నలు తలెత్తక మానదు. బాధ్యత స్పష్టంగా లేకపోతే ఇలాంటి లోపాలు మళ్లీ మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. నగరానికి ప్రతీకగా నిలిచిన ప్రదేశం కావడంతో ప్రతి చిన్న అంశానికీ ప్రత్యేక నిఘా అవసరం.

అదే సమయంలో పౌరుల పాత్రను కూడా విస్మరించలేం. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే సమాచారమివ్వడం, ప్రజా ఆస్తిని కాపాడాలనే బాధ్యతను గుర్తు చేసుకోవడం సమాజ ధర్మం. నగర అభివృద్ధి కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదు.. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది పూర్తి అవుతుంది. దుర్గం చెరువు బ్రిడ్జి మళ్లీ తన వెలుగులతో మెరవాలి.. కానీ ఆ వెలుగులు కాపాడాలనే సామూహిక చైతన్యం కూడా వెలగాలి.