Begin typing your search above and press return to search.

నిజాయితీగా దొరికిన నగల్ని ఇచ్చిన పారిశుద్ధ్య కార్మికుడికి వరం

మన చుట్టూ బోలెడంత దురాశ.. దుర్మార్గాలు నిండిపోయి ఉన్నాయన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

By:  Garuda Media   |   11 Feb 2026 10:40 AM IST
నిజాయితీగా దొరికిన నగల్ని ఇచ్చిన పారిశుద్ధ్య కార్మికుడికి వరం
X

మన చుట్టూ బోలెడంత దురాశ.. దుర్మార్గాలు నిండిపోయి ఉన్నాయన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో అంతే మంచితనం కూడా ఉంటుంది. కాకుంటే.. చెడు కనిపించినంత త్వరగా మంచి ప్రత్యేకంగా కనిపించదు. తిరువారూర్ రోడ్డు మీద తనకు దొరికిన బంగారు నగల్ని పారిశుద్ధ్య కార్మికుడు దురై నిజాయితీగా పోలీసులకు అప్పజెప్పటం.. వాటి యజమానులు (వీరు ఒక వేడుకకు పాల్గొనేందుకు చెన్నై నుంచి వెళ్లారు) సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. భావోద్వేగంతో ఏడ్చేశారు. వేడుకకు తీసుకెళ్లిన బంగారు ఆభరణాలు పోగొట్టుకోవటంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అలాంటి వేళ.. ఒక పారిశుద్ధ్య కార్మికుడి కారణంగా మళ్లీ దొరకటం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ.. వాట్సప్ లోనూ వైరల్ గా మారాయి. పారిశుద్ధ్య కార్మికుడి నిజాయితీకి పలువురు అభినందించిన పరిస్థితి.

అయితే.. ఈ కథ ఇక్కడితో ముగియలేదు. అతడి మంచితనానికి చక్కటి బహుమతి లభించింది. అదెలానంటే.. దురైకు ఒక కొడుకు ఉన్నాడు. అతడి వయసు 34 ఏళ్లు. బాత్రూంలో జారి పడటంతో అతడి వెన్నుముక దెబ్బ తింది. దాన్ని సరి చేసేందుకు ఖరీదైన శస్త్రచికిత్స అవసరమని తేల్చారు వైద్యులు. ఆపరేషన్ కోసం రూ.4 లక్షలు అవసరమైన సమయంలోనే.. రోడ్డు మీద దురైకు 20 సవర్ల బంగారు నగలు దొరికాయి. కొడుకు ఆపరేషన్ వేళ దొరికిన బంగారు నగల్ని తీసుకోకుండా.. దాన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పజెప్పారు.

దురై కుటుంబ పరిస్థితుల గురించి ఆరా తీసిన వేళ.. అతడి కష్టం గురించి వివరాలు బయటకు వచ్చాయి. అతడి వ్యక్తిత్వానికి ముగ్ధుడయ్యారు స్థానిక ఎమ్మెల్యే పూండి కలైవానన్. జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించి.. దురైను పిలిపించి కొడుకు ఆపరేషన్ కు అవసరమైన రూ.4 లక్షల మొత్తాన్ని చెక్కుగా ఇచ్చారు. ఇందుకు తన సొంత డబ్బుల్ని ఇస్తున్నట్లుగా ఎమ్మెల్యే చెప్పారు. అంతేకాదు.. దురైకు ఏ అవసరం ఉన్నా తన వద్దకు రావాలని చెప్పారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా నిజాయితీకి దక్కిన బహుమానంగా అభివర్ణిస్తున్నారు.