Begin typing your search above and press return to search.

దుబాయ్ మృతుల్లో తెలుగు కార్మికులు.. గల్ఫ్ లో ఘోర ప్రమాదం

ఈ మినీబస్సులో ప్రయాణిస్తున్న భారతీయ కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారని చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   9 Jun 2026 3:11 PM IST
దుబాయ్ మృతుల్లో తెలుగు కార్మికులు.. గల్ఫ్ లో ఘోర ప్రమాదం
X

ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన భారతీయ కార్మికుల జీవితాల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. దుబాయ్‌లోని ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, మరణించిన వారిలో ముగ్గురు కార్మికులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారుగా చెబుతున్నారు. ఉపాధి కోసం, కుటుంబాలను పోషించుకోవడం కోసం దుబాయ్ వెళ్లిన కార్మికులు ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం వారి స్వగ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరణించిన మిగిలిన వారి వివరాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

దుబాయ్ పోలీస్ అధికారి బ్రిగేడియర్ జుమా సాలెం బిన్ సువైదాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎమిరేట్స్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒక భారీ ట్రక్కు సాంకేతిక లోపం కారణంగా అకస్మాత్తుగా రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఒక మినీబస్సు, ఆగి ఉన్న ట్రక్కును వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ మినీబస్సులో ప్రయాణిస్తున్న భారతీయ కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారని చెబుతున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ట్రక్కును గమనించడంలో పొరపాటు, సురక్షితమైన దూరాన్ని పాటించడంలో మినీబస్సు డ్రైవర్ పూర్తిగా విఫలమయ్యాడని పోలీసులు చెబుతున్నారు.

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం సంభవించిందని దుబాయ్ పోలీసులు తమ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. భారత రాయబార అధికారులు ఆసుపత్రికి చేరుకుని గాయపడిన భారతీయులను పరామర్శించారు. బాధితులు వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు స్థానిక దుబాయ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎక్స్ వేదికగా కాన్సులేట్ ప్రకటించింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం మరణించిన వారిలో తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన అబ్దుల్ రఫీక్, సయ్యద్ సలీమ్, గాజుల తిరుపతి ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సయీద్ ఉన్నారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వీరంతా షార్జాలోని ఒక ప్రముఖ అల్యూమినియం గ్లాస్ అండ్ డోర్ ఫ్రేమ్ పరిశ్రమలో పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఈ సంస్థ కేరళకు చెందిన ఒక భారతీయ పారిశ్రామికవేత్త యాజమాన్యంలో నడుస్తోందని సమాచారం.

సహాయక చర్యలు - దర్యాప్తు

ఇక ప్రమాదం జరిగిన వెంటనే దుబాయ్ పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మినీబస్సు శిథిలాల నుంచి బాధితులను వెలికితీసి, చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన తొమ్మిది మందిలో ఐదుగురికి తీవ్రమైన గాయాలు కాగా, నలుగురికి మధ్యస్థంగా గాయాలయ్యాయి. ట్రాఫిక్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందిన నిపుణులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.