Begin typing your search above and press return to search.

దుబాయ్ విషాధ గాధ.. కుప్పకూలిన రియల్ ఎస్టేట్.. మళ్లీ కోలుకునేనా?

యుద్ధం తెచ్చిన అస్థిరత వల్ల ఒకప్పటి 'గోల్డెన్ సిటీ' ఇప్పుడు పెట్టుబడిదారుల పాలిట 'రిస్క్ జోన్'గా మారిన తీరును లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తుంటాయి.

By:  Tupaki Political Desk   |   1 April 2026 4:00 PM IST
దుబాయ్ విషాధ గాధ.. కుప్పకూలిన రియల్ ఎస్టేట్.. మళ్లీ కోలుకునేనా?
X

ఒకప్పుడు ఎడారిలో అద్భుతాలు సృష్టించి, ప్రపంచ కుబేరులకు సురక్షిత స్వర్గధామంగా నిలిచిన దుబాయ్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం.. ఇప్పుడు యుద్ధ మేఘాల చాటున చిక్కి విలవిలలాడడం ఒక పెద్ద సామాజిక, ఆర్థిక విషాదమని చెప్పవచ్చు. 2026 ప్రారంభంలో రికార్డు స్థాయి లాభాలతో కళకళలాడిన ఈ రంగం, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో వారాల్లోనే కుప్పకూలడం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టిస్తోంది. యుద్ధం తెచ్చిన అస్థిరత వల్ల ఒకప్పటి 'గోల్డెన్ సిటీ' ఇప్పుడు పెట్టుబడిదారుల పాలిట 'రిస్క్ జోన్'గా మారిన తీరును లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తుంటాయి.

ఇండెక్స్ పతనం

దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా పడిపోయింది. దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ రెండు వారాల్లోనే 30 శాతం మేర పతనమైంది. అంటే 2026 ఆరంభంలో సాధించిన వృద్ధి అంతా ఆవిరైపోయిందని చెప్పవచ్చు. గోల్డ్ మన్ సాక్స్ నివేదిక ప్రకారం, మార్చి మొదటి 15 రోజుల్లో లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 37 శాతం తగ్గిపోయాయి. ఇన్వెస్టర్లు తమ మూలధనాన్ని కాపాడుకునేందుకు ఆస్తులను విక్రయించడానికి పోటీ పడుతున్నారు.

యుద్ధానికి ముందు vs తర్వాత

జనవరి 2026లో దుబాయ్ మార్కెట్ తన ఉచ్ఛస్థితిని చూసింది. జనవరిలో రూ. 1.6 లక్షల కోట్ల విలువైన విక్రయాలతో మార్కెట్ రికార్డు సృష్టించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అక్కడి ధనికులు దుబాయ్‌ను ఆశ్రయించడంతో ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేరుగా ప్రాంతీయ అస్థిరతకు దారితీసింది. విమానాశ్రయాలపై దాడుల భయం వల్ల పర్యాటకం, వ్యాపారం దెబ్బతిన్నాయి. ఫలితంగా ఎమార్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు 26 శాతం పడిపోయాయి.

అద్దెదారులదే పైచేయి!

ఒకప్పుడు ఇంటి యజమానులు చెప్పిందే వేదంగా ఉండే దుబాయ్ అద్దెల మార్కెట్‌లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో ఏటా 15-20 శాతం పెరిగే అద్దెలు, ఇప్పుడు కేవలం 4 నుంచి 6 శాతానికి పడిపోయాయి. యుద్ధం భయంతో కొత్తగా వచ్చే వారి సంఖ్య తగ్గడమే కాకుండా, ఉన్నవారు కూడా వెనుదిరుగుతున్నారు. జనాభా వృద్ధి రేటు 4 శాతం నుంచి 1 శాతానికి పడిపోవచ్చని అంచనా. దీనివల్ల లగ్జరీ ఏరియాల్లో కూడా అద్దెదారులు ఇప్పుడు యజమానులతో బేరసారాలు ఆడే స్థితికి వచ్చారు.

హెచ్చరిస్తున్న నిపుణులు..

దుబాయ్ కోల్పోయిన అతిపెద్ద ఆస్తి దాని ‘సురక్షిత పెట్టుబడి కేంద్రం’ అనే నమ్మకమే. యుద్ధం రేపు ఆగిపోయినా, మళ్లీ ఎప్పుడు గొడవలు మొదలవుతాయోననే భయం ఇన్వెస్టర్లను వెన్నాడుతూనే ఉంటుంది. సిటీ గ్రూప్ వంటి సంస్థలు ఇప్పటికే జనాభా వృద్ధి అంచనాలను తగ్గించేశాయి. రాబోయే మూడేళ్లలో ప్రాపర్టీ ధరలు ఏటా 7 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఒక తాత్కాలిక ఒడిదుడుకు కాదు.., ఒక దీర్ఘకాలిక తిరోగమనంగా కనిపిస్తోంది.

దుబాయ్ రియల్ ఎస్టేట్ వైభవం దాని భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై ఆధారపడి ఉంది. యుద్ధం తెచ్చిన ఈ గాయం అంత సులభంగా మానదు. ఇన్వెస్టర్లు మళ్లీ దుబాయ్‌ను నమ్మాలంటే శాంతి సుస్థిరతలే ఏకైక మార్గం. ఆకాశహర్మ్యాల నగరం ఎప్పుడు పాత వైభవాన్ని సంతరించుకుంటుందో అది కాలమే నిర్ణయించాలి. సామాన్య ఇన్వెస్టర్లు ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది.