Begin typing your search above and press return to search.

ముంబై కంటే దారుణం.. రూ.62 వేలకు బాల్కనీ గది అద్దె..వైరల్ వీడియో

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లేవారికి అక్కడ గదుల అద్దెలు ఒక పెద్ద సవాలుగా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   1 May 2025 10:00 PM IST
ముంబై కంటే దారుణం.. రూ.62 వేలకు బాల్కనీ  గది అద్దె..వైరల్ వీడియో
X

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లేవారికి అక్కడ గదుల అద్దెలు ఒక పెద్ద సవాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా దుబాయ్ వంటి నగరాల్లో అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా దుబాయ్‌లోని ఒక చిన్న గదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన మెరీనాలో, ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ బాల్కనీ పరిమాణంలో ఉన్న ఒక చిన్న గది వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ గదిలో కేవలం ఒక మంచం, ఒక చిన్న అల్మారా మాత్రమే పట్టేంత స్థలం ఉంది. ఎక్కువ సామాను పెట్టుకోవడానికి కూడా వీలు లేదు. ఈ గది అద్దె దుబాయ్ కరెన్సీలో 2700 దిర్హామ్స్ అని పేర్కొన్నారు. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ.62 వేలు!

ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో, అనేక మంది యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని ముంబైలోని చిన్న అపార్ట్‌మెంట్లతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. "ఇలాంటి గదుల్లో ఎవరైనా ఎలా నివసిస్తారు? ఇది చాలా దారుణం" అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరొక యూజర్ వ్యంగ్యంగా "బాల్కనీలు చాలా పెద్దగా ఉన్నాయి" అని అన్నాడు. "భారత్‌లోని ముంబై లాంటి ప్రాంతమే మెరీనా. అక్కడ ధరలు ఇలానే ఉంటాయి" అని ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

దుబాయ్‌లో అద్దె ధరలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. మార్కెట్‌లోని డిమాండ్‌కు అనుగుణంగా అక్కడి ల్యాండ్ డిపార్ట్‌మెంట్ 'రియల్ టైం రెంటల్ ఇండెక్స్'ను ప్రారంభించడంతో ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో అద్దెలు 8 శాతం నుండి 15 శాతం వరకు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.