Begin typing your search above and press return to search.

తెలుగు రాజకీయాల్ని షేక్ చేస్తున్న ఫ్లాట్ నంబరు 5801 కేరాఫ్ దుబాయ్!

వీరంతా ఈ భారీబహుళ అంతస్తుల భవనంలోని 58వ అంతస్తులోని ఫ్లాట్ నంబరు 5801లో కొన్నేళ్లు ఉన్న విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు.

By:  Tupaki Desk   |   18 July 2025 11:44 AM IST
తెలుగు రాజకీయాల్ని షేక్ చేస్తున్న ఫ్లాట్ నంబరు 5801 కేరాఫ్ దుబాయ్!
X

తెలుగు రాజకీయాల్లో సంచలన చర్చగా మారింది దుబాయ్ లోని ఒక ఇల్లు. దీనికి కారణం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కాం.. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ రెండు ఎపిసోడ్ లకు సంబంధించి.. దుబాయ్ లోని ఒక లగ్జరీ ఫ్లాట్ డెన్ గా మారిందన్నది ఇప్పుడు తెర మీదకు వచ్చిన కొత్త అంశం. దుబాయ్ లోని ప్రైమ్ ఏరియాగా పేరున్న పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ అన్న భారీ బహుళ అంతస్తుల భవనం 66 అంతస్తుల్లో ఉంటుంది.

ఈ భారీ బహుళ అంతస్తుల భవనంలో ఒకటో అంతస్తు నుంచి 34వ అంతస్తు వరకు ఒక ఫైవ్ స్టార్ హోటల్ ను నిర్వహిస్తున్నారు. 35వ అంతస్తు నుంచి 66వ అంతస్తు వరకు రెసిడెన్సీ ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులోనే ఏపీలో వేలాది కోట్ల విలువైన మద్యం స్కాంలో భారీ మొత్తాన్ని కొల్లగొట్టి దుబాయ్ కు పారిపోయి.. అక్కడ పెట్టుబడులు.. కంపెనీల్ని ఏర్పాటు చేసుకున్న వైసీపీకి చెందిన ముఠా ఈ భవనాన్నే తమ డెన్ గా చేసుకున్న విషయం తాజాగా వెలుగు చూసింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న బూనేటి చాణక్య.. పురుషోత్తం.. వరుణ్ కుమార్ తో పాటు మరికొందరు ఉన్నారు. ఇక్కడే మరో ఆసక్తికరన అంశం వెలుగు చూసింది. అదేమంటే.. తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాననిందితుడైన శ్రవణ్ రావు కూడా ఇదే ఫ్లాట్ లో ఉండటం ఆసక్తికరంగా మారింది. వీరంతా ఈ భారీబహుళ అంతస్తుల భవనంలోని 58వ అంతస్తులోని ఫ్లాట్ నంబరు 5801లో కొన్నేళ్లు ఉన్న విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు.

ఈ ఫ్లాట్ ను ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు.. హైదరాబాద్ కు చెందిన ఆకర్ష్ క్రిష్ణలు కలిసి 2023లో కొన్నారు. దీని విస్తీర్ణం 1340.54 చదరపు అడుగులు. దీన్ని ఆకర్ష క్రిష్ణ సతీమణి కావ్య.. శ్రవణ్ రావు సతీమణి స్వాతిరావులు చెరి సగం వాటాలతో కొనుగోలు చేశారు. దీన్ని మరో సంస్థకు అద్దెకు ఇచ్చారు. అనంతరం శ్రవణ్ రావు తమను పూర్తిగా పక్కన పెట్టేసి తన సతీమణి స్వాతిరావు పేరుతో అద్దె ఒప్పందాన్ని చేసుకొని ఫ్లాట్ ను తన అధీనంలో పెట్టుకున్నట్లుగా ఆకర్ష్ క్రిష్ణ సిట్ అధికారులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం బయటకు వచ్చింది.

ఆ ఫ్లాట్ లో ఎవరెవరు ఉన్నారు? అన్న అంశాన్ని ఆకర్ష్ క్రిష్ణ వివరాలు సేకరించగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 27నుంచి ఏప్రిల్ 27 వరకు మద్యం కేసులో నిందితులైన చాణక్య.. పురుషోత్తంతో పాటు పలువురు ఇందులో ఉన్నట్లుగా తేలింది. దీంతో.. ఏపీ మద్యం కుంభకోణంతో పాటు.. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఒకే చోట..ఒకే భవనంలో ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలన చర్చ జరుగుతోంది.