Begin typing your search above and press return to search.

వైర‌ల్ టాక్‌: ఏటా భ‌ర్త '3 కేజీ'ల కానుక ... నీ భార్య 'బంగారం' కాను!

పెరిగిన రేట్ల కార‌ణంగా తులం బంగారం కొనాలంటేనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవులు గిల‌గిల‌లాడుతున్నారు. బ‌డ్జెట్ లెక్క‌ల‌తో నానా ర‌కాలుగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

By:  Sivaji Kontham   |   24 May 2026 6:00 PM IST
వైర‌ల్ టాక్‌: ఏటా భ‌ర్త 3 కేజీల కానుక ... నీ భార్య బంగారం కాను!
X

పెరిగిన రేట్ల కార‌ణంగా తులం బంగారం కొనాలంటేనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవులు గిల‌గిల‌లాడుతున్నారు. బ‌డ్జెట్ లెక్క‌ల‌తో నానా ర‌కాలుగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే ఆయ‌న మాత్రం అలా కాదు.. భార్య‌కు ఏడాదికొక‌సారి 3 కేజీల బంగారం కొని కానుకిచ్చేస్తుంటాడ‌ట‌.. విన‌డానికి విడ్డూరంగా ఉన్నా కానీ ఇది నిజం.

పాపుల‌ర్ ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన `దేశి బ్లింగ్` అనే రియాలిటీ సిరీస్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దుబాయ్‌లో నివసిస్తున్న సంపన్న భారతీయ ప్రవాసుల విలాసవంతమైన జీవనశైలి చుట్టూ ఈ సిరీస్ ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేస్తోంది. ఈ షోలో పాల్గొన్న అనెక్స్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సతీష్ సన్‌పాల్ ..ఆయ‌న‌ భార్య తాబిందా సన్‌పాల్ ల‌కు సంబంధించిన విస్తుపోయే లగ్జరీ లైఫ్‌ విశేషాలు, వారి సంపద గురించిన విష‌యాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ షోలో తాబిందా సన్‌పాల్ తన వద్ద ఉన్న బంగారు ఆభరణాల గురించి మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. తన వద్ద ఇప్పటికే దాదాపు 40 కేజీల బంగారం ఉందని.. ప్రతి ఏటా ధనత్రయోదశి పండుగ సందర్భంగా భర్త సతీష్ తనకు 3 కేజీల బంగారాన్ని కానుకగా ఇస్తారని వెల్లడించారు. అంతేకాకుండా..వారి వివాహ పదో వార్షికోత్సవం సందర్భంగా తన భార్యను తులాభారం(త‌క్కెడ‌)లో బంగారంతో తూచబోతున్నట్లు సతీష్ గర్వంగా ప్రకటించారు. ఈ సంభాషణలు విన్న తోటి సెలబ్రిటీలు, నెటిజన్లు వారి సంపద స్థాయిని చూసి నోరెళ్లబెడుతున్నారు.

వీరి విలాసాలు కేవలం బంగారానికే పరిమితం కాలేదు.. ఈ జంట‌ కుమార్తె బెల్లా పుట్టకముందే త‌న‌ కోసం ప్రత్యేకంగా బంగారంతో స్పూన్లు, ప్లేట్లు, గ్లాసులను తయారు చేయించారట. దుబాయ్‌లోనే అత్యంత ధనికురాలైన చిన్నారిగా త‌మ కిడ్ ని అభివర్ణించిన తాబిందా... పాప మొదటి పుట్టినరోజు వేడుకను ఒక ప్రిన్సెస్ బ‌ర్త్ డే తరహాలో గ్రాండ్ గా నిర్వహించామని.. ఆ బర్త్‌డే గిఫ్ట్‌గా సతీష్ ఒక కస్టమైజ్డ్ పింక్ కలర్ `రోల్స్ రాయిస్` కారును ఆర్డర్ చేశారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుండి సాధారణ వ్యక్తిగా దుబాయ్ వచ్చి నేడు బిలియనీర్‌గా ఎదిగిన సతీష్ ``మా వద్ద డబ్బు ఉంది.. అది మాట్లాడుతుంది`` అని వ్యాఖ్యానించారు.

అయితే ఈ టైప్‌లో సంపద గురించి ఓపెన్ గా చెప్పేస్తుంటే..నెటిజ‌నుల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వీరి లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను చూసి ఆశ్చర్యపోతుంటే... మరికొందరు మాత్రం త‌మ‌లోని ధ‌న‌దాహం గురించి ఇంత బహిరంగంగా ప్రదర్శించడం భారతీయ సంస్కృతి కాదంటూ విమర్శిస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న నటుడు కరణ్ కుంద్రా సైతం స్పందిస్తూ... సాధారణంగా భారత్‌లో ఎవరైనా ఇంత ఓపెన్‌గా డబ్బు, బంగారం గురించి మాట్లాడితే ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతాయని... కానీ దుబాయ్ ఎలైట్ క్లబ్‌లో స‌ద‌రు జంట‌ పవర్ - ఇన్‌ఫ్లుయెన్స్ వేరే స్థాయిలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు.