చరిత్రలో తొలిసారి..దుబాయ్ లో 2 రోజుల వ్యవధిలో ఇన్ని పేలుళ్లా?
దుబాయ్ లోనే అత్యంత కీలక పారిశ్రామిక ప్రాంతం.. ఓడరేవు అయిన జెబెల్ అలీ జోన్ లో కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలో ఏడు వరుస భారీ పేలుళ్లు చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది.
By: Garuda Media | 6 Aug 2026 9:53 AM ISTప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మహానగరంగా చెప్పే దుబాయ్ లో పరిస్థితులు అనూహ్య రీతిలో ఉంటున్నాయి. ఇరాన్ - అమెరికా మధ్య జరుగుతున్నయుద్ధం తర్వాత నుంచి ఈ దేశంలో అనిశ్చితి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దుబాయ్ చరిత్రలో తొలిసారి రెండు రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న పేలుళ్లు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. దుబాయ్ ప్రభుత్వం అమలు చేసే కఠిన చర్యలతో పాటు.. అక్కడి చట్టాలను అనుసరిస్తే.. అక్కడ ఏం జరుగుతుందన్న వివరాలు పెద్దగా బయటకు రాని పరిస్థితి. పూర్తిగా దుబాయ్ ప్రభుత్వ అధికారిక ప్రకటనలను పరిగణలోకి తీసుకొని మాత్రమే చెప్పే పరిస్థితి. అయితే.. అంతర్జాతీయ మీడియాతో పాటు.. ఇతర దేశాల్లోని మీడియా ప్రసారం చేసే వార్తలతో ఇలా జరిగి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకూ అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..
కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఫలానా వారు దాడికి పాల్పడి ఉంటారన్న అంచనానే తప్పించి.. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కానీ.. మరే దేశం కానీ దుబాయ్ లో చోటు చేసుకున్న పేలుళ్లకు తామే బాధ్యులమన్న ప్రకటన చేయలేదు. ఆగస్టు 3న దుబాయ్ లోని షేక్ జాయెద్ రోడ్డులోని ఒక కార్ షోరూంలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో ఒక భారతీయ యువకుడు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు. మరో ఉదంతం బుధవారం (భారత కాలమానం ప్రకారం ఉదయం 6.10 గంటల ప్రాంతంలో) చోటు చేసుకుంది.
దుబాయ్ లోనే అత్యంత కీలక పారిశ్రామిక ప్రాంతం.. ఓడరేవు అయిన జెబెల్ అలీ జోన్ లో కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలో ఏడు వరుస భారీ పేలుళ్లు చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. అయితే.. ఈ వరుస పేలుళ్లలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. నాసా థర్మల్ ఇమేజరీ ప్రకారం చూస్తే.. జెబెల్ అలీ పోర్టు సమీపంలోని ఒక ఇండస్ట్రియల్ వర్క్ షాప్ లో ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. దీన్ని ఒక ఫ్యూయల్ డిపోగా కూడా చెబుతున్నారు. ఈ వరుస పేలుళ్ల కారణంగా అక్కడున్న పలు ట్రక్కులు.. కారవాన్లు పూర్తిగా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని దుబాయ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఒక వర్క్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగానే అక్కడున్న ట్రక్కులు పేలి.. భారీ శబ్దాలు వచ్చినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ మీడియా వెర్షన్ చూస్తే.. అమెరికా - ఇరాన్ యుద్ధ నేపథ్యంలో యెమెన్ దేశానికి చెందిన హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి.. డ్రోన్ దాడులకు పాల్పడి ఉండొచ్చని ఇరాన్.. ఇరాకీ మీడియా సంస్థలు అంచనా వేయటం గమనార్హం. ఈ పేలుళ్లకు బాధ్యతను ఇప్పటివరకు ఏ సంస్థా తీసుకోలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సర్కార్ సైతం ఎలాంటి అధికారిక క్షిపణి దాడి అంశాన్ని ధ్రువీకరించలేదు.
దుబాయ్ చరిత్రలోనే ఇలాంటి ఘటనలు గతంలో జరగని నేపథ్యంలో.. ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు ప్రజలు తమ చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లతో ఫోటోలు.. వీడియోలు తీసి పోస్టు చేసుకునే తీరుపై కఠిన నిబంధనల్ని అమలు చేస్తోంది. ప్రమాదాలు.. పేలుళ్లు.. సైనిక మెహరింపులు.. సున్నిత ప్రాంతాలకు చెందిన అంశాల్ని రికార్డు చేయటం.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయటం తీవ్రమైన నేరం. ఇందుకు తగ్గట్లే జెబెల్ అలీ పేలుళ్లను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఇద్దరిని దుబాయ్ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. దీంతో స్థానికులు ఎవరూ వీడియోలను షేర్ చేయకుండా గప్ చిప్ గా ఉంటున్నారు. దీంతో దుబాయ్ లోపల అసలేం జరుగుతుందన్న దానిపై ఒకలాంటి స్పష్టత రాని పరిస్థితి.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గతంలోనూ సరిగ్గా ఇదే తరహాలో పేలుళ్ల ఉదంతం 2021 జులైలో చోటు చేసుకున్నట్లుగా చెబుతారు. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలో ఇలా పేలుళ్లు చోటు చేసుకోవటం దుబాయ్ చరిత్రలోనే తొలిసారి అన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇరాన్ కు చెందిన ప్రెస్ టీవీ, మెహర్ న్యూస్ సంస్థలు.. ఈ పేలుళ్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ లను తొలిసారిగా ప్రసారం చేశాయి. కొన్ని ఇరాకీ మీడియా సంస్థలతో పాటు అరబ్ స్వతంత్ర మీడియా కథనాల ప్రకారం చూస్తే.. యెమెన్ కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణితోనే ఈ పేలుళ్లు జరిగి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంతకూ పేలుళ్లు చోటు చేసుకున్న ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందా? ఈ ప్రాంతానికి ఉన్న కీలకాంశాల్ని చూస్తే.. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఫ్రీ జోన్ లో ఇదొకటి. 150 దేశాలకు చెందిన 11వేల అంతర్జాతీయ కంపెనీలకు ఇక్కడ సంస్థలు ఉన్నాయి. వీటిలో వందకు పైగా కంపెనీలు ఫార్చ్యూన్ 500 కంపెనీల ఉండటం గమనార్హం. దుబాయ్ నగరానికి పశ్చిమ చివరన ఈ ఫ్రీ జోన్ ఉంది. ఈ ఒక్క ఫ్రీ జోన్ దుబాయ్ మొత్తం జీడీపీలో దాదాపు 23 శాతం నుంచి 24 శాతం వరకు వాటా ఉండటం గమనార్హం.
ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత ఓడరేవుగా చెప్పాలి. అల్ ముక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నేరుగా రోడ్డు మార్గంతో కలుపుతూ అంతర్జాతీయ రవాణాకు కీలకంగా వ్యవహరిస్తోంది. జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో భారీ ఎత్తున ఇంధన నిల్వలతో పాటు.. కెమికల్ వర్క్ షాపులు ఉన్నాయి. ఇక్కడ జరిగే చిన్న పేలుడు.. భారీ నష్టానికి కారణమవుతుందని చెప్పాలి. మరో కీలక అంశం ఏమంటే.. అమెరికా బయట ఆ దేశానికి చెందిన నేవీ అత్యధికంగా సందర్శించే ఏకైక విదేశీ ఓడరేవు ఇదే. ఇక్కడ అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమాన వాహక నౌకలు ఇక్కడ ఆగుతుంటాయి.
ప్రస్తుతం ఇరాన్ - అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా సైనిక, ఆర్థిక ప్రయోజనాలకు కేంద్రంగా ఉన్న గల్ఫ్ దేశాల పోర్టులను.. ఇంధన గిడ్డంగులను లక్ష్యంగా చేసుకోవటం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బ తీయటంతో పాటు.. దుబాయ్ అత్యంత సురక్షిత ప్రాంతమన్న బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. అమెరికా మీద తీవ్రమైన ఒత్తిడిని తీసుకు రావటానికి దుబాయ్ కు మించిన చక్కటి ప్రత్యామ్నాయం మరొకటి లేదన్న అభిప్రాయం ఉంది. అందుకే ఈ వరుస పేలుళ్ల ఉదంతాలన్న మాట వినిపిస్తోంది. అయితే.. దుబాయ్ ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాదనల్ని అస్సలు ధ్రువీకరించటం లేదు. మొత్తంగా చూస్తే.. ఈ తాత్కాలిక సవాల్ ను దుబాయ్ త్వరగానే అధిగమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
