వీడు భలే దొంగ.. చోరీకి వచ్చిన ఇంట్లోనే వారం రోజులుగా మకాం
అదును చిక్కితే డబ్బు, నగలు కొల్లగొట్టి ఎవరి కంట పడకుండా తప్పించుకుంటారు దొంగలు.. రాత్రి సమయాల్లోనో.. తాళం వేసిన ఇళ్లలోనో దొంగతనం చేస్తుంటారు.
By: Tupaki Desk | 2 July 2025 1:22 PM ISTఅదును చిక్కితే డబ్బు, నగలు కొల్లగొట్టి ఎవరి కంట పడకుండా తప్పించుకుంటారు దొంగలు.. రాత్రి సమయాల్లోనో.. తాళం వేసిన ఇళ్లలోనో దొంగతనం చేస్తుంటారు. కానీ, దొంగతనానికి వచ్చిన ఇంట్లోనే నాలుగైదు రోజులు ఉండి.. తాపీగా ఒక్కో వస్తువు అమ్ముకుంటూ, అక్కడే తిని, అక్కడే నిద్రించి, మళ్లీ.. మళ్లీ ఎవరైనా దొంగతనం చేస్తారా? ఇంతవరకు అలాంటి దొంగ కోసం ఎవరూ విని ఉండరు. దొంగతనానికి వచ్చిన ఇంట్లోనే తాగిన మైకంలో నిద్రపోయి పోలీసులకు చిక్కాడో దొంగ. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈ భలే దొంగ దొరికిపోయిన ఉదంతం ఆసక్తికరంగా మారింది.
తాళం వేసి ఊరు వెళ్లిన రైతు ఇంట్లో నాలుగైదు రోజులుగా ఓ అపరిచితుడు తచ్చాడుతుండటం చూసిన చుట్టపక్కల వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో ఆ దొంగ దొరికిపోయాడు. బొబ్బిలి శివార్లలోని గొల్లపల్లి అంబేద్కర్ కాలనీలో అలజంగి గ్రామానికి చెందిన రైతు దంపతులు శీర శ్రీనివాసరావు, జయలక్ష్మి నివాసం ఉంటున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమవడంతో వీరు గొల్లపల్లి ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన పిరిడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శ్రీనివాసరావు ఇంట్లోకి చొరబడ్డాడు.
బీరువాను తెరిచి వెండి వస్తువులను కాజేశాడు. అంతేకాకుండా నాలుగైదు రోజులుగా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఉదయం నిద్ర లేచి వెండి వస్తువులను మార్కెట్ కి తీసుకెళ్లి అమ్ముకోవడం, ఆ డబ్బుతో మద్యం కొనుగోలు చేసి మళ్లీ అదే ఇంటికి వచ్చి తాగి మత్తులోకి జారుకోవడం దినచర్యగా మార్చుకున్నాడు. ఇలా నాలుగైదు రోజులుగా ఆ దొంగ ఆ ఇంటిని కేంద్రంగా మార్చుకున్నాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల ఇళ్ల వారు గమనించి ఇంటి యజమాని శ్రీనివాసరావుకు సమాచారమిచ్చారు. అదేసమయంలో విశాఖలో ఉంటున్న శ్రీనివాసరావు కుమారుడికి కూడా తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం రాత్రి పోలీసులు గొల్లపల్లిలో శ్రీనివాసరావు ఇంటికి వచ్చారు.
పోలీసులు చేరుకున్న సమయంలో దొంగ ఇంటిలోనే హాయిగా నిద్రపోతున్నాడు. వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎంతమేర వెండి వస్తువులను దొంగిలించాడనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నాలుగైదు రోజులుగా బీరువాను గుల్ల చేస్తున్న దొంగ.. ఆ బీరువాలోనే ఉన్న రూ.10 వేల నగదును ముట్టుకోకపోవడం గమనార్హం. రూ.10 వేలు నగదు కంట పడలేదా? లేక చివర్లో డబ్బు పట్టుకుని ఉడాయిద్దామని భావించాడో కానీ, చుట్టుపక్కల ఇళ్లల్లోని వారి కంట పడి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఉదంతం పేపర్లలో రావడంతో వైరల్ గా మారింది.
