ఆకాశంలో లవ్ మెసేజ్లు .. డ్రోన్‌లతో పెళ్లిళ్లు.. యూఏఈలో కొత్త ట్రెండ్
ముఖ్యంగా యూఏఈ వంటి దేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగులకు విపరీతమైన క్రేజ్ ఉండడంతో ఆకాశంలో గుండె ఆకారాలు, జంటల పేర్లు రాసే డ్రోన్ షోలు విరివిగా ఉపయోగిస్తున్నారు.
By: Tupaki Desk | 14 May 2025 1:00 PM ISTడ్రోన్‌లంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది యుద్ధభూమి లేదా సీక్రెట్ మిషన్లే. కానీ, ఇప్పుడు ఈ డ్రోన్‌లు పెళ్లిళ్ల అలంకరణలో భాగమవుతున్నాయి. ఆయుధాలు మోసే డ్రోన్లు ఇప్పుడు పెళ్లి వేడుకల్లో లవ్ మెసేజ్లు పంపుతున్నాయి. ముఖ్యంగా యూఏఈ వంటి దేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగులకు విపరీతమైన క్రేజ్ ఉండడంతో ఆకాశంలో గుండె ఆకారాలు, జంటల పేర్లు రాసే డ్రోన్ షోలు విరివిగా ఉపయోగిస్తున్నారు.
గత వారం దుబాయ్‌లో జరిగిన ఒక పెళ్లిలో అతిథులు ఇలాంటి దృశ్యాన్నే చూశారు. రాత్రి చీకటిలో 200 డ్రోన్‌లు ఒకేసారి ఎగిరి, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పేర్లు రాసిన ఒక పెద్ద లవ్ షేప్ క్రియేట్ చేశాయి. ఈ దృశ్యం పెళ్లిళ్లలో డ్రోన్ షోలు కేవలం ఎక్స్ ట్రా అట్రాక్షన్ కాదని, మెయిన్ అట్రాక్షన్ గా మారిపోయాయని స్పష్టం చేసింది.
కార్పొరేట్ ఈవెంట్లు కాదు.. పెళ్లిళ్లలోనూ డ్రోన్ షోల హవా!
ఇంతకు ముందు డ్రోన్ షోలను పెద్ద ప్రభుత్వ లేదా కార్పొరేట్ ఈవెంట్లలో మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు జంటలు కూడా తమ పెళ్లిని స్పెషల్ గా ఎప్పటికీ గుర్తుండి పోయే విధంగా వీటిని ఎంచుకుంటున్నారు. తమ పెళ్లిలో ఇది ఒక హైలైటెడ్ మూమెంట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. బాటిల్‌ల్యాబ్ డైనమిక్స్ సహ వ్యవస్థాపకురాలు, ఎండి సరితా అహ్లావత్ మాట్లాడుతూ.. తమ కంపెనీ భారతదేశంలోని వివిధ నగరాల్లో ఇప్పటివరకు 100 కంటే ఎక్కువ వెడ్డింగ్ డ్రోన్ షోలు నిర్వహించిందని తెలిపారు. ఇప్పుడు ఈ డిమాండ్ యూఏఈలోని డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్‌లైన దుబాయ్, అబుధాబిలో కూడా వేగంగా పెరుగుతోంది.
అంబానీ పెళ్లితో పెరిగిన క్రేజ్
సరితా కంపెనీ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్‌లో 5500 డ్రోన్‌లతో షో నిర్వహించిన తర్వాత ఈ ట్రెండ్‌కు ఊపునిచ్చింది. అది భారతదేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో , ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి ప్రజలు తమ పెళ్లిల్లో దీన్ని చేర్చడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు.
ధర, అనుమతులే అడ్డంకి
అయితే, ఈ ట్రెండ్ ఇంకా అందరికీ అందుబాటులో లేదు. దుబాయ్ వెడ్డింగ్ ఇండస్ట్రీ నిపుణురాలు రియాన్నన్ డౌనీ-హర్స్ట్ మాట్లాడుతూ.. డ్రోన్ షో ఇప్పటికీ ఖరీదైన వ్యవహారం అని అన్నారు. అంతేకాకుండా యూఏఈలో దీనిని నిర్వహించడానికి ప్రత్యేక అనుమతులు, భద్రతా అనుమతులు, నిపుణులైన ఆపరేటర్లు అవసరం. బాటిల్‌ల్యాబ్ డైనమిక్స్ ఇప్పుడు చిన్న స్థాయిలో కూడా డ్రోన్ షోలను అందుబాటులోకి తెస్తోంది. 300-400 డ్రోన్‌లతో చేసే షో కూడా చాలా అందంగా ఉంటుందని సమాచారం. దీని ఖర్చు ఇప్పుడు ఖరీదైన బాణసంచా లేదా హై-ఎండ్ పెర్ఫార్మెన్స్‌తో సమానంగా ఉంది. అంటే ఇకపై ఇది కేవలం బిలియనీర్లకు మాత్రమే పరిమితం కాదు.. డ్రోన్ షో కామన్ పీపుల్ పెళ్లిలో కూడా సాధారణంగా అయిపోయాయి. టెక్నాలజీతో భావోద్వేగాలను జోడించే ఈ ట్రెండ్ యూఏఈలో బాగా ప్రాచుర్యం పొందుతోంది.
