Begin typing your search above and press return to search.

టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన ఘటన… డేటా సెంటర్లపై డ్రోన్ దాడి.. స్పందించిన అమెజాన్

టెక్ ప్రపంచంలో ఇప్పుడు పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న యుద్ధం ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని తాకింది.

By:  Madhu Reddy   |   3 March 2026 4:53 PM IST
టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన ఘటన… డేటా సెంటర్లపై డ్రోన్ దాడి.. స్పందించిన అమెజాన్
X

టెక్ ప్రపంచంలో ఇప్పుడు పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న యుద్ధం ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని తాకింది. యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు జరిగినట్లు స్వయంగా ఆ సంస్థ ధ్రువీకరించడంతో యూజర్లు ఉలిక్కిపడ్డారు. పశ్చిమాసియాలో క్లౌడ్ సర్వీసులు నిలిచిపోవడమే కాకుండా, కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల వెనుక అసలు కథ ఏంటి? వినియోగదారులు తమ డేటాను ఎలా కాపాడుకోవాలంటున్నారో ఇప్పుడు చూద్దాం ..

డేటా సెంటర్లపై డ్రోన్ పంజా.. అమెజాన్ కీలక ప్రకటన:

అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా ఇరాన్ పశ్చిమాసియా దేశాలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో టెక్ దిగ్గజం అమెజాన్ సంస్థకు చెందిన డేటా సెంటర్లే లక్ష్యంగా దాడులు జరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని తమ రెండు డేటా సెంటర్లపై డ్రోన్లతో దాడి జరిగినట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తాజాగా ప్రకటించింది. దీనివల్ల పశ్చిమాసియా ప్రాంతంలో క్లౌడ్ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక బహ్రెయిన్‌లోని డేటా సెంటర్ సమీపంలో కూడా దాడులు జరగడం వల్ల భవనాలు , సర్వర్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు సంస్థ వెల్లడించింది.

సర్వీసుల్లో అంతరాయం.. వినియోగదారులకు హెచ్చరిక:

ఈ దాడుల కారణంగా టెక్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ముఖ్యంగా అమెజాన్ సర్వీసులపై ఆధారపడే కంపెనీలు, వెబ్‌సైట్లు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ ప్రమాదంలో ఉద్యోగులెవరైనా గాయపడ్డారా అనే విషయంపై క్లారిటీగా చెప్పలేదు, కానీ సర్వీసుల రిపేర్ కు స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు వెంటనే తమ కీలకమైన డేటాను బ్యాకప్ చేసుకోవాలని సంస్థ సూచించింది. అవసరమైతే ఇతర ప్రాంతాల్లోని సర్వర్లకు మారిపోవాలని హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

యుద్ధం వల్ల డిజిటల్ లోకానికి ముప్పు:

కేవలం సరిహద్దులకే పరిమితం కావాల్సిన యుద్ధం ఇప్పుడు టెక్నాలజీ కేంద్రాల వరకు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ జరుపుతున్న ఈ దాడులు ప్రపంచ వ్యాప్తంగా డేటా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇలాంటి దాడులు జరిగితే కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారం మరియు కంపెనీల రహస్య డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం అమెజాన్ తన సిబ్బందిని అప్రమత్తం చేసి, మౌలిక సదుపాయాల పునర్నిర్మాణంలో నిమగ్నమైంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న పశ్చిమాసియాలో డిజిటల్ సేవలు మళ్ళీ ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయోనని టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.