Begin typing your search above and press return to search.

చెప్పులు వేసుకొని వాహనం నడుపుతున్నారా.. ఇది మీ కోసమే..

ఇటీవల సోషల్ మీడియాలో ఒక అంశం చర్చకు దారితీస్తోంది. చెప్పులు వేసుకొని కారు లేదంటే బైక్ నడపడం చట్టవిరుద్ధమని అనేక పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   26 Sept 2025 12:00 AM IST
చెప్పులు వేసుకొని వాహనం నడుపుతున్నారా.. ఇది మీ కోసమే..
X

ఇండియాలో ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రోడ్లపై వాహనంలో ప్రయాణించే ప్రతి ఒక్కరి భద్రత, బాట వెంట నడిచి వెళ్లే బాటసారుల భద్రత ఈ రెండూ డ్రైవర్‌ పైనే ఆధారపడి ఉంటాయి. అయితే, నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో ప్రజల్లో అపోహలు కలుగుతాయి.

చెప్పులు వేసుకొని డ్రైవింగ్ పై సోషల్ మీడియాలో వైరల్..

ఇటీవల సోషల్ మీడియాలో ఒక అంశం చర్చకు దారితీస్తోంది. చెప్పులు వేసుకొని కారు లేదంటే బైక్ నడపడం చట్టవిరుద్ధమని అనేక పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. ఈ వార్తను చూసిన కొందరు డ్రైవర్లు భయపడిపోయారు కూడా. కానీ వాస్తవానికి మోటారు వాహన చట్టంలో ఇలాంటి నిబంధన లేదు. చెప్పులు వేసుకొని డ్రైవింగ్ చేయడాన్ని నేరంగా పరిగణించే చలానా లేదంటే జరిమానా ఏదీ లేదని రవాణా నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇలాంటి అపోహలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇంతకీ స్లిప్పర్స్ తో డ్రైవింగ్ ప్రమాదమా..?

అయితే చెప్పులు వేసుకొని డ్రైవింగ్ చేయడం సురక్షితమా అన్న ప్రశ్న కూడా తలెత్తక మానడం లేదు. రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. చెప్పులు ముఖ్యంగా స్లిప్పర్లు లేదా లూజ్ ఫుట్‌వేర్ వేసుకొని డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పెడల్స్‌ పై సరిగా పట్టుకోకపోవడం వల్ల నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. అత్యవసర సమయంలో బ్రేక్ వేయాల్సిన పరిస్థితిలో చెప్పు కదిలిపోవడం లేదా చిక్కుకోవడం వాహనం నియంత్రణను మరింత ప్రమాదంలోకి నెడుతోంది. అందుకే నిపుణులు డ్రైవింగ్ చేసేప్పుడు షూస్‌ ధరించడం మంచిదని చెప్తున్నారు.

భద్రతా పరంగా మాత్రం సరైంది కాదు..

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చట్టపరంగా ఇది తప్పు కాకపోయినా, భద్రతాపరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. డ్రైవర్ తన సౌకర్యం మాత్రమే కాదు.. రోడ్డుపై నడిచే పాదచారులు, ఇతర వాహనదారుల ప్రాణాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చట్టం జరిమానా విధించకపోవడం వల్లే నిర్లక్ష్యంగా ఉండడం సరైన పద్ధతి కాదు. రోడ్డు భద్రత ఎప్పుడూ ‘నిబంధనలు తప్పనిసరి’ అనే కోణంతోనే కాకుండా, ‘సురక్షితమైన అలవాట్లు అవసరం’ అనే దృక్కోణంలో చూడాలి.

షూస్ వేసుకోవడం.. సాధారణ పాదాలతో మేలు..

అందువల్ల చెప్పులు వేసుకొని డ్రైవింగ్ చేయడంపై అపోహలు వాస్తవానికి చట్టపరంగా ఆధారం లేనివే. కానీ జాగ్రత్త పరంగా చెప్పుకుంటే డ్రైవింగ్ చేసే సమయంలో వీలైతే షూస్ ధరించడం మేలని, లేదంటే సాధారణ పాదాలతో మరింత మంచిదని నిపుణులు చెప్పడంలో లోతైన అర్థం ఉంది. రోడ్డు మీద ఒక్క క్షణం నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టగలదన్న నిజాన్ని ఎవరూ మరిచిపోవద్దు.