Begin typing your search above and press return to search.

దొనకొండ విషయంలో చంద్రబాబు మాట నెరవేరుతోంది!

అవును... ఆంధ్రప్రదేశ్‌ కు మరో కీలకమైన పరిశ్రమ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2025 9:42 AM IST
దొనకొండ విషయంలో చంద్రబాబు మాట నెరవేరుతోంది!
X

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని ఏర్పాటుపై ప్రతిపాదనలు వచ్చిన సమయంలో.. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అందుకు కారణాలు చెప్పారు. ఇందులో భాగంగా.. అక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయని.. పంటలు పండే భూములు నాశనం చేయాల్సిన అవసరం లేదనే కామెంట్లు వినిపించాయి.

అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి వైపు మొగ్గు చూపింది. ఈ విషయంపై నాడు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాజధానిని మాత్రం అమరావతిలోనే ఏర్పాటు చేసి, దొనకొండను పరిశ్రమలకు హబ్‌ గా తయారు చేస్తామని చెప్పారు! ఈ నేపథ్యంలో తాజాగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయనే చర్చ జరుగుతోంది. అందుకు కారణం... తాజాగా డీఆర్డీఓ అధికారులు దొనకొండ భూములను పరిశీలించడమే!

అవును... ఆంధ్రప్రదేశ్‌ కు మరో కీలకమైన పరిశ్రమ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సందర్భంగా... ప్రకాశం జిల్లాలోని దొనకొండ సమీపంలో ఆ కీలక పరిశ్రమను ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం... డీఆర్డీవో అధికారుల బృందం అక్కడున్న ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐఐసీ)కి చెందిన భూములను పరిశీలించడమే.

ఈ సమయంలో.. దొనకొండలో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటు కోసం భూమిని పరిశీలించడానికి డీఆర్డీవో ప్రతినిధులు వచ్చారని చెబుతున్నారు. ఈ సమయంలో వారికి సుమారు 100 ఎకరాల భూమి అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దొనకొండలోని బ్రిటిష్ కాలం నాటి ఎయిర్ పోర్ట్ భూముల్ని కూడా పరిశీలించారని అంటున్నారు.

త్వరలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే నీరు సమృద్ధిగా ఉంటుందని.. ఇదే సమయంలో రవాణా మార్గం కూడా అందుబాటులో ఉంటుందని రాష్ట్ర అధికారులు, డీఆర్డీవో బృందానికి వివరించారని అంటున్నారు. దీనిపై డీఆర్డీవో నిర్ణయంపై క్లారిటీ రావాల్సి ఉంది!