Begin typing your search above and press return to search.

విశాఖకే షాకిచ్చేలా డ్రగ్స్ మాఫియా...!

ఏకంగా ఈ కంటైనర్ జర్మనీలోని హాంబర్గ్ నుంచి వచ్చిందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   21 March 2024 6:45 PM GMT
విశాఖకే షాకిచ్చేలా డ్రగ్స్ మాఫియా...!
X

విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ అని విపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. కానీ ఎందుకు ఏమిటి అన్నది ఈ రోజు బయటపడింది. ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ అధికారులు విశాఖ పోర్టుకు చేరుకుని భారీ కంటైనర్ ని స్వాధీనపరుచుకున్నారు. అందులో కళ్ళు చెదిరే స్థాయిలో డ్రగ్స్ దందా బయటపడింది. ఏకంగా ఈ కంటైనర్ జర్మనీలోని హాంబర్గ్ నుంచి వచ్చిందని తెలుస్తోంది.

నిజానికి ఈ కంటైనర్ ఈ నెల 16న విశాఖ పోర్టుకు చేరుకున్నా సీక్రెట్ గానే ఉంచేశారు అని అంటున్నారు. సరిగ్గా వారం తరువాత ఈ గుట్టు రట్టు అయింది. సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచి విశాఖ సీబీఐ అధికారులను అలెర్ట్ చేయడంతో ఈ డ్రగ్స్ రాకెట్ మొత్తం బయటపడింది.

విశాఖలో ఒక గుర్తు తెలియని కంపెనీకి ఈ లోడు మొత్త్తం డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఏకంగా ఇరవై వేల కిలోల డ్రగ్స్ లోడెత్తి మరీ కంటైనర్ ద్వారా విశాఖ తీరానికి చేర్చారు అని అంటున్నారు. ఇక ఈ అక్రమ మాదక ద్రవ్యాల సరఫరాను ఇంటర్ పోల్ అధికారులు గుర్తించి ఢిల్లీ సీబీఐ అధికారులను అప్రమత్తం చేశారని తెలుస్తోంది

వారు వెంటనే విశాఖలోని సీబీఐకి, అలాగే కస్టమ్స్ అధికారులకు ఈ కీలక సమాచారం చేరవేశారు. దాంతో వారు పకడ్బందీగా ఈ ఆపరేషన్ చేసి మొత్తం డ్రగ్స్ కంటైనర్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇక నార్కోటిక్ అధికారులు కూడా కంటైనర్ లో ఉన్న సరుకుని పరిశీలించి అందులో ఉన్నది నిషేధించిన డ్రగ్స్ అని తేల్చారు

ఈ కంటైనర్ లో వేయి బ్యాగులు ఉన్నాయి. ఒక్కో బ్యాగులో ఇరవై అయిదు కిలోల వంతున డ్రగ్ సరంజామా ఉంది. దీంతో ఇది పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంగా డ్రగ్స్ తీరానికి తరలి రావడం అధికారులు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇక ఈ డ్రగ్స్ ని కూడా చాలా తెలివిగా విశాఖకు తరలించారు.

ఒక ఆక్వా కంపెనీ పేరిట దీనిని భారత్ కి తరలించారు అని అంటున్నారు. ఈ డ్రగ్స్ ని బయటకు తెలియకుండా ప్రతీ బ్యాగులో బయటకు డ్రై ఈస్ట్ ని నింపారు. వీటి మధ్యలోనే డ్రగ్స్ ని నింపి ఉంచారు.