చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ విజయంపై తొలిసారి స్పందించిన ప్రొఫెసర్ డా. జి. మాధవి లత
చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం భారత దేశానికి గర్వకారణమైన ఘనత అని డా. మాధవి లత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
By: Tupaki Desk | 10 Jun 2025 6:30 PMప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ విజయం వెనుక సామూహిక కృషి ఉందని, వ్యక్తిగత ప్రచారం తగదని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) ప్రొఫెసర్ డా. జి. మాధవి లత స్పష్టం చేశారు.
చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం భారత దేశానికి గర్వకారణమైన ఘనత అని డా. మాధవి లత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత రైల్వేలు, AFCONS సంస్థల అద్భుతమైన ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణ నైపుణ్యానికి ఈ బ్రిడ్జ్ నిదర్శనమని ఆమె కొనియాడారు. ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ విజయవంతమవడానికి వందలాది మంది నిపుణులు, కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు అనేక రకాలుగా కృషి చేశారని, వారందరూ నిజమైన గుండెచప్పుడు లేని వీరులని ఆమె అభివర్ణించారు.
ఈ ప్రాజెక్టులో AFCONS కు జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా తాను స్లోప్ స్టెబిలైజేషన్ , ఫౌండేషన్స్ రూపకల్పనలో సహకరించినట్లు డా. మాధవి లత తెలిపారు. అయితే "ఈ మిషన్ వెనుక ఉన్న మహిళ", "అసాధ్యాన్ని సాధ్యమైంది చేసింది", "వింతలు చేసింది" అంటూ కొంత మీడియా చేసిన వ్యాఖ్యలు అసత్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు వేల మంది శ్రమించారని, ఒకరి కృషిని మాత్రమే ప్రముఖంగా చూపడం తగదని ఆమె అన్నారు.
అనేక తండ్రులు తమ కూతుళ్లు ఆమెలాంటి వారిగా ఎదగాలని చెప్పడం, చిన్నపిల్లలు సివిల్ ఇంజనీరింగ్‌లో భవిష్యత్తు చూడాలని అనుకుంటున్నామని రాయడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని, ఇది తన జీవితానికి గర్వకారణమని ఆమె తెలిపారు. తనపై ప్రేమను, అభినందనలను వ్యక్తం చేసిన ప్రతి భారతీయుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తాను కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేసిన వందలాది మందిలో ఒకరినే కాబట్టి తన పేరు మాత్రమే ప్రముఖంగా చూపించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం స్పెయిన్‌లోని ఓ సదస్సులో పాల్గొంటున్నానని, తన వ్యక్తిగతతను గౌరవించమని ఆమె కోరారు. ఈ గొప్ప ఘనత మొత్తం భారత రైల్వేలదే అని ఆమె తన ప్రకటనను ముగించారు.