లక్ష్య సాధనలో అలుపెరగని పోరాటం.. 3 అడుగుల డాక్టర్ గురించి తెలుసా?
అవును... గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా గొరభి గ్రామానికి చెందిన గణేష్... 2004లో గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించారు.
By: Raja Ch | 2 Dec 2025 2:00 AM ISTజీవితంలో ఏదైనా సాధించాలంటే అత్యధిక మంది.. సాకులు చెబుతారని అంటారు! అందుకే ఈ ప్రపంచంలో సక్సెస్ ఫుల్ పీపుల్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుందని చెబుతుంటారు! అయితే.. ఒక కోణంలో చూస్తే ప్రతీదీ సమస్యగా, సాకుగా అనిపిస్తుంది కానీ... పాజిటివ్ ధృక్పదంతో, లక్ష్యంపై కసితో ముందుకు సాగితే విజయం దానంతట అదే వస్తుందని అంటారు. డాక్టర్ గణేష్ బరైయా అందుకు తాజాగా ఉదాహరణ!
అవును... గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా గొరభి గ్రామానికి చెందిన గణేష్... 2004లో గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించారు. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచీ వైద్యుడు కావాలని కలలు కన్నారు! ఈ సమయంలో.. ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించి, నీట్ లో మంచి మార్కులు సాధించాడు. అయినప్పటికీ.. శారీరకవైకల్యం కారణంగా 2018లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అభ్యంతరం తెలిపింది!
కేవలం మూడు అడుగుల పొడవు, 20 కిలోల కంటే తక్కువ బరువున్న గణేష్ బరయ్య సుమారు 72 శాతం లోకోమోటివ్ వైకల్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రారంభంలో ఈ శారీరక పరిమితులను ఉధహరించి.. అవి అతడు డాక్టర్ గా పనిచేసే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయని సూచిస్తున్నట్లు తెలిపిందని అంటున్నారు!
అయితే దీనిపై న్యాయపోరాటం చేయాలని గణేష్ భావించినట్లు చెబుతున్నారు. అయితే... భావ్ నగర్ లోని తన వ్యవసాయ కుటుంబం అందుకు అవసరమైన చట్టపరమైన ఖర్చులను భరించలేని పరిస్థితి! ఈ సమయంలో గణేష్ కు తన స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ దల్పత్ భాయ్ కటారియా మద్దతుగా నిలిచారు. గుజరాత్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు.
అయితే... గుజరాత్ హైకోర్టు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తిరస్కరణను సమర్ధించింది. అయినప్పటికీ గణేష్ ఆశలు వదులుకోలేదు.. ఆశయాన్ని సాధించడానికి పట్టుదలనూ విడిచిపెట్టలేదు. ఈ క్రమంలో... తాత్కాలికంగా బీఎస్సీ లో జాయిన్ అయ్యి.. సుప్రీంకోర్టును ఆశ్రయించి, తన పోరాటాన్ని కొనసాగించారు. ఈ సమయంలో.. ఎత్తు కారణంగా అతని ప్రవేశాన్ని నిరాకరించలేమని సుప్రీం తీర్పు చెప్పింది.
ఈ క్రమంలో.. సర్వోన్నత న్యాయస్థానం మద్దతుతో 2019లో భావ్ నగర్ మెడికల్ కాలేజీలో గణేష్ అడ్మిషన్ పొందాడు.. వైద్య విద్యను పూర్తి చేశారు. ఈ సమయంలో రాష్ట్రం నిర్దేశించిన ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన తర్వాత.. ఇప్పుడు కోరుకున్న హోదాలో ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇలా లక్ష్య సాధనలో అలుపెరగని పోరాటం విషయంలో గణేష్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
