విమానయాన సంస్థలకు రాఘవ్ చద్దా సూటి ప్రశ్న.. అది తప్పక ఉండాలని డిమాండ్..
అత్యంత వేగవంతమైన ప్రయాణం అంటే అది విమానయానమే. అలాంటి విమానాలు సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలని మనం ఆశిస్తాం.
By: Tupaki Political Desk | 1 April 2026 7:00 AM ISTఅత్యంత వేగవంతమైన ప్రయాణం అంటే అది విమానయానమే. అలాంటి విమానాలు సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలని మనం ఆశిస్తాం. కానీ, ప్రస్తుతం విమానయాన సంస్థలు వ్యవహరిస్తున్న తీరు ‘ఒక కంటికి వెన్న, ఒక కంటికి సున్నం’ అన్నట్లుగా ఉంది. ప్రయాణికుడు కేవలం ఒక కిలో అదనపు సామాను తెచ్చినా రూపాయి వదలకుండా వసూలు చేసే సంస్థలు, గంటల తరబడి విమానాన్ని ఆలస్యం చేసినప్పుడు అదే స్థాయిలో బాధ్యత వహించడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సోషల్ మీడియా వేదికగా లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు ప్రతి సామాన్య ప్రయాణీణిడి మనోగతాన్ని ప్రతిబింబిస్తోంది.
సమయానికి పరిహారం ఏది?
రాఘవ్ చద్దా తన పోస్ట్‌లో విమానయాన సంస్థల తీరును ఎండగట్టారు. సదరు సంస్థలు సామాను బరువును గ్రాములతో సహా కొలిచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ, ప్రయాణికుల ‘సమయాన్ని’ మాత్రం అలా కొలవలేకపోవడం విచారకరం. విమానం గంటల తరబడి ఆలస్యమైనప్పుడు ప్రయాణికులకు కలిగే నష్టం, మానసిక ఒత్తిడికి విమాన సంస్థలు ఇచ్చే పరిహారం నామమాత్రంగానే ఉంటోంది. కొన్నిసార్లు అసలు పరిహారమే ఉండడం లేదు. విమానం ఆలస్యం అవ్వడం వల్ల ప్రయాణీకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమైన మీటింగ్‌లు తప్పిపోవడం, కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవ్వడం వల్ల ప్రయాణీకులు భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. అంత్యక్రియలు, పెళ్లిళ్లు లేదా అత్యవసర వైద్య చికిత్సల కోసం వెళ్లే వారికి విమాన ఆలస్యం ప్రాణసంకటంగా మారుతోంది. గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లో వేచి ఉండడం వల్ల వృద్ధులు, పిల్లలు అలసటకు గురవుతున్నారు.
చర్చకు దారి తీస్తున్న రాఘవ్ చద్దా ప్రశ్న
పౌర విమానయాన మంత్రిని రాఘవ్ చద్దా అడిగిన ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. దేశంలో ప్రయాణికుల హక్కుల కోసం సరైన ‘పరిహార వ్యవస్థ’ ఉందా? అని ఆయన ప్రశ్నించారు. విమాన సంస్థలు తమ సమయపాలన విషయంలో విఫలమైనప్పుడు ప్రయాణికులకు ఆటోమేటిక్‌గా రీఫండ్ లేదా పరిహారం అందేలా కఠినమైన చట్టాలు రావాలి. అప్పుడే సంస్థల్లో జవాబుదారీతనం పెరుగుతుంది.
నిష్పాక్షికత రెండు వైపులా ఉండాలి!
ఒక వ్యవస్థలో క్రమశిక్షణ అనేది అందరికీ సమానంగా ఉండాలి. ప్రయాణికులు నిమిషం ఆలస్యంగా వస్తే బోర్డింగ్ నిరాకరించే సంస్థలు, విమానం గంటలు ఆలస్యమైనప్పుడు మాత్రం సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకుంటున్నాయి. ప్రయాణికుల నుంచి మీరు డిమాండ్ చేసే అదే క్రమశిక్షణను, విమాన సంస్థలు కూడా పాటించాలి. సామాను బరువును కొలిచే త్రాసుతోనే ప్రయాణికుల సమయాన్ని కూడా కొలిస్తే బాగుంటుంది.
విమాన ప్రయాణం అనేది ఒక విలాసం నుంచి అవసరంగా మారింది. రాఘవ్ చద్దా లేవనెత్తిన ఈ అంశం విమానయాన రంగంలో అవసరమైన సంస్కరణలకు నాంది పలకాలి. విమాన సంస్థలు లాభాల వేటలో ప్రయాణికుల సౌకర్యాన్ని, సమయాన్ని మర్చిపోవద్దు. ప్రభుత్వం స్పందించి ప్రయాణికుల హక్కులను కాపాడేలా బలమైన నిబంధనలు రూపొందించాలని ఆశిద్దాం.
