గాడిద పాల పనీర్ కొనాలంటే బ్యాంకులు లూటీ చేయాల్సిందేనేమో ?
సాధారణ ఆవు, గేదె పాల పనీరే ఎక్కువ అనుకునేవాళ్లకు గాడిద పాల పనీర్ ధర తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.
By: Tupaki Desk | 9 April 2025 4:00 PM ISTపనీర్ అంటేనే కొందరికి భలే ఇష్టం. కానీ దాని ధర వింటే 'అబ్బాబోయ్ బంగారం షాపులో దొరుకుతుందేమో' అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే పనీర్ సంగతి వింటే మాత్రం నిజంగానే షాక్ అవుతారు. అదే గాడిద పాలతో చేసిన పనీర్! అవును, ఎవరూ పట్టించుకోని గాడిద పాలు ఇంత విలువైనవా, పోషకాలు ఉంటాయా అని ఆశ్చర్యపోతారు. సాధారణ ఆవు, గేదె పాల పనీరే ఎక్కువ అనుకునేవాళ్లకు గాడిద పాల పనీర్ ధర తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.
గాడిద పాల పనీర్ అంత ఖరీదెందుకు?
మన దగ్గర కిలో 300-400 రూపాయలకు దొరికే పనీరే సామాన్యుడి ప్లేట్‌లో అప్పుడప్పుడూ కనిపిస్తుంది. కానీ గాడిద పాలతో చేసిన పనీర్ ధర అక్షరాలా లక్ష రూపాయలు కిలో! గాడిద పాలు అంటే డంకీ మిల్క్‌ను ప్రపంచవ్యాప్తంగా లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, కాల్షియం ఇంకా ముఖ్యంగా లైసోజైమ్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గాడిద పాల స్పెషాలిటీ ఇదే
అంతేకాదు, గాడిద పాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయట. ఇవి రోగాలతో పోరాడటానికి శక్తినిస్తాయి. రోమ్ రాణి క్లియోపాత్రా తన మెరిసే చర్మం కోసం ఈ పాలతోనే స్నానం చేసేదని కూడా చెబుతారు. గాడిద పాలు అంత ఖరీదు కావడానికి కారణం, ఒక గాడిద రోజుకు కేవలం 200 నుండి 300 మిల్లీలీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఒక లీటర్ పాలు కోసం చాలా గాడిదలు కావాలి. దీన్ని పనీర్‌గా మార్చడానికి ప్రాసెసింగ్ ఖర్చు కూడా చాలా ఎక్కువ. అంటే 25లీటర్ల గాడిద పాలు తీస్తే కేవలం ఒక కిలో పనీర్ మాత్రమే తయారవుతుంది!
గాడిద లీటర్ పాల ధర వింటే మైండ్ బ్లాంక్!
గాడిద ఒక లీటర్ పాల ధర అక్షరాలా 5000 రూపాయల వరకు ఉంటుంది. దీని పాలల్లో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరికీ కడుపు సంబంధిత సమస్యలు రావు. ఆవు, గేదె పాల కంటే ఇందులో ఎక్కువ ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అందుకే దీన్ని చాలా బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఉపయోగిస్తారు. భారతదేశంలో చాలా స్టార్టప్‌లు గాడిద పాలపై పనిచేస్తున్నాయి. గుజరాత్, తమిళనాడులో వీటి ఫార్మింగ్ కూడా జరుగుతోంది.
