Begin typing your search above and press return to search.

మరోసారి పరువు పోగొట్టుకున్న ట్రంప్‌!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు

By:  Tupaki Desk   |   11 March 2024 2:51 PM GMT
మరోసారి పరువు పోగొట్టుకున్న ట్రంప్‌!
X

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడానికి అవసరమైన ప్రైమరీ ఎన్నికల్లో ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

గత అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందాలని ఆశించిన డోనాల్డ్‌ ట్రంప్‌ కు అనూహ్య ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ చేతిలో గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి పాలయ్యారు. కాగా గతంలో పలు వివాదాలు, లైంగిక వేధింపులు, అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ట్రంప్‌ కు నాలుగు కేసుల్లో జైలుశిక్షలు పడ్డాయి. వాటిపైన ఆయన అమెరికా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అయితే చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టు డోనాల్డ్‌ ట్రంప్‌ తన వంకర బుద్ధిని మానుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం వేదిక అయ్యింది.

ఆస్కార్‌ అవార్డుల వేదికపై డొనాల్డ్‌ ట్రంప్‌ నవ్వుల పాలయ్యారు. ఈ వేడుకల వ్యాఖ్యాతను ఉద్దేశించి ఆయన సోషల్‌ మీడియా మాధ్యమం.. ట్రూత్‌ లో ఎగతాళిగా పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పోస్టు చేసిన గంటలోనే ఇందుకు గట్టిగా కౌంటర్‌ పడింది.

ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంపై ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక ‘ట్రూత్‌’ లో ఒక సుదీర్ఘ పోస్టును పోస్టు చేశారు. ఈ పోస్టులో ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం వ్యాఖ్యాత జిమ్మీపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్‌ తనను కించపరుస్తూ పోస్టు పెట్టిన విషయం అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు జరుగుతుండగానే జిమ్మీ దృష్టికి వచ్చింది.

ఈ నేపథ్యంలో జిమ్మీ.. ట్రంప్‌ పరువు తీసేశాడు. ఉత్తమ సినిమా అవార్డు ప్రకటించే సమయంలో జిమ్మీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పుడే తన పనితీరుపై ఒక వ్యక్తి రివ్యూ పెట్టాడని వెల్లడించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ పేరు చెప్పకుండా ఆయన తనపై పెట్టిన సోషల్‌ మీడియా పోస్టును జిమ్మీ చదివారు.

‘‘ఆస్కార్‌ వేడుకల్లో జిమ్మీని మించిన చెత్త హోస్ట్‌ మరెవరూ లేరు. సాధారణ స్థాయి కంటే అధమ స్థాయి వ్యక్తి తనకు సాధ్యంకాని దాన్ని ప్రయత్నిస్తున్నట్లు ఉంది. ముందు అతడిని తొలగించి ఎవరైన చౌకబారు వ్యక్తిని హోస్టుగా ఎంచుకోండి. అతడు కూడా వేదికను బలంగా చేయగలడు... బ్లా..బ్లా..బ్లా.. అని’’ పోస్టు పెట్టారని జిమ్మీ వెల్లడించాడు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ పోస్టుకు కౌంటర్‌ ఇస్తూ కిమ్మెల్‌ స్పందించాడు. మీరు ఆ పోస్టును ఏ మాజీ అధ్యక్షుడు సోషల్‌ మీడియా ట్రూత్‌ లో రాసి ఉంటారో ఊహించగలరని అతిథులతో అన్నాడు. ఆ తర్వాత ‘‘మీ జైలు గడువు ఇంకా ముగియలేదా..?’’ అని ట్రంప్‌ ను వెటకారంగా ప్రశ్నించాడు. ఈ మాటకు అవార్డుల ప్రదానోత్సవంలో ఉన్నవారంతా పెద్ద పెట్టున నవ్వారు. దీంతో ట్రంప్‌ పరువు పోగొట్టుకున్నారు.