స్నేహితుడు కాస్తా శత్రువు అయిన వేళ.. ఏం జరుగుతోంది?
ఇలాంటి వేళ.. రాజకీయంగా తిరుగులేని అధికారం ఉన్న ట్రంప్.. ప్రపంచ కుబేరుడైన మస్క్ ను ఏం చేస్తారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 7 Jun 2025 1:00 PM ISTస్నేహం ఎప్పుడూ బాగుంటుంది. కాకుంటే స్నేహితుడుగా ఉన్నోడు శత్రువుగా మారితేనే కష్టం. ఎందుకంటే.. స్నేహితుడి లోపాల మీద మిత్రుడికి మించి బాగా తెలిసినోడు ఎవరుంటారు? ఈ లెక్కన చూసినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య ఉన్న మిత్రత్వం కాస్తా ఇప్పుడు శత్రుత్వం నెలకొనటం తెలిసిందే. ఇలాంటి వేళ.. రాజకీయంగా తిరుగులేని అధికారం ఉన్న ట్రంప్.. ప్రపంచ కుబేరుడైన మస్క్ ను ఏం చేస్తారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. ట్రంప్ మాదిరే మస్క్ సైతం మొండోడు. దేనికైనా వెనుకాడని వ్యక్తి. వినూత్నంగా వ్యవహరించటం.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నది ఊహించలేనిది. అన్నింటికి మించి ట్రంప్ మాదిరి తెంపరితనం కూడా ఎక్కువ. ట్రంప్ మాదిరే మస్క్ సైతం తాను అనుకున్నది అనుకున్నంతనే సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో పెట్టేస్తారు. వెనుకా ముందు చూసుకుంటూ..ఆచితూచి అన్నట్లు గేమ్ ఆడటం మస్క్ కు అస్సలు లేని అలవాటు.
అదే సమయంలో తనతో లొల్లి పెట్టుకున్నోళ్లు ఎవరైనా సరే.. వెంటాడి వేటాడి మరీ వేధిస్తుంటారు. అందులోనూ తిరుగులేని అధ్యక్ష పగ్గాలు చేతిలో ఉన్న వేళ.. తనతో విభేదించే వారికి చుక్కలు చూపించేందుకు ట్రంప్ అస్సలు వెనుకాడరు. తన మాటను పట్టించుకోని విశ్వవిద్యాలయాలు మొదలు కొని దేశాల వరకు పరిమితులు. సుంకాల రూపంలో చుక్కలు చూపిస్తునన సంగతి తెలిసిందే.
నిన్నటి వరకు ఆప్త మిత్రుడిగా ఉండి.. అకస్మాత్తుగా శత్రువుగా మారిన మస్క్ ను ట్రంప్ తేలిగ్గా వదిలేస్తారని భావించలేం. తనకు పడని ట్రంప్ మీద మస్క్ చేసిన వ్యాఖ్యలు చిన్నవేం కావు. ఆయన ఇమేజ్ మాత్రమే కాదు.. ఆయన అధికారాన్ని సైతం ప్రశ్నించేవిగా.. సవాలు చేసేవిగా ఉన్నాయన్నది మర్చిపోకూడదు.
ట్రంప్ అబద్ధాలుకోరుగా పేర్కొనటంతో పాటు.. తాను సాయం చేయకుండే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారన్న మాటతో పాటు.. తాను కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందన్న సంకేతాన్ని పంపటం సంచలనంగా మారింది. అంతేకాదు.. ట్రంప్ పై అభిశంసనను తాను సమర్థిస్తానని చెప్పటం ద్వారా కొత్త యుద్ధానికి తెర తీశారు. ఇలాంటి వాటిని ట్రంప్ అస్సలు సహించరు. తనను ప్రశ్నించటాన్నే సహించని ఆయన.. తన ఉనికినే ప్రశ్నించటాన్ని అస్సలు ఊరుకోరన్నది మర్చిపోకూడదు.
ఈ వాదనకు బలం చేకూరేలా ట్రంప్ తన ఎదురుదాడిని షురూ చేశారు. మస్క్ కు చెందిన టెస్లాకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు.. కాంట్రాక్టులను బ్యాన్ చేయాలని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పేర్కొన్నారు. దీంతో.. వీరిద్దరి మధ్య లొల్లి భీకర రూపం దాలుస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. తాజా పరిణామాల్ని చూస్తే.. ట్రంప్ తొలి దెబ్బ మస్క్ కు చెందిన టెస్లా కార్ల కంపెనీ మీదనే పడుతుందని చెబుతున్నారు.
టెస్లాకు అమెరికా ప్రభుత్వం నుంచి రాయితీల రూపంలో భారీ సాయం అందుతోంది. దీనికి కోత పెడుతూ ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించిన బడ్జెట్ బిల్లు ప్రస్తుతం సెనేట్ ముందు ఉంది. ఇది ఆమోదం పొందితే టెస్లాకు గడ్డు కాలమే. ఇప్పటికే ట్రంప్ తో లొల్లి కారణంగా ఒక్కరోజులోనే 14 శాతం మేర షేర్ విలువకు కోత పడటం తెలిసిందే. తనకున్న విశేష అధికారాలతో టెస్లా మీద విచారణ సంస్థల్ని రంగంలోకి ట్రంప్ దింపొచ్చు.
చైనాపై అతిగా ఆధారపడే టెస్లాపై దర్యాప్తు సంస్థలు విచారణ జరపటంతో పాటు.. టెస్లా ఆటో పైలట్.. సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లపై ఇప్పటికే విచారణ జరుపుతున్న నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ ఆడ్మినిస్ట్రేషన్ విచారణ జరుపుతోంది. అదిమరింత కఠినంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. టెస్లాపై గతంలో మస్క్ చేసిన వ్యాఖ్యలపైనా దర్యాప్తు సంస్థల్ని విచారణకు దింపొచ్చు. మస్క్ సంస్థలకు ప్రభుత్వంతో చాలానే లావాదేవీలు ఉన్నాయి. ట్రంప్ పవర్ లోకి రాకముందు నాసా అతి పెద్ద కాంట్రాక్టర్లలో మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఒకటి. ఇప్పుడు ఆ సంస్థతో నాసా ఒప్పందాలు రద్దు చేసుకునే వీలుంది. అదే జరిగితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముప్పు ఉందని భావిస్తున్నారు.
అంతరిక్ష కేంద్రానికి ఆహారం.. పరికరాలు సరఫరా చేయటానికి.. వ్యోమగాములను అంతరిక్ష కేంద్రం నుంచి తీసుకురావటానికి ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ మాత్రమే నాసాకు అందుబాటులో ఉంది. ఒకవేళ ప్రభుత్వం తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే రష్యా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా.. మస్క్ కు సన్నిహితుడిగా చెప్పే జెరెడ్ ఐసెక్ మన్ ను నాసాకు అధిపతి అవుతారని భావించారు. అన్నీ బాగున్న రోజుల్లో ఆయన్ను ట్రంప్ ఓకే చేయటం.. సెనేట్ కమిటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అనూహ్యంగా శుక్రవారం అతడి నామినేషన్ ను ట్రంప్ ఉపసంహరించుకున్నారు. ఇలా రానున్న రోజుల్లో మస్క్ ను దెబ్బ తీసే చర్యలు ట్రంప్ వేగంగా చేపడితే.. అందుకు ప్రతిస్పందనగా మస్క్ ఏం చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్న.
