ఇదిగిదిగో గోల్డ్ కార్డు.. ఫస్ట్ లుక్ బయటపెట్టిన ట్రంప్..
అగ్ర రాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ‘గోల్డ్ కార్డ్’ ఆఫర్ కు సంబంధించి ఇప్పుడు గోల్డ్ కార్డు ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసింది.
By: Tupaki Desk | 4 April 2025 11:18 AM IST‘’మీ దగ్గర రూ.45 కోట్లుంటే అమెరికన్ పౌరుడు అయిపోవచ్చు’’ అంటూ అగ్ర రాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ‘గోల్డ్ కార్డ్’ ఆఫర్ కు సంబంధించి ఇప్పుడు గోల్డ్ కార్డు ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసింది. ఓవైపు ప్రపంచ దేశాలపై టారిఫ్ లు బాదుతూ వస్తున్న ట్రంప్.. సంపన్నులారా తమ దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు ఇవ్వండి అనే ఆఫర్ తో తీసుకొచ్చిందే గోల్డ్ కార్డు. ఇప్పుడు ఆ కార్డుకు సంబంధించి ఫస్ట్ లుక్ ను ట్రంప్ విడుదల చేశారు.
చూసేందుకు క్రెడిట్ కార్డులా.. మరీ ముఖ్యంగా అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డులా ఉన్న ఈ గోల్డ్ కార్డును ట్రంప్ మీడియాకు చూపించారు. గతంలో ఉన్న ఇన్వెస్టర్ వీసా ఈబీ-5ను రద్దు చేసి తీసుకొచ్చిందే గోల్డ్ కార్డు. దీని ఖరీదు రూ.43.50 కోట్లు. అమెరికన్ డాలర్లలో ఇది 50 లక్షల డాలర్లు. దీనిని కొన్నవారిని నేరుగా అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది.
సాధారణంగా అమెరికా పౌరసత్వం అంటే అత్యంత విలువైనదే కాదు.. చాలా కష్టతరమైనది కూడా. అలాంటి గోల్డ్ కార్డుతో సులువుగా వచ్చేస్తోంది. భూమ్మీద ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకే ఈ గోల్డ్ కార్డు అని.. వారంతా తమ దేశానికి వచ్చి పెట్టుబడులు పడితే ఉద్యోగాలు వస్తాయన్నది ట్రంప్ ఉద్దేశం. మొత్తమ్మీద 3.7 కోట్ల మంది దీనిని కొనగలరని అంచనా వేశారు.
గత నెలలో అమెరికా వాణిజ్యం మంత్రి లుట్నిక్ చెప్పినదాని ప్రకారం ఒక్క రోజే వెయ్యి గోల్డ్ కార్డులు అమ్ముడయ్యాయి. రూ.43.5 కోట్ల చొప్పున అప్పట్లో 5 బిలియన్ డాలర్లు వచ్చాయి.
‘ట్రంప్ కార్డు’
గోల్డ్ కార్డుపై ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ముఖచిత్రం ఉంది. అంటే.. ఇది శాశ్వతమా? లేక అధ్యక్షుడితో పాటే మారుతుందా? అన్నది చూడాలి. అంతేకాదు.. స్వయంగా అధ్యక్షుడు అయినప్పటికీ మొదటి కార్డును ట్రంప్ కొనుగోలు చేశారు. ఈ విషయం ఆయనే చెప్పారు. రెండో కార్డు కొన్నది ఎవరో పేర్కొనలేదు. గోల్డ్ కార్డులు రెండువారాల్లో అమ్ముడవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు.
అమెరికా 1990లో తీసుకొచ్చిన ఇన్వెస్టర్ వీసా ఈబీ-5పై అనేక ఆరోపణలు వచ్చాయి. మోసాలు జరుగుతున్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో ట్రంప్ దానిని రద్దు చేసేశారు. ఇపుడు చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఈ గోల్డ్ కార్డు ట్రంప్ కార్డు అయిందన్నమాట.
