యూట్యూబర్లకు బ్యాడ్ న్యూసేనా? ఇక ఆదాయం ఉండదా?
యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందుతున్న కంటెంట్ సృష్టికర్తలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా భారీ షాక్ తగలబోతోందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.
By: Tupaki Desk | 25 April 2025 11:21 AM ISTయూట్యూబ్ ద్వారా ఆదాయం పొందుతున్న కంటెంట్ సృష్టికర్తలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా భారీ షాక్ తగలబోతోందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. విదేశీయులు యూట్యూబ్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారని ట్రంప్ భావిస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయడానికి యూట్యూబ్‌పైనే నేరుగా పన్నులు విధించే కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారని, దీనివల్ల యూట్యూబర్ల ఆదాయం గణనీయంగా తగ్గుతుందని ఆ కథనాల సారాంశం. అయితే ఈ కథనాలపై వాస్తవాలను పరిశీలిస్తే కొంత స్పష్టత వస్తుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నులు, వాణిజ్యంపై తనదైన శైలిలో వ్యవహరిస్తారనేది తెలిసిందే. విదేశీ ఉత్పత్తులు, సేవలపై సుంకాలు విధించడం, అమెరికా కంపెనీల ప్రయోజనాలను కాపాడటంపై ఆయన గతంలో దృష్టి సారించారు. డిజిటల్ సేవలపై ఇతర దేశాలు పన్నులు విధించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రతీకార చర్యల గురించి కూడా పరోక్షంగా వ్యాఖ్యానించారు.
అయితే యూట్యూబ్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకుని, ప్లాట్‌ఫామ్‌పై ఛానెళ్ల ఆధారంగా పన్నులు విధించే కొత్త విధానాన్ని ట్రంప్ ప్రవేశపెట్టబోతున్నారని, దీనివల్ల యూట్యూబ్‌కు పన్నుల వెసులుబాటు పోతుందని, తద్వారా విదేశీ యూట్యూబర్ల ఆదాయం తగ్గుతుందని సమాచారం.. డొనాల్డ్ ట్రంప్ పబ్లిక్ స్పీచ్‌లలో, ముఖ్యంగా మిస్సిసిపీలో విదేశీ యూట్యూబర్ల సంపాదన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.. అలాగే, "స్పాట్‌లైట్ జర్నల్" లో ఇది పబ్లిష్ కూడా అయ్యింది.
- వాస్తవ పరిస్థితి ఏమిటి?
వాస్తవానికి, విదేశీ యూట్యూబర్లు అమెరికా వీక్షకుల నుండి పొందే ఆదాయంపై అమెరికా పన్నులు విధించడం అనేది కొత్త విధానం కాదు. 2021 మధ్య నుండి ఈ విధానం అమల్లో ఉంది. అమెరికా పన్ను చట్టాల ప్రకారం, యూట్యూబ్ మాతృ సంస్థ అయిన గూగుల్, అమెరికా వెలుపల ఉన్న కంటెంట్ సృష్టికర్తల నుండి పన్ను సమాచారాన్ని సేకరించాలి. అమెరికాలోని వీక్షకుల నుండి వచ్చే ఆదాయంపై పన్నులు నిలిపివేయాలి.
పన్ను నిలిపివేత శాతం అనేది కంటెంట్ సృష్టికర్త నివసిస్తున్న దేశానికి.. అమెరికాకు మధ్య ఉన్న పన్ను ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశం , అమెరికా మధ్య పన్ను ఒప్పందం ఉంది. దీని ప్రకారం.., భారతీయ యూట్యూబర్లు అవసరమైన పన్ను సమాచారాన్ని సమర్పిస్తే, అమెరికా వీక్షకుల నుండి వచ్చే ఆదాయంపై 15% పన్ను మాత్రమే నిలిపివేయబడుతుంది. ఒకవేళ పన్ను సమాచారం సమర్పించకపోతే, ప్రపంచవ్యాప్తంగా వచ్చే మొత్తం యూట్యూబ్ ఆదాయంపై 24% వరకు పన్ను నిలిపివేసే అవకాశం ఉంటుంది.
ఈ పన్ను విధానం ఇప్పటికే అమల్లో ఉంది. ఇది డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకువచ్చిన కొత్త విధానం కాదు. ఇది యూట్యూబ్ తన ఆదాయ పంపిణీ విధానంలో (వీక్షకుల సంఖ్య లేదా నిడివి ఆధారంగా) భారీ మార్పులు చేయడానికి ప్రత్యక్షంగా దారితీస్తుందనడానికి కూడా ఆధారాలు లేవు. యూట్యూబ్ ఆదాయం అనేది ప్రకటనలు, యూట్యూబ్ ప్రీమియం, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్లు, ఛానెల్ మెంబర్‌షిప్‌ల ద్వారా వస్తుంది. ఈ ఆదాయంలో అమెరికా వీక్షకుల నుండి వచ్చే భాగానికి మాత్రమే ఈ పన్ను వర్తిస్తుంది.
భారతీయ యూట్యూబర్లు అమెరికా వీక్షకుల నుండి వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది అనేది వాస్తవమే అయినప్పటికీ, ఇది కొత్తగా అమల్లోకి వచ్చే విధానం కాదు. అవసరమైన పన్ను సమాచారాన్ని యూట్యూబ్‌కు సమర్పించడం ద్వారా వర్తించే పన్ను నిలిపివేత శాతాన్ని తగ్గించుకోవచ్చు.
