టారిఫ్ లతో బయటి పోరు చాలక.. ట్రంప్ కొత్తగా 'ఇంటెల్' పోరు
టాన్.. ఈ పేరు వింటేనే చైనీయుడని తెలుస్తోంది. ఇప్పుడు ఆయనకు చైనాతో ఆర్థిక లింకులు అంటగడుతూ సెనేటర్ టామ్ కాటన్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 8 Aug 2025 11:00 PM ISTఇప్పటికే ఎడాపెడా టారిఫ్ లతో బయటి పోరు చాలక.. ఇంటి పోరును పెట్టుకుంటున్నారు.. ఆయనకు బహుశా తెలియదేమో...? తెలుగులో ఓ ప్రముఖ సామెత ఉందని...! ఇంటి పోరు ఇంతింత కాదయా అని...! ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనికుంటా...?
డొనాల్డ్ టారిఫ్..
డొనాల్డ్ ట్రంప్.. ఆయన పేరు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో టారిఫ్ ట్రంప్ అని పిలవాలేమో..? ఎందుకంటే గత కొన్ని రోజులుగా భారత్ పై పదపదే టారిఫ్ లతో విరుచుకుపడుతున్నారు ట్రంప్. ఇప్పటికే అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో ట్రంప్ నకు చెడింది. ఇక ఇప్పుడు ఇంటెల్ సీఈవో లిప్ బు టాన్ మీద పడ్డారు. జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ ఆయనను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ట్రంప్ అంటే.. అంతే...!
ట్రంప్ అంటే.. ఎప్పుడు ఎవరిమీద పడతారో చెప్పలేం.. అలాగే ఇంటెల్ సీఈవో మీద పడ్డారు. ఆయన తీవ్ర గందరగోళంలో ఉన్నారంటూ రాజీనామా చేయడమే దీనికి పరిష్కారమని వ్యాఖ్యానించారు. సెనేటర్ టామ్ కాటన్, ఇంటెల్ చైర్మన్ ఫ్రాంక్ ఇయరీకి లేఖ రాశాక ట్రంప్ ఇలా స్పందించారు.
చైనా లింకులే కారణమా..?
టాన్.. ఈ పేరు వింటేనే చైనీయుడని తెలుస్తోంది. ఇప్పుడు ఆయనకు చైనాతో ఆర్థిక లింకులు అంటగడుతూ సెనేటర్ టామ్ కాటన్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టాన్ కు డజన్ల కొద్దీ చైనా కంపెనీలను అదుపులో పెట్టుకున్నారని.. వందల చైనీస్ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్-చిప్ కంపెనీలల్లో వాటాలున్నాయని పేర్కొంటున్నారు. అన్నిటికీ మించి అమెరికా ప్రధాన శత్రువుగా చూసే చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో టాన్ కు సంబంధాలు ఉన్నాయనేది ప్రధాన ఆరోపణగా నిలుస్తోంది.
-కాడెన్స్ డిజైన్స్ సిస్టమ్... ఈ సంస్థ చైనా మిలటరీకి చెందిన చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ కు ఉత్పత్తులను టెక్నాలజీని విక్రయించింది. ఇందులో టాన్ పాత్ర ఉందని కాటన్ ఆరోపిస్తున్నారు. ట్రంప్ టారిఫ్ ల కొరడగా ఝళిపిస్తుండగా.. జూలై నెలలో ఇది జరిగింది. తద్వారా ఎగుమతి నియంత్రణను ఉల్లంఘించారనేది టాన్ పై అభియోగం.
కాగా, తన రాజీనామాను ఇంటెల్ సీఈవో తోసిపుచ్చారు. స్టాక్ మార్కెట్ లో గురువారం ప్రి మార్కెట్ ట్రేడింగ్ లో ఇంటెల్ స్టాక్ 5 శాతం పడిపోయినా.. కంపెనీ బోర్డు సభ్యుల మద్దతు ఉందని టాన్ ప్రస్తావించారు. తనపై దుష్ప్రచారం జరుగుతోందని వైట్ హౌస్ ను ఆశ్రయించారు.
-మొత్తం వివాదంపై ఇంటెల్ స్పందిస్తూ.. తమ సంస్థ, టాన్ అమెరికా జాతీయ భద్రతకు కట్టుబడి ఉంటారని ప్రకటన ఇచ్చింది. చట్ట సభ సభ్యులు (సెనేటర్) ఆందోళనను పరిష్కారానికి సహకరిస్తారని తెలిపింది. ఇప్పటికి టాన్ వైదొలడం అనేది లేకున్నా.. రాజకీయ ఒత్తిడి, పెట్టుబడిదారుల్లో భయాలు పెరుగుతున్నాయి. ఇది ఇంకా చర్చనీయం కావడం ఖాయం.
