Begin typing your search above and press return to search.

అమెరికా మాంద్యం ముప్పు.. ట్రంప్ టారిఫ్ దెబ్బ పడనుందా?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఊహాతీతంగా ఉంటాయి.

By:  Tupaki Desk   |   3 April 2025 2:08 PM IST
Jay Hatfield React Trump Tariffs
X

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఊహాతీతంగా ఉంటాయి. అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన అనుసరిస్తున్న విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులను, పెట్టుబడిదారులను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఆయన తరచూ ప్రకటిస్తున్న సుంకాలు (టారిఫ్‌లు) అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిత్రులు, శత్రువులనే తేడా లేకుండా అందరిపై ఆంక్షలు విధిస్తూ, వెనక్కి తగ్గుతూ ట్రంప్ తీసుకుంటున్న రోజుకో కొత్త నిర్ణయం సంచలనం కలిగిస్తోంది.

ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కార్పొరేట్ ఆదాయాలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా టారిఫ్‌లు ప్రకటించి ట్రంప్ మరోసారి సంచలనం సృష్టించారు. ఈ నిర్ణయంతో వినియోగదారుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికాతో పాటు ప్రపంచంలోని ప్రధాన మార్కెట్లన్నీ నష్టాలను చవిచూస్తున్నాయి.

"అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం" అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ నుంచి వృద్ధికి ఊతమిచ్చే విధానాలు వస్తాయని పెట్టుబడిదారులు ఆశించారు. కానీ, ఆయన టారిఫ్ హెచ్చరికలతో తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ప్రకటించిన టారిఫ్‌లతో మార్కెట్లు మరింత దిగాలుపడ్డాయి. "ఈ ప్రకటన మార్కెట్లకు అత్యంత దారుణమైన పరిస్థితి. ఇది అమెరికాను మాంద్యంలోకి నెట్టేసే అవకాశం ఉంది. అందుకే ఫ్యూచర్స్ చాలా బలహీనంగా ఉన్నాయి" అని క్యాపిటల్ మార్కెట్ కంపెనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ క్యాపిటల్ అడ్వైజర్స్ సీఈఓ జేహాట్‌ఫీల్డ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రీన్‌వుడ్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌ వాల్టర్ టాడ్ మాట్లాడుతూ, "మనం ఈ కథలో ఒక వైపు మాత్రమే చూస్తున్నాం. మనం చేస్తున్న చర్యలకు ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయనేది చాలా ముఖ్యం. అయితే, మొత్తంగా మార్కెట్ ఈ పరిస్థితులను ఎలా తీసుకుంటుందో చూడాలి" అని అభిప్రాయపడ్డారు. ఇంటరాక్టివ్ బ్రోకర్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ సోస్‌నిక్ మరింత తీవ్రంగా స్పందించారు. "ప్రస్తుతం మేం అత్యంత బలహీనమైన స్థానంలో ఉన్నాం. ఈ పరిస్థితులు సడెన్ రికవరీ లేదా పూర్తిగా పతనానికి దారితీయవచ్చు" అని ఆయన హెచ్చరించారు.

ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు మొదలుపెట్టినప్పటి నుంచి అమెరికాకే నష్టం జరుగుతుందని అనేక అంచనాలు వెలువడ్డాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులు విధించడం వల్ల వాటి ధరలు పెరుగుతాయని, తద్వారా అమెరికా పౌరులకే నష్టం వాటిల్లుతుందని భయాలు నెలకొన్నాయి. అయితే, ఇటీవల ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న వాదనను ట్రంప్ కొట్టిపారేశారు. కానీ, ఆర్థిక మాంద్యం వస్తుందన్న అంచనాలను మాత్రం ఆయన ఖండించలేదు. అంతిమంగా అమెరికాకే మేలు జరుగుతుందని ఆయన సమర్థించుకున్నారు.

ట్రంప్ టారిఫ్‌లపై స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా ఆయన ఎవరి మాట వినడం లేదు. చైనా, వియత్నాం, మెక్సికో, తైవాన్, జపాన్, కెనడా, దక్షిణ కొరియా, ఇండియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలతో కూడా అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉంది. ఈ లోటును తగ్గించుకోవడానికి దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించడం ద్వారా వేల కోట్ల డాలర్ల అదనపు ఆదాయం పొందాలని ట్రంప్ భావిస్తున్నారు. తన ఎన్నికల వాగ్దానమైన పన్నుల కోతలను అమలు చేయడానికి ఈ నిధులను ఉపయోగించాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి, ట్రంప్ తీసుకుంటున్న ఈ సంచలన నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి. ప్రస్తుత పరిస్థితులు మాత్రం అమెరికాలో ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి.