ట్రంప్ కి ఆ నోబెల్ ఏదో ఇచ్చేయండి.. వినలేకపోతున్నాం..!
అవును... ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ అభిమానులు అడుగుతున్న ప్రశ్నలు ఇవే! ట్రంప్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 Jun 2025 2:00 PM ISTపిల్లాడు స్కూళ్లో సరిగా చదవకపోయినా, క్రమశిక్షణగా లేకపోయినా బెత్తంతో ఓ దెబ్బ వేస్తారు మాస్టారు. అంత మాత్రాన్న ఆ మాస్టారు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకి అర్హులు కాదా? ఆయన బెస్ట్ టీచర్ అవ్వలేరా? ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఈ సూత్రాన్ని అప్లై చేస్తే ఎలా ఉంటుంది? వెంటనే... పాక్ ప్రతిపాదన ప్రమేయం లేకుండా, సెలక్షన్ కమిటీ సుమోటోగా ప్రతిపాదించి ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చెయ్యాలి!
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. అణు ఒప్పందం జరగాలని ట్రంప్ ఇరాన్ కు సూచించారు. చర్చలు జరుగుతున్నాయి. అప్పటికే ఐదు విడతల్లో చర్చలు జరిగి, ఆరో విడత చర్చలకు డేటు, ప్లేసూ కూడా ఫిక్సయ్యింది. కానీ... ట్రంప్ లో 'శాంతి' తో కూడిన సహనం సన్నగిల్లింది. రక్షణ శాఖ, జాతీయ భద్రతా సలహాదారులతో మీటింగ్ పెట్టారు. 'శాంతి' పరిరక్షణలో భాగంగా ఇరాన్ పై దాడి చేయాలని సూచించారు.
అనుకున్నట్లుగానే సుమారు 120 వరకూ విమానాలు, ఏడు బీ-2 స్పిరిట్ లతో 14 బంకర్ బస్టర్ బాంబులు, 30 తోమహాక్ క్షిపణులతో జస్ట్ 25 నిమిషాల్లో ఉన్నంతలో సింపుల్ గా ఇరాన్ పై దాడి చేశారు, ప్రపంచానికి పెను విపత్తుగా పరిణమించే అవకాశం ఉన్న అణు కేంద్రాలను ధ్వంసం చేశారు. వెంటనే చప్పుడు కాకుండా అమెరికా వాయుసేన తిరిగి ఇంటికి వచ్చేసింది. ఇందులో ట్రంప్ చేసిన తప్పేముంది?
అవును... ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ అభిమానులు అడుగుతున్న ప్రశ్నలు ఇవే! ట్రంప్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాకానిపక్షంలో మరికొన్ని యుద్ధాలకు పచ్చజెండా ఊపి.. ఆ తర్వాత ఆయనే ఎర్ర జెండా ఊపి, ప్రపంచంలో శాంతిని విస్తరింపచేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రపంచం అందుకు సిద్ధమా అని అడుగుతున్నారు!
ఈ విషయాలపై ఇటీవల స్పందించిన ట్రంప్.. వైరాగ్యంతో కూడిన మాటలు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కాంగో - రువాండా మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని ఏర్పాటుచేశానని.. అందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని ఇటీవల ప్రకటించిన ట్రంప్.. ఇది హింసాత్మక రక్తపాతానికి, పౌరుల మరణాలకు దారితీసిన ఇతర యుద్ధాల కన్నా పెద్దదని తెలిపారు.
ఈ సందర్భంగా ఇది ఆఫ్రికాకు, ప్రపంచం మొత్తానికి గొప్ప రోజుగా అభివర్ణించారు. అయితే, తాను ఇలాంటివి ఎన్ని చేసినా నోబెల్ బహుమతి లభించదని అన్న్నారు. భారత్ - పాక్ మధ్య లేదా సెర్బియా - కొసావో మధ్య యుద్ధాలను ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదని అసహనం వ్యక్తంచేశారు. ఇప్పుడు ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కూడా తనదైన శైలిలో ఆపారు!
ఇలా ఎన్ని యుద్ధాలు ఆపినా, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో శాంతిని విస్తరింపచేస్తున్నా, సుంకాలతో అన్ని దేశాలనూ సమానంగా చూస్తున్నా, తమ దేశంలో ఉన్న విదేశీ విద్యార్థుల విషయంలో పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నా... ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ కు ఐ లవ్ యూ చెప్పేటంత గొప్ప మనసు ఉన్న ట్రంప్ ని ప్రపంచం అర్ధం చేసుకోవడం లేదని చెబుతోన్న అభిమానులు... కనీసం నోబెల్ సెలక్షన్ కమిటీ అయినా ట్రంప్ చేస్తున్న శాంతి కార్యక్రమాలను గుర్తించాలని కోరుతున్నారు.
