ట్రంప్ కు అరుదైన వ్యాధి.. వైట్ హౌస్ ప్రకటన
ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో వాపు రావడంతో వైద్యులు ఆయన్ను పరీక్షించారు. దీంతో ఆయనకు సాధారణ సిరల లోపం ఉన్నట్లు తేలింది.
By: Tupaki Desk | 18 July 2025 11:26 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాళ్లలో సిరల సంబంధిత వ్యాధి ఉన్నట్లు వైట్‌హౌస్ అధికారికంగా వెల్లడించింది. ట్రంప్‌కు దీర్ఘకాల సిరల లోపం, అంటే వీనస్ ఇన్‌సఫీషియెన్సీ ఉన్నట్లు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ అయినట్లు ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. ఇది ప్రమాదకరమైన వ్యాధి కాదని, అధిక వయస్సు వారిలో చాలా సాధారణంగా కనిపించే సమస్య మాత్రమేనని ఆమె వివరించారు.
- కాళ్ల చీలమండ వద్ద వాపు కారణంగా పరీక్షలు
ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో వాపు రావడంతో వైద్యులు ఆయన్ను పరీక్షించారు. దీంతో ఆయనకు సాధారణ సిరల లోపం ఉన్నట్లు తేలింది. ఇది డీప్ వీన్ థ్రోంబోసిస్ లేదా ఆర్టీరియల్ వ్యాధి వంటి తీవ్రమైన పరిస్థితి కాదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అలాగే గుండె, కిడ్నీ లాంటి కీలక అవయవాల్లో ఎలాంటి వైఫల్యాలు లేనట్లు పేర్కొన్నారు.
-ఫోటోల్లో కనిపించిన గాయం
ట్రంప్ చేతి వెనక భాగంలో గాయంలాంటి దృశ్యం ఫోటోల్లో కనిపించడం సోషల్‌మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై లీవిట్ స్పందిస్తూ “అది కేవలం తరచూ కరచాలనం చేయడం వల్ల లేదా ఆస్పిరిన్ వాడకంతో ఏర్పడే సాధారణ చర్మ సమస్య” అని వివరించారు.
-ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి
ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి అసౌకర్యం లేనట్లు వైద్యులు నిర్ధారించారని వైట్‌హౌస్ తెలిపింది. ఆయన ఆరోగ్యంపై పారదర్శకత ఉంచాలన్న ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నామని పేర్కొన్నారు. చికిత్స వివరాలు మాత్రం వెల్లడించనప్పటికీ, అధ్యక్షుడి వైద్య బృందం ఈ సమస్యపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు.
-సిరల లోపం అంటే ఏమిటి?
శరీరంలోని సిరలు రక్తాన్ని గుండెవైపు తరలించే బాధ్యత వహిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సిరల లోపాల వల్ల ముఖ్యంగా కాళ్లలో ఉండే లోతైన సిరలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తం వెనక్కి ప్రవహించి అక్కడే పేరుకుపోతుంది. దీన్ని వీనస్ ఇన్‌సఫిషియెన్సీ అంటారు. ఎక్కువసేపు నిలబడడం లేదా కూర్చోవడం వల్ల.. వయస్సు పెరగడం..అధిక బరువు.. శారీరక శ్రమ లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యను అధికంగా వ్యాయామం చేయడం, పాదాలను ఎత్తిపెట్టి విశ్రాంతినివ్వడం వంటి పద్ధతులతో నియంత్రించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమై శస్త్రచికిత్స అవసరమవుతుంది.
ట్రంప్‌కు ఉన్న సిరల సమస్య పెద్దగా ఆందోళన కలిగించే అంశం కాదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఆయన్ను పర్యవేక్షిస్తున్న వైద్య బృందం సమర్థంగా చికిత్సను నిర్వహిస్తున్నదని తెలిపింది. ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి పుకార్లు వ్యాపించకుండా ఉండేందుకు ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు.
