'హార్వర్డ్ పై పగ'... కీలక విషయం చెప్పిన ట్రంప్ జీవిత చరిత్ర రచయిత!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 May 2025 9:50 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని చాలా మంది హార్వర్డ్స్ పై ట్రంప్ యుద్ధం గా అభివర్ణిస్తున్నారు. అయితే.. ట్రంప్ కు హార్వర్డ్స్ పై ఎందుకు ఇంత కోపం, ఎందుకిత పగ అనే ప్రశ్నలకు.. ఆయన కుమారుడు బారన్ ట్రంప్ కారణం అని ప్రచారం జరగ్గా.. కాదు, ట్రంపే కారణం అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ యుద్ధాన్ని తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే! దీనికి కారణం ఆయన కుమారుడు బారన్ ట్రంప్ నుంచి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ.. డొనాల్డ్ ట్రంప్ జీవిత చరిత్ర రచయిత మైఖేల్ వోల్ఫ్ మాత్రం మరో విషయాన్ని సూచించారు. అతని ప్రకారం... హార్వర్డ్ తిరస్కరించింది బారన్ ను కాదు.. డొనాల్డ్ ట్రంప్ నే! దీంతో.. ఈ విషయం వైరల్ గా మారింది.
‘ది డైలీ బీస్ట్’ తో పాడ్ కాస్ట్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవిత చరిత్ర రచయిత వోల్ఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా... ట్రంప్ తో సంబంధం ఉన్న చాలా మంది హార్వర్డ్స్ లో చదువుకున్నారని హోస్ట్ జోవన్నా కోల్స్ అడగ్గా... కానీ, ట్రంప్ హార్వర్డ్స్ లోకి రాలేదు.. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ దానిపై ద్వేషాన్ని కలిగి ఉంటారు అని వోల్ఫ్ అన్నారు!
వెంటనే ఈ విషయంపై వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ స్పందించారు. ఇందులో భాగంగా... వారిద్దరూ (జోవన్నా & వోల్ఫ్) క్లిక్ బైట్ కోసం నకిలీ వార్తలను ప్రచారం చేస్తూ, అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా.. చరిత్రలో అత్యంత పరివర్తన చెందిన అధ్యక్షుడిగా ఎదగడానికి డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ వంటి అవినీతి సంస్థకు దరఖాస్తు చేసుకొవాల్సిన అవసరం లేదని అన్నారు.
కాగా... డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ మిలటరీ అకాడమీలో నాలుగు సంవత్సరాలు చదివిన తర్వాత 1964లో ఫోర్డ్ హోమ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. రెండూ సంవత్సరాల తర్వాత అతను పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కామర్స్ కు బదిలీ అయ్యారు. అక్కడ ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పోందారు.
ఈ క్రమంలో... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకున్నారా లేదా అనే దానిపై అధికారిక డేటా అందుబాటులో లేదు. ఇదే సమయంలో.. ఆయన హార్వర్డ్ కు రిజెక్ట్ చేయబడినట్లు ఎక్కడా రికార్డ్స్ లేవు! అయితే... ట్రంప్ జీవిత చరిత్ర రచయిత మాత్రం ఇలా హార్వర్డ్ తిరస్కరించింది బారన్ ను కాదు.. ట్రంప్ నే అనడం మాత్రం సంచలనంగా మారింది!
