ఫిఫా ఫైనల్లో ట్రంప్ 'స్పెషల్ ఎంట్రీ'.. ఆట స్పెయిన్‌ది.. హైలైట్ ప్రెసిడెంట్‌ది.. పరువుపాయే..
ఫిఫా వరల్డ్ కప్-2026 ఫైనల్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి? మైదానంలో ఆటగాళ్ల నైపుణ్యం.. గాల్లోకి లేచే ఫుట్‌బాల్.. గోల్ పోస్ట్ దగ్గర ఉత్కంఠ.. ఇవే కదా గుర్తొచ్చేవి? కానీ ఈసారి వీటన్నింటినీ పక్కకు నెట్టేసి మరీ ఒకే ఒక్కడు వార్తల్లో నిలిచాడు.
By: A.N.Kumar | 20 July 2026 12:24 PM ISTఫిఫా వరల్డ్ కప్-2026 ఫైనల్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి? మైదానంలో ఆటగాళ్ల నైపుణ్యం.. గాల్లోకి లేచే ఫుట్‌బాల్.. గోల్ పోస్ట్ దగ్గర ఉత్కంఠ.. ఇవే కదా గుర్తొచ్చేవి? కానీ ఈసారి వీటన్నింటినీ పక్కకు నెట్టేసి మరీ ఒకే ఒక్కడు వార్తల్లో నిలిచాడు. ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. స్పెయిన్, అర్జెంటీనా మధ్య జరిగిన ఈ మహా సంగ్రామంలో స్పెయిన్ చివరి నిమిషంలో గోల్ కొట్టి ట్రోఫీని ముద్దాడితే.. స్టేడియంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం సోషల్ మీడియాలో 'ట్రెండింగ్ ట్రోఫీ'ని గెలుచుకున్నారు.
'వెల్‌కమ్' అంటే ఇలాగేనా మరి?
మ్యాచ్ ప్రారంభానికి ముందు అధ్యక్షుల వారు భారీ భద్రత మధ్య.. ఎంతో హుందాగా స్టేడియంలోకి అడుగుపెట్టారు. సాధారణంగా ఇలాంటి పెద్ద లీడర్లు వస్తే చప్పట్లు, కేరింతలు కామన్‌గా వినిపిస్తాయి. కానీ అక్కడ ఉన్నది ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కదా.. ట్రంప్ రాకను గమనించిన వేలాది మంది ప్రేక్షకులు ఒక్కసారిగా ‘బూయింగ్’ (కూతలు పెట్టడం) చేయడంతో స్టేడియం దద్దరిల్లేలా అసంతృప్తిని వెళ్లగక్కారు.
పాపం.. ట్రంప్ తనదైన స్టైల్లో అభివాదం చేద్దామనుకునే లోపే.. ఫ్యాన్స్ తమ 'రాజకీయ అభిప్రాయాన్ని' ఫుట్‌బాల్ శైలిలోనే గట్టిగా చెప్పేశారు. ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలోకి ఎక్కడంతో నెటిజన్లు "పాపం ట్రంప్, హోమ్ గ్రౌండ్‌లోనే ఇలాంటి పరాభవమా!" అంటూ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు.
ట్రోఫీ మాది.. వేదిక ట్రంప్ ది
నిజానికి అసలు సిసలైన డ్రామా మ్యాచ్ ముగిసిన తర్వాతే మొదలైంది. స్పెయిన్ జట్టు విజేతగా నిలిచాక.. ట్రోఫీ ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. అందులో మన ప్రెసిడెంట్ గారు కూడా పాలుపంచుకున్నారు. సాధారణంగా అయితే ట్రోఫీ ఇచ్చేసి.. ఫోటోలకు ఫోజులిచ్చి అతిథులు సైలెంట్‌గా పక్కకు తప్పుకుంటారు. ఎందుకంటే అది గెలిచిన జట్టు సెలబ్రేట్ చేసుకునే సమయం.
కానీ మన ట్రంప్ గారు అలా చేస్తారా? "నేను ఎక్కడుంటే అక్కడే కెమెరాలు ఉండాలి" అన్నట్లుగా ఆయన ఆ వేదికను వదిలి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. స్పెయిన్ ఆటగాళ్లు ట్రోఫీ పట్టుకుని ఎగురుతుంటే.. ట్రంప్ మాత్రం ఆ జట్టులో తానే పదకొండో ప్లేయర్ అన్న రేంజ్‌లో అక్కడే నిలబడిపోయారు. పాపం.. స్పెయిన్ ఆటగాళ్లకు ఆనందం పంచుకోవాలో.. లేక పక్కనే ఉన్న పెద్దాయనను చూసి సైలెంట్‌గా ఉండాలో తెలియక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ట్విస్ట్ ఏంటంటే.. పరిస్థితి చేతులు దాటిపోతోందని గ్రహించిన ఫిఫా అధ్యక్షుడు మెల్లగా ట్రంప్ దగ్గరకు వెళ్లి ఆయన చేతిని పట్టుకుని "ఇక చాలు సార్, పదండి వెళ్దాం" అన్నట్లుగా పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలో ట్రంప్ 'గోల్'
ప్రస్తుతం ఈ విజువల్స్ ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరేమో "ట్రంప్‌కు క్రీడా స్ఫూర్తి లేదు.. లైమ్‌లైట్ కోసం పాకులాడారు" అని విమర్శిస్తుంటే ట్రంప్ ఫ్యాన్స్ మాత్రం "ఆయనకు ఫుట్‌బాల్ అంటే ఇష్టం.. అందుకే కాసేపు ఆటగాళ్లతో గడిపారు.. దీనికి అంత సీన్ లేదు" అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా స్పెయిన్ జట్టు కష్టపడి కప్పు గెలిస్తే ట్రంప్ మాత్రం కేవలం తన 'ప్రెజెన్స్'తో వరల్డ్ కప్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. దీనినే "ఆట వేరొకరిది.. హైలైట్ మనది" అంటారేమో...
