ఓడిస్తే ఎరుపన్నాడని గెలిపించినా ఎరుపు ఏడుపు తప్పలేదే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు చూస్తే ఇదే తీరు గుర్తుకు రాక మానదు.
By: Tupaki Desk | 8 April 2025 10:13 AM ISTకొందరి మాటలకు విలువ అన్నది ఉండదు. తాము ఏం చెబుతామో.. అందుకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించటం అలవాటు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు చూస్తే ఇదే తీరు గుర్తుకు రాక మానదు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తాను చెప్పిన మాటలకు భిన్నంగా ఆయన నిర్ణయాలు.. ఫలితాలు ఉండటం గమనార్హం. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి కమలా హారిస్ గెలుపు గురించి మాట్లాడుతూ.. ఆమె కానీ ఎన్నికల్లో గెలిస్తే.. మార్కెట్లు ఎరుపెక్కుతాయని.. 1926 నాటి మాంద్యం తిరిగి వస్తుందని వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే.
ట్రంప్ హెచ్చరికలు కావొచ్చు.. బైడెన్ అసమర్థత కావొచ్చు.. కమల మీద నమ్మకం లేకపోవటం వల్లో కానీ.. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించటం.. పాలనా పగ్గాల్ని చేజిక్కించకోవటం తెలిసిందే. ఎన్నికల ప్రచార వేళ తాను చెప్పిన మాటలకు భిన్నంగా తాజాగా మార్కెట్లు కుదేలవుతున్నాయి. అది కూడా ప్రపంచ మార్కెట్లు అన్నీ. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవటం.. సుంకాల విధింపుతో ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేసిన ట్రంప్ దెబ్బకు పరిస్థితులు సాధారణ స్థాయికి ఎప్పుడు చేరతాయో అర్థం కాని పరిస్థితి నెలకొందని మాత్రం చెప్పక తప్పదు.
అమ్మకాల హోరుతో సెన్సెక్స్ సోమవారం 5 శాతం వరకు నష్టపోయింది. సెన్సెక్స్ లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 3939 పాయింట్లుగా చెప్పాలి. అయితే.. చివర్లో కొనుగోళ్ల కారణంగా కోలుకొని 1700పాయింట్ల వద్ద ట్రేడింగ్ నిలిచింది. నిఫ్టీ సైతం 742 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యింది. ఒక అంచనా ప్రకారం దేశీయ మార్కెట్ అయిన నిఫ్టీ 21,700 దగ్గర గట్టి మద్దతు కనిపిస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే నిఫ్టీ 21,000 దిగువకు చేరుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే మరింత నష్టం వాటిల్లుతుందని చెప్పక తప్పదు.
సోమవారం చోటు చేసుకున్న మహా పతనం కారణంగా ఒక్క రోజులో రూ.14.09 లక్షల కోట్ల మార్కెట్ సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో మార్కెట్ సంపద రూ.389.25 లక్షలకు చేరింది. నిజానికి మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు ట్రేడింగ్ నష్టం రూ.20 లక్షల కోట్ల వరకు వెళ్లింది. అయితే.. ఆ తర్వాత రికవరీ కావటంతో నష్ట తీవ్రత కాస్త తగ్గింది. ఇదిలా ఉండగా ప్రపంచ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. హాంకాంగ్ మార్కెట్లు 13.6 శాతం నష్టపోతే.. తైవాన్ 9.6 శాతం.. జపాన్ 9.5 శాతం.. ఇటలీ 8.4 శాతం.. సింగపూర్ 8 శాతం మేర పతనం అయ్యాయి. ఇక.. స్వీడన్. చైనా.. స్విట్జర్లాండ్ సూచీలు 7 శాతం మేర నష్టపోయాయి. మరి.. మన సూచీల మాటేమిటంటే.. మన సూచీలు 3 శాతం మేర నష్టపోయినట్లుగా ట్రేడింగ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
