ప్రెసిడెంట్ గా ఉండటం ప్రమాదకరం... సుంకాలపై ట్విస్ట్ తో ట్రంప్ వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా... అధ్యక్ష పదవి ప్రమాదకరమైనదని, ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుందని వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 28 Jun 2025 1:55 PM ISTగతంలో ట్రంప్ పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవిని ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఆ పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని ఆయన తెలిపారు.
అవును... శుక్రవారం వైట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్... అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో ఉండగా గతేడాది పెన్సిల్వేనియాలో జరిగిన హత్యాయత్నాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా... అధ్యక్ష పదవి ప్రమాదకరమైనదని, ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో... ఈ పదవిని, బాధతలను ప్రమాదకరమైన ఇతర వృత్తులతో ఆయన పోల్చారు. ఇందులో భాగంగా.. కారు రేసింగ్, బుల్ రైడింగ్ లాగే ఇక్కడ కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమంటూ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయం తనకు ఎవరైనా ముందే చెప్పి ఉంటే.. తాను ఈ రేసులో ఉండేవాడిని కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా... గత ఏడాది పెన్సిల్వేనియాలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతుండగా.. సమీపంలోని ఓ భవనంపై నక్కిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్ ను రక్షించారు!
సుంకాలపై ట్రంప్ కొత్త ట్విస్ట్!:
ఇదే క్రమంలో... అమెరికా దిగుమతుల విషయంలో సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి తమకు స్వేచ్చ ఉందని చెప్పిన ట్రంప్.. సుంకాల విధింపును అనుకున్న సమయం కంటే కుదించవచ్చు లేదా పొడిగించవచ్చు అని అన్నారు. అయితే, తాను వ్యక్తిగతంగా తొందరగా ముగించడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. అయితే... అమెరికా కార్మిక దినోత్సవం (సెప్టెంబర్ 1) నాటికి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ సందర్భంగా కెనడాతో వాణిజ్య చర్చలపై స్పందించిన ట్రంప్.. వారితో చర్చలు ముగిసాయి అని ప్రకటించారు. ఇదే సమయంలో... అమెరికన్ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ ట్యాక్స్ ను దాడిగా అభివర్ణిస్తూ.. ఇది దారుణమని అన్నారు. దీనికి దీటుగా కెనడాపై కూడా సుంకాలు విధిస్తామని తెలిపారు. త్వరలో ఈ వివరాలు వెల్లడిస్తానని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో పేర్కొన్నారు.
