స్టేజీపై లైవ్ లో ఉండగా ఎన్వీడియా సీఈవోకు ట్రంప్ ఫోన్.. ఊహించని ట్విస్ట్
ఏఐ నియంత్రణ పేరుతో అభివృద్ధిని నెమ్మదింపజేస్తే అమెరికా తీవ్రంగా నష్టపోతుందని.. దాని ద్వారా ప్రత్యర్థి దేశమైన చైనానే ఎక్కువగా లాభపడుతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
By: A.N.Kumar | 15 Sept 2026 6:12 PM ISTఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. భవిష్యత్తులో ఏఐ వల్ల మనుషులకు ముప్పు వాటిల్లుతుందని.. రోబోలు ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటాయనే ప్రచారాన్ని ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. ఏఐ నియంత్రణ పేరుతో అభివృద్ధిని నెమ్మదింపజేస్తే అమెరికా తీవ్రంగా నష్టపోతుందని.. దాని ద్వారా ప్రత్యర్థి దేశమైన చైనానే ఎక్కువగా లాభపడుతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించిన 'ఆల్ ఇన్ సమ్మిట్' సదస్సులో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వేదికపై ప్రసంగిస్తుండగా ఊహించని విధంగా ట్రంప్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. హువాంగ్ ఆ కాల్‌ను స్వీకరించి స్పీకర్ ఆన్ చేయడంతో ట్రంప్ నేరుగా వేదికపై ఉన్న ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రాసెసర్లను డిజైన్ చేసే హువాంగ్ ఫోన్‌లో స్పీకర్ ఆన్ చేయడానికి కాస్త కంగారు పడటంపై ట్రంప్ సరదాగా చమత్కరించడంతో సదస్సులో నవ్వులు పూశాయి.
అనంతరం ఏఐ భవిష్యత్తుపై మాట్లాడిన ట్రంప్.. సాంకేతికత భద్రతపై జరుగుతున్న చర్చలను ప్రస్తావించారు. ఏఐ మనుషుల నియంత్రణ దాటిపోతుందన్న భయాలను ఒక అబద్ధంగా ప్రచారంగా ఆయన అభివర్ణించారు. ఏఐ రేసులో ఎవరు విజయం సాధిస్తే వారే ప్రపంచాన్ని శాసిస్తారని.. భవిష్యత్తులో ఈ సాంకేతికత ఇంటర్నెట్ కంటే కూడా అత్యంత కీలకమైనదిగా మారనుందని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీలు ఏఐ సాంకేతికతను వేగవంతంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతూ డేటా సెంటర్ల ప్రాముఖ్యతను ట్రంప్ ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. రాబోయే 20 నుంచి 25 ఏళ్ల కాలంలో డేటా సెంటర్లు అనేవి కొత్త "చమురు"తో సమానమని.. ఇవి దేశానికి, కంపెనీలకు భారీ ఆర్థిక సంపదను తెచ్చిపెడతాయని పేర్కొన్నారు. కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం వల్ల అమెరికా తన ప్రత్యర్థులకు స్వయంగా అవకాశం ఇచ్చినట్లవుతుందని అన్నారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఏఐ సాంకేతికత కేవలం కొన్ని బహుళజాతి టెక్ దిగ్గజాలకే పరిమితం కాకుండా ప్రతీ రంగానికి, ప్రతీ పౌరుడికి ప్రయోజనం చేకూరేలా ఎన్విడియా నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ మోడళ్లను నడపడానికి ఎన్విడియా తయారీ చిప్‌లు అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో లైవ్ వేదికపై జరిగిన ఈ సంభాషణ అంతర్జాతీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
