Begin typing your search above and press return to search.

ట్రంప్ పీచేముడ్.. ఇరాన్ తో డీల్.. యుద్ధానికి బ్రేక్

ఇరాన్‌తో కొనసాగుతున్న పోరుకు ఐదు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ సమాజంలో పెను సంచలనంగా మారింది.

By:  A.N.Kumar   |   23 March 2026 6:00 PM IST
ట్రంప్ పీచేముడ్.. ఇరాన్ తో డీల్.. యుద్ధానికి బ్రేక్
X

గత కొన్ని వారాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్-అమెరికా యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి కాస్త పక్కకు తొలిగాయి. పశ్చిమ ఆసియాలో భీకర దాడులతో విరుచుకుపడుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో కొనసాగుతున్న పోరుకు ఐదు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ సమాజంలో పెను సంచలనంగా మారింది.

ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్.. ఏం చెప్పారు?

ఎప్పటిలాగే తనదైన శైలిలో ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ ప్రకటన చేసిన ట్రంప్ ఇరాన్‌పై జరగాల్సిన భారీ దాడులను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్‌లోని అత్యంత కీలకమైన పవర్ ప్లాంట్లు, ఎనర్జీ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సిద్ధం చేసిన మిలిటరీ ఆపరేషన్లను ఐదు రోజుల పాటు నిలిపివేయాలని రక్షణ శాఖను ఆదేశించినట్లు తెలిపారు. "గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో జరిగిన గోప్యమైన చర్చలు ఆశాజనకంగా ఉన్నాయి. చర్చల ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉన్నప్పుడు బలప్రయోగం అవసరం లేదని భావిస్తున్నాం. అందుకే ఈ ఐదు రోజుల విరామం." అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

గోప్యంగా సాగిన చర్చలు.. తెరవెనుక ఏం జరిగింది?

యుద్ధం పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరగడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత 48 గంటలుగా తృతీయ పక్షం సహకారంతో అమెరికా, ఇరాన్ ఉన్నతాధికారులు కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చలు సఫలం కావడంతోనే ట్రంప్ ఈ సానుకూల నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ వైపు నుంచి కూడా శాంతి చర్చల పట్ల సానుకూల సంకేతాలు అందాయని.. అయితే అధికారికంగా టెహ్రాన్ నుంచి ఇంకా పూర్తిస్థాయి ప్రకటన రావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.

గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం

ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత భయాలతో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ తాత్కాలిక విరామ ప్రకటనతో చమురు ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సముద్ర మార్గాల ద్వారా జరిగే వాణిజ్యానికి ఈ విరామం కొంత ఊరటనిస్తుంది. యుద్ధ భయంతో కుదేలైన గ్లోబల్ మార్కెట్లు, ట్రంప్ ప్రకటనతో పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇది శాంతి ఒప్పందానికి నాందియా?

ప్రస్తుతానికి ఈ ఐదు రోజుల విరామం కేవలం యుద్ధాన్ని వాయిదా వేయడమేనా లేక శాశ్వత శాంతికి పునాది వేస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇరాన్ యొక్క అణు కార్యక్రమాలు, ప్రాంతీయ ఆధిపత్యం వంటి సంక్లిష్ట సమస్యలపై ఈ ఐదు రోజుల్లో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారైతేనే ఈ విరామం అర్థవంతంగా మారుతుంది. అయితే ఈ లోపు ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని పునరుద్ధరించుకోవడానికి ఈ సమయాన్ని వాడుకుంటుందా అనే అనుమానాలను కొందరు రక్షణ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి మాత్రం పశ్చిమ ఆసియాలో తుపాకీ గొట్టాలు నిశ్శబ్దమయ్యాయి. ఈ ఐదు రోజుల చర్చలు గనక సఫలమైతే ప్రపంచం మరో భారీ యుద్ధం నుంచి తప్పించుకున్నట్లే. రాబోయే 120 గంటలు ప్రపంచ శాంతికి అత్యంత కీలకం కానున్నాయి.