Begin typing your search above and press return to search.

ప్ర‌భావం లేదంటూనే.. 'బండ' బాదుడు!

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా చేస్తున్న యుద్ధం కార‌ణంగా.. చ‌మురు స‌ర‌ఫ‌రా చైన్‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతోంది.

By:  Garuda Media   |   7 March 2026 12:13 PM IST
ప్ర‌భావం లేదంటూనే.. బండ బాదుడు!
X

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా చేస్తున్న యుద్ధం కార‌ణంగా.. చ‌మురు స‌ర‌ఫ‌రా చైన్‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతోంది. ముఖ్యంగా ప‌శ్చిమాసియాలో కీల‌క‌మైన హొర్ముజ్ జ‌ల‌సంధిని ఇరాన్ త‌న నియంత్ర‌ణ‌లోకి తీసుకోవ‌డం.. నౌక‌ల ర‌వాణాపై ఆంక్ష‌లు విధించ‌డంతో చ‌మురు స‌హా గ్యాస్ ర‌వాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచ దేశాల‌పై చ‌మురు ఉత్ప‌త్తుల‌కు సంబంధించి ప్ర‌భావం ప‌డుతోంది.

అయితే.. భార‌త్ మాత్రం లేదు.. కాదు.. అంటూ ఇరాన్ ప్ర‌భావాన్ని త‌క్కువ చేసి చూపుతోంది. ''మ‌న‌పై పెద్ద‌గా ప్ర‌భావం లేదు. ఇదిప‌శ్చిమ దేశాల గొడ‌వ‌'' అంటూ.. కేంద్ర హోం శాఖ కూడా పేర్కొంది. ఇక‌, విదేశాంగ‌, ర‌క్ష‌ణ శాఖ‌లు కూడా.. మ‌న దేశంపై ప్ర‌భావం లేద‌ని చెప్పాయి. కానీ, మ‌రోవైపు.. స్టాక్ మార్కెట్ల ప‌రిస్థితి దారుణంగా మారింది. భారీ ప‌త‌నంతో ముందుకుసాగుతున్నాయి. ఇదేస‌మ‌యంలో డాల‌ర్ మార‌కం విలువ కూడా ప‌డిపోతోంది.

ఇన్ని జ‌రుగుతున్నప్ప‌టికీ. కేంద్ర ప్ర‌భుత్వం ఏమీ జ‌ర‌గ‌ద‌ని.. ఎవ‌రూ ఆందోళ‌న చెందొద్ద‌ని కూడా చెప్పే సింది. కానీ, దొడ్డిదారిలోరాత్రికి రాత్రి(శుక్ర‌వారం) గృహ వినియోగం స‌హా.. క‌మ‌ర్షియ‌ల్ వినియోగ గ్యాస్ సిలిండ‌ర్ల‌పై బండ బాదుడు బాదేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. రాత్రినుంచే ఇవి అమ‌ల్లోకి కూడా వ‌చ్చేశాయి. గ‌తంలో సిలిండ‌ర్ 20-30 మ‌ధ్య‌లో పెంచేందుకే ప్ర‌భుత్వాలు వెనుక ముందు ఆడేవి. ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని ఆలోచ‌న చేసేవి.కానీ, తాజాగా భారీ మొత్తంలో బండ బాదుడు బాదేశారు. మ‌రి పైకి ఏమీ లేద‌ని చెబుతున్న‌ప్పుడు.. ఇలా బండ బాదుడుఎందుక‌న్న‌ది విపక్షాల ప్ర‌శ్న‌.

ఇలా పెరిగాయి..

+ 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు పెంచారు.

+ దీంతో డొమెస్టిక్ సిలిండర్ ధర 905 రూపాయ‌ల‌ నుంచి ₹965కు చేరింది.

+ 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా 115 పెంచారు.

+ ఈ క్ర‌మంలో క‌మ‌ర్షియ‌ల్‌ సిలిండర్ ధర 1,961 నుంచి 2,076 రూపాల‌కు చేరింది.