Begin typing your search above and press return to search.

బాహుబలి సీన్ గుర్తుకు తెచ్చే అభిమానం అవసరమా మోడీజీ?

తాజాగా అలాంటి భారీ విగ్రహాన్నిఏర్పాటు చేసేందుకు ఒక వ్యాపారవేత్త ముందుకు రావటం ఒక ఎత్తు అయితే.. సదరు విగ్రహం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రావటం మరో విశేషంగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   31 Jan 2024 7:30 AM GMT
బాహుబలి సీన్ గుర్తుకు తెచ్చే అభిమానం అవసరమా మోడీజీ?
X

అభిమానం ఉండటం తప్పేం కాదు. ఆ పేరుతో చేసే కొన్ని అతి పనుల కారణంగా వారు అనుకున్నట్లుగా పేరు తర్వాత చెడ్డపేరు ఖాయం. తాజాగా చెప్పే ఉదంతం గురించి విన్నంతనే అప్రయత్నంగా బాహుబలి మూవీలో సీన్ గుర్తుకు రావటం ఖాయం. బాహుబలిలో అమరేంద్ర ప్రభాస్) బాహుబలి (ని కాకుండా కుయుక్తితో రాజు అయ్యే భల్లాలదేవ (రానా దగ్గుబాటి) తన వీరత్వానికి గుర్తుగా తన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ప్రారంభించే ప్రయత్నం చేయటం తెలిసిందే. తాజాగా అలాంటి భారీ విగ్రహాన్నిఏర్పాటు చేసేందుకు ఒక వ్యాపారవేత్త ముందుకు రావటం ఒక ఎత్తు అయితే.. సదరు విగ్రహం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రావటం మరో విశేషంగా చెప్పాలి.

రూ.200 కోట్ల సొంత ఖర్చుతో 190 అడుగుల నరేంద్ర మోడీ భారీ విగ్రహాన్ని తయారు చేయించాలని అసోం వ్యాపారవేత్త నవీన్ చంద్ర బోరా నిర్ణయించారు. ప్రధానమంత్రిపై తనకున్న అభిమానాన్ని కొత్త తరహాలో ప్రదర్శించారు. తన అభిమానాన్ని విభిన్నంగా ప్రదర్శించేందుకు వీలుగా ఆయన తన నిర్ణయాన్ని తీసుకున్నారు. అసోం రాష్ట్ర రాజధాని గువాహటి సిటీ సమీపంలోని తన సొంత ప్లేస్ లో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా నిర్ణయించి.. అందుకు తగ్గట్లు భూమిపూజను తాజాగా ప్రారంభించారు.

మూడు రోజుల పాటు సాగే ఈ పూజా కార్యక్రమం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. పీఠభాగంతో కలుపుకొని విగ్రహం ఎత్తు ఏకంగా 250 అడుగులు ఉంటుందని నవీన్ చంద్ర మీడియాకు వెల్లడించారు. విగ్రహం మెడ మీద అసోం కల్చర్ కు చిహ్నంగా గమోసా ఉంటుందని చెప్పారు. ఇంతకూ గమోసా అంటే.. అస్సామీలు ధరించే ఖద్దరు ఉత్తరీయం. విగ్రహ ప్రతిష్ఠాపన వివరాలతో గత ఏడాది ప్రధాని కార్యాలయానికి లేఖ పంపినట్లుగా ఆయన పేర్కొన్నారు.

ఎక్కడా కూడా జీవించి ఉన్న ప్రముఖుడి విగ్రహాల్ని ఏర్పాటు చేసేందుకు సదరు ప్రముఖులు అస్సలు ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా ఔత్సాహికులు ఈ తరహా నిర్ణయాన్ని తీసుకుంటే సదరు ప్రముఖులు ఆ నిర్ణయాన్ని ఖండిస్తుంటారు. మోడీ మీద అంత అభిమానమే ఉంటే.. చక్కటి ప్రమాణాలతో కూడిన భారీ ఆసుపత్రిని ఇదే ఖర్చుతో ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా? విగ్రహం కంటే సామాన్య ప్రజలకు మేలు చేసేలా ఏమైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వ్యాపారవేత్త అయిన నవీన్ చంద్రకు ఎందుకు రాలేదు? ఈ భారీ విగ్రహంపై ప్రధాని మోడీ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.