Begin typing your search above and press return to search.

గులాబీ నేత‌లు గాంధీభ‌వ‌న్లో ఏం చేస్తున్నారో తెలుసా కేసీఆర్ ?

ముఖ్యంగా ఇప్ప‌టికే త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ ర‌థ‌సార‌థి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఈ మేర‌కు పొలిటిక‌ల్ సీన్ చేంజ్ అవుతోంది.

By:  Tupaki Desk   |   4 Sep 2023 3:17 PM GMT
గులాబీ నేత‌లు గాంధీభ‌వ‌న్లో ఏం చేస్తున్నారో తెలుసా కేసీఆర్ ?
X

తెలంగాణ‌లో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో రాజ‌కీయం రస‌కందాయంలో ప‌డుతోంది. ముఖ్యంగా ఇప్ప‌టికే త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ ర‌థ‌సార‌థి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఈ మేర‌కు పొలిటిక‌ల్ సీన్ చేంజ్ అవుతోంది. బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థులుగా మెజార్టీ చోట్ల‌ సిట్టింగ్ ఎమ్మెల్యేలను బ‌రిలోకి దింపుతూ, పలుచోట్ల మాత్రం మార్పులు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మింగుడు ప‌డ‌ని రీతిలో స‌మీక‌ర‌ణాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. గులాబీ పార్టీ నేత‌ల అడ్డాగా గాంధీభ‌వ‌న్ మారుతోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు త‌మ త‌దుప‌రి పార్టీ హ‌స్తం అంటూ ప్లాన్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు కాకుండా ఇత‌ర నేత‌ల‌కు టికెట్ ఇచ్చిన వాటిలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఒక‌టి కాగా, నిర్మల్ జిల్లాలో ఉన్న ఖానాపూర్ నియోజకవర్గ మరొకటి. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉండడం అందుకు తగ్గట్లుగా గ్రౌండ్‌ ప్రిపేర్ చేసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆమెను ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా బ‌రిలోకి దింపేందుకు దరఖాస్తు చేసిన లేఖ‌ వైరల్ గా మారింది. తాజాగా స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ‌ రాజయ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహతో కలిసి మాదిగ సామాజిక వర్గ సమ్మేళనంలో పాల్గొనడంతో ఆయ‌న అడుగులు కూడా కాంగ్రెస్ వైపేన‌న్న టాక్ వినిపిస్తోంది. తనకు బీఫాం డౌట్ అనే విషయం రూఢీ అయిన నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండగా తాజా సమీకరణలో ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందునా కీల‌క నియోజకవర్గాల‌కు చెందిన సీనియర్లు కాంగ్రెస్ పార్టీ వైపు తమ అడుగులు ఉంటాయని సిగ్న‌ల్స్ ఇస్తుండ‌టం స‌హ‌జంగానే గులాబీ శ్రేణుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించే దిశగా తమ చర్యలు ఉంటాయని తెచ్చి చెప్తుండ‌టం కేసీఆర్‌కు సమస్యగా మారే అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలే కాకుండా మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సైతం ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌, బీఫాంలు అందజేసే సమయం వరకు ఎదురుచూసి అనంతరం హస్తం కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమైనట్లు స్థానిక నేతలు అంతర్గత సంభాషణలో స్పష్టం చేస్తున్నారు.