Begin typing your search above and press return to search.

తీవ్రమైన గాయంచేసి మళ్ళీ మందువేయటం అంటే నమ్ముతారా ?

ఏపీ డెవలప్మెంట్ కు ప్రత్యేకహోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అంశాలను బిల్లులో పెట్టి పార్లమెంటులో ఆమోదించిందా ?

By:  Tupaki Desk   |   1 Feb 2024 4:30 PM GMT
తీవ్రమైన గాయంచేసి మళ్ళీ మందువేయటం అంటే నమ్ముతారా ?
X

తీవ్రమైన గాయంచేసి మళ్ళీ మందువేయటం అంటే కాంగ్రెస్ వ్యవహారమే. విషయం ఏమిటంటే పచ్చగా కళకళలాడుతున్న ఏపీని రెండుగా విభజించిందే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ. పోనీ విభజన అయినా సక్రమంగా చేసిందా అంటే లేకుండా అడ్డుగోలుగా చేసింది. ఆస్తులు, పాడిఆవు లాంటి ఆదాయాన్నిచ్చే హైదరాబాద్ ను తెలంగాణాకు రాజధానిగా చేసింది. అప్పులను ఏపీ మొహాన కొట్టింది. ఏపీ డెవలప్మెంట్ కు ప్రత్యేకహోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అంశాలను బిల్లులో పెట్టి పార్లమెంటులో ఆమోదించిందా ?

రైల్వేజోన్ అంశంపై నూరుశాతం క్లారిటి లేకుండా చేసి హోదాపై పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో ప్రకటన మాత్రం ఇప్పించింది. దాంతో 2014 ఎన్నికల్లో యూపీఏ ఘోరంగా ఓడిపోయి ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నారు. ఏపీ ఈరోజు ఇంతటి దీనస్ధితిలో ఉందంటే అందుకు మొదటి కారణం తర్వాత బీజేపీ మిగిలిన పార్టీలనే చెప్పాలి.

కాంగ్రెస్ మీద మంటతోనే జనాలు పార్టీని భూస్ధాపితం చేసేశారు. గడచిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంతమందికి డిపాజిట్లు వచ్చాయంటే చెప్పటం కష్టమే. అలాంటిది రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ప్రత్యేకహోదా, రైల్వేజోన్ లాంటి అంశాలను ఎన్నికల అంశాలుగా చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. అందుకనే ఈ అంశాలపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాగాలు తీస్తున్నారు. ఇదే విషయమై పార్టీ అగ్రనేతలతో తీర్మానాలు చేయించేందుకు రాష్ట్రంలోని ముఖ్యనేతలతో గురువారం ఢిల్లీలో సమావేశం జరగబోతోంది.

కాంగ్రెస్ ఎన్ని తీర్మానాలు చేసినా జనాలు పట్టించుకోరు. ఎందుకంటే ఏపీకి కాంగ్రెస్ పార్టీచేసిన ద్రోహం అలాంటిది. ఏపీకి చేసిన ద్రోహానికి ముందు సోనియా, రాహుల్ లాంటి వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెబితే అప్పుడు జనాలు శాంతిస్తారేమో చూడాలి. అంతవరకు చేసిన ద్రోహానికి తగిన శాస్తిని అనుభవించాల్సిందే. పచ్చని రాష్ట్రాన్ని అడ్డుగోలుగా చీల్చినందుకు రెండు ఎన్నికల్లో తెలంగాణాలో కూడా అంతకంతా అనుభవించింది. ఇంకా ఏపీ విషయంలోనే పాప పరిహారం ఎప్పుడవుతుందో చూడాలి.