పార్లమెంట్ లో ప్రధాని సీటు వద్ద ఏమిటా బ్యానర్.. వీడియో వైరల్!
ఈ సందర్భంగా దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన రిజిజు... కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీల అత్యంత అవమానకరమైన ప్రవర్తన పట్ల గర్వపడుతోందంటూ ఎద్దేవా చేశారు.
By: Raja Ch | 10 Feb 2026 3:47 PM ISTపార్లమెంట్ సమావేశాల్లో రెగ్యులర్ గా కనిపించే సంఘటనలకు మించి పలు కీలక పరిణామాలు తాజా సమావేశాల్లో ఉభయ సభల్లోనూ చోటు చేసుకుంటున్నాయి! ఈ నెల ఐదో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్నికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించాల్సి ఉండగా... ఆయనను లోక్ సభకు రావొద్దని తాను విజ్ఞప్తి చేసినట్లు స్పీకర్ ఓ బిర్లా వ్యాఖ్యానించారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు, అందుకు ఆయన చెప్పిన కారణం సంచలనంగా మారింది.
ఇందులో భాగంగా... ప్రధానిపై దాడి చేసేలా పలువురు ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించారని.. పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రధానిని అగౌరవపరచవచ్చనే ముందస్తు సమాచారంతోనే ఆయనను సభకు రావొద్దని విజ్ఞప్తి చేసినట్లు ఓం బిర్లా అన్నారు! అయితే... సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... మోడీని అగౌరవపరిచేందుకు, ఆయనను చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ ఎంపీలు ప్లాన్ చేసినట్లు తనకు సమాచారం ఉందని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించిన నేపథ్యంలో.. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు! ఇందులో... ఫిబ్రవరి 4వ తేదీన లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలు ఓ బ్యానర్ పట్టుకుని ప్రధాని మోడీ కుర్చీ దగ్గరకు వెళ్లి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన రిజిజు... కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీల అత్యంత అవమానకరమైన ప్రవర్తన పట్ల గర్వపడుతోందంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో.. మనం అందరం బీజేపీ ఎంపీలను ఆపి.. ఆ మహిళా ఎంపీలను, కాంగ్రెస్ ఎంపీలను ఎదుర్కోవడానికి అనుమతించకపోతే.. అదికాస్తా చాలా వికారమైన సన్నివేశానికి దారితీసేదని.. పార్లమెంట్ గౌరవాన్ని, పవిత్రతను కాపాడటానికి తాము సహనంతో ఉండాల్సివచ్చిందని అన్నారు.
రిజిజు షేర్ చేసిన వీడియోలో కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్ సభ మహిళా ఎంపీలు బ్యానర్ పట్టుకొని నినాదాలు చేస్తూ.. ప్రధానమంత్రి సీటు వద్ద ఆందోళన చేస్తున్నట్లు కనిపించారు! ఈ సమయంలో కేంద్రమంత్రులు రిజిజు, గిరిరాజ్ సింగ్ లు కల్పించుకుని.. ఆందోళనను విరమించుకోవాలని కోరుతున్నారు. అయినప్పటికీ ఆ మహిళా ఎంపీలు అక్కడ నుంచి కదలలేదు! లోక్ సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వడం లేదనేది వారి ప్రధాన ఆరోపణగా ఉంది!
మరోవైపు ఆ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ప్రధాని నరేంద్ర మోడీ సీటు వద్ద ప్రదర్శించిన బ్యానర్ లో... "మీరు ఉత్తమంగా భావించేది చేయండి" అని రాసి ఉన్నట్లు తెలుస్తోంది! ఇది.. జనరల్ (రిటైర్డ్) ఎంఎం నరవణే రాసిన పుస్తకం "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ" ఆధారంగా ఒక మ్యాగజైన్ కథనంలోని ఒక వాక్యాన్ని సూచిస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్థావించడమే.. తాజా సమావేశాల్లో హాట్ టాపిక్ గా మారింది.
