Begin typing your search above and press return to search.

ఆరు నెలల ‘డెడ్‌లైన్’.. స్టాలిన్ కోసం తిరుచ్చి సీటు రెడీ!

రాజకీయాల్లో ఓటమి అనేది ఒక తాత్కాలిక విరామం లాంటిది అంటారు కానీ, పీఠం చేజారిన డీఎంకే (DMK) నేతలకు మాత్రం అది అస్సలు జీర్ణం కావడం లేదు.

By:  Tupaki Desk   |   18 May 2026 10:43 AM IST
ఆరు నెలల ‘డెడ్‌లైన్’.. స్టాలిన్ కోసం తిరుచ్చి సీటు రెడీ!
X

రాజకీయాల్లో ఓటమి అనేది ఒక తాత్కాలిక విరామం లాంటిది అంటారు కానీ, పీఠం చేజారిన డీఎంకే (DMK) నేతలకు మాత్రం అది అస్సలు జీర్ణం కావడం లేదు. కొత్తగా వచ్చిన విజయ్ సర్కార్‌ను చూసి ఈర్ష్య పడాలో లేక సొంత ఓటమిని చూసి ఏడవాలో తెలియక, ఇప్పుడు ‘జోస్యాలు’ చెప్పడం మొదలుపెట్టారు. దళపతి విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కేవలం ఆరు నెలల ముచ్చటేనంటూ డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ బాంబు పేల్చారు. ఆయన మాటలు వింటుంటే.. తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం నడుస్తోందో లేక వీకెండ్ షో నడుస్తోందో అర్థం కావడం లేదు. ఆరు నెలల్లో విజయ్ కుర్చీ ఖాళీ అయిపోతుందని, మళ్లీ స్టాలిన్ సింహాసనం ఎక్కుతారని ఆయన గట్టిగా ఫిక్స్ అయిపోయారు.

సింగపూర్‌ను ఓడించిన ‘పనికిరాని’ ఓటర్లు!

అనితా రాధాకృష్ణన్ ఆవేదన అంతటితో ఆగలేదు. తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరును స్టాలిన్ అచ్చం ‘సింగపూర్’ లా మార్చేశారట! అయినా సరే, అక్కడి ఓటర్లు కృతజ్ఞత లేకుండా స్టాలిన్ ను ఎమ్మెల్యేగా ఓడించేశారంటూ ఆయన ఓటర్ల మీద విరుచుకుపడ్డారు. ‘అంతలా డెవలప్ చేస్తే ఓడించేస్తారా.. మీరంతా పనికిరాని వాళ్లు’ అంటూ ప్రజాస్వామ్యంలో ఓటు వేసిన ప్రజలకే సర్టిఫికెట్ ఇచ్చేశారు. పాపం, కొలత్తూరు ప్రజలు తాము సింగపూర్‌లో ఉంటున్నామనే సత్యాన్ని గ్రహించలేకపోయారని రాధాకృష్ణన్ తెగ బాధపడిపోతున్నారు. మరి అంతగా అభివృద్ధి చేస్తే ఎందుకు ఓడించారో ఆ ఓటర్లకే తెలియాలి.

తిరుచ్చి ఈస్ట్ నుంచి స్టాలిన్ రీ-ఎంట్రీ?

ఎమ్మెల్యేగా ఓడిపోయిన స్టాలిన్ మళ్లీ అసెంబ్లీకి పంపించడానికి డీఎంకే తమ్ముళ్లు ఇప్పుడే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో స్టాలిన్ ను ‘తిరుచ్చి ఈస్ట్’ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని కోరుకుంటున్నట్లు అనితా రాధాకృష్ణన్ వెల్లడించారు. కొలత్తూరు జనం విలువ తెలియక ఓడించినా, తిరుచ్చి ప్రజలు మాత్రం స్టాలిన్ ను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారని నమ్ముతున్నారు. అంటే, విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఒకవైపు స్కెచ్ వేస్తూనే, మరోవైపు స్టాలిన్ ను సేఫ్ సీటు వెతికే పనిలో పడ్డారన్నమాట.

సంకీర్ణ సర్కార్‌పై డీఎంకే ఆశలు

విజయ్ ప్రభుత్వం కూలిపోతుందనే నమ్మకం డీఎంకే నేతల్లో ఎందుకు ఉందంటే.. అది 'సంకీర్ణ' ప్రభుత్వం కాబట్టి. చిన్న చిన్న పార్టీల మద్దతుతో నడుస్తున్న విజయ్ సర్కార్‌లో ఎప్పుడు ఏ ముఠా తిరుగుబాటు చేస్తుందో, ఎప్పుడు మద్దతు ఉపసంహరించుకుంటుందో అని డీఎంకే ఎదురుచూస్తోంది. ‘నువ్వు ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీకి కూడా నా అంత విలువ ఇస్తా అన్నావు కదా.. రేపు వాళ్లే నీకు షాక్ ఇస్తారు చూడు’ అనే కసితో డీఎంకే క్యాంప్ ఉంది. ఆరు నెలల కాల పరిమితి పెట్టారంటే, తెరవెనుక ఏవైనా ‘ఆపరేషన్లు’ ప్లాన్ చేస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

స్క్రిప్ట్ వర్సెస్ పొలిటికల్ రియాలిటీ

విజయ్ తన సినిమాల్లో విలన్లను మూడు గంటల్లో ఖతం చేయవచ్చు కానీ, రియల్ పాలిటిక్స్‌లో ఐదేళ్ల పాటు కుర్చీని కాపాడుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా డీఎంకే లాంటి బలంగా ఉన్న పార్టీలు పొంచి ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అనితా రాధాకృష్ణన్ చెప్పినట్లు ఆరు నెలల్లో విజయ్ సర్కార్ కూలుతుందా? లేక విజయ్ తన ‘సినిమాటిక్’ వ్యూహాలతో డీఎంకే ఆశలపై నీళ్లు చల్లుతాడా? అన్నది చూడాలి. అయితే, ఓటర్లను ‘పనికిరాని వాళ్లు’ అనడం ద్వారా డీఎంకే తన గోతిని తానే తవ్వుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తమిళనాడు రాజకీయం ఇప్పుడు ‘ఆరు నెలల’ ఆటగా మారింది. విజయ్ ‘టీవీకే’ మనుగడ సాగిస్తుందో లేక స్టాలిన్ ‘సింగపూర్’ మోడల్ మళ్లీ రిటర్న్ వస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే!